(ఇంద్రాణి)
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ సంకటస్థితిని ఎదుర్కొంటున్నారా లేక సంకటస్థితిని సృష్టిస్తున్నారా? గోవా స్పీకర్‌గా ఉన్నప్పుడు ఆయన ఎంత ప్రశంసలు అందుకున్నారో, తమిళనాడులో అంత అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. గవర్నర్ వ్యవస్థ పట్ల రాజ్యాంగనిర్మాతల ఉద్దేశ్యం.. రాష్ట్రప్రభుత్వ ఏర్పాటులో బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలనేది. గవర్నర్ పదవి అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలని, వారు ఏ రాజకీయ పార్టీ సభ్యులూ అయి ఉండరాదని రాజ్యాంగ నిర్మాతలు నిబంధన పెట్టడం వెనుక ఒక ఉదాత్తమైన అభిలాష ఉన్నది.
కేంద్రంలో అధికారంలో ఉన్నవారే గవర్నర్ల నియామకం చేపడతారు. కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండవలసిన వ్యక్తి, అందులో ఒక రాజకీయపార్టీకి చెందిన వ్యక్తి అయి ఉంటే.. నిష్పక్షపాతంగా వ్యవహరించడం అసాధ్యం అని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ దానికి వక్రభాష్యం చెప్పి, కేంద్రప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలోని ‘రాజకీయ నిరుద్యోగులను’ గవర్నర్లుగా నియమిస్తున్నాయి.
గవర్నర్‌గా నియామకం జరగడానికి ముందు వారు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పార్టీకి రాజీనామా సమర్పించినంత మాత్రాన, వారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించలేరని దొడ్డిదారిన ఎన్టీఆర్ ను గద్దె దింపిన రాంలాల్ లాంటి వారు నిరూపించారు. దేశంలో గవర్నర్ వ్యవస్థ ఇంతగా వివాదాస్పదం కావడానికి ప్రధాన కారణం.. డబుల్ ఇంజన్ సర్కార్ కాకపోతే గవర్నర్ల ద్వారా కేంద్రమే రాష్ట్రాలను పరిపాలించడం. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గవర్నర్ల పాత్ర కీలకం అయిపోయింది.
ఇప్పుడు తమిళనాడు గవర్నర్ ప్రవర్తన దేశంలో గవర్నర్ల ద్వంద్వ నీతికి అద్దం పడుతున్నది. సాధారణంగా ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీ ఏ పార్టీకీ రాని సందర్భాలలో, ముందుగా అందరికంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్లు ఆహ్వానిస్తారు. ఇప్పుడు విజయ్ అవసరమైన మెజారిటీకి దగ్గరగా ఉన్నాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని గవర్నర్‌కు విన్నవించాడు. కానీ “మెజారిటీని నిరూపించుకుంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తాను” అని విజయ్ చేసిన విజ్ఞప్తిని గవర్నర్ తోసిపుచ్చారు.
ఈ బల నిరూపణ అనేది రాజ్‌భవన్‌లో కాకుండా శాసనసభలో నిరూపించుకోవాలి అని ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇది పూర్తిగా వ్యతిరేకం. విజయ్ కాంగ్రెస్ మద్దతు తీసుకోకుండా తనకు వచ్చిన 107 సీట్లతో వెళ్లి గవర్నర్‌ను కలిసి ఉంటే, ఈ సమయానికి విజయ్ ప్రమాణస్వీకారం అయిపోయి ఉండేదని తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు. విజయ్ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం అనేది గవర్నర్ విచక్షణాధికారమే అనడంలో సందేహం లేదు. దానికి ఏమీ ప్రోటోకాల్ ఉండకపోవచ్చు, కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా, ఒక్కో గవర్నర్ ఒక్కోరకంగా వ్యవహరిస్తే వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది?
2018లో కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాలలో పెను సంచలనం సృష్టించాయి. ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్వతంత్రంగా పోటీ చేసిన కాంగ్రెస్‌కు 78 సీట్లు, జేడీఎస్‌కు 37 సీట్లు వచ్చాయి. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కాంగ్రెస్, జేడీఎస్ కూటమిగా ఏర్పడి మ్యాజిక్ ఫిగర్ 113 సంఖ్యను దాటి, 115 సంఖ్యాబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు లేఖ సమర్పించారు. అనూహ్యంగా నాటి గవర్నర్ వాజుభాయ్ వాలా.. 115 మంది శాసనసభ్యుల బలం కలిగిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కాకుండా, 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
మెజారిటీ నిరూపించుకోవటానికి ఏకంగా 15 రోజుల గడువును కూడా ఇచ్చారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అర్ధరాత్రి దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టింది. సుప్రీంకోర్టు గవర్నర్ నిర్ణయాన్ని తప్పు పట్టలేని పరిస్థితుల్లో బలనిరూపణ గడువును 24 గంటలకు కుదించింది. 15 రోజుల గడువు ఉంటే కూటమిపార్టీలను చీల్చి చెండాడేవారేమో కానీ, సమయం సరిపోక ఫ్లోర్ మీద బల నిరూపణకు రాకముందే యడ్యూరప్ప రాజీనామా చేశారు.
మెజారిటీ లేని పార్టీని పిలవడం వెనుక ‘హార్స్ ట్రేడింగ్’ (గుర్రపు బేరాలు) అవకాశాలు వస్తాయని భావించిన వారికి నిరాశ మిగిలిందని విమర్శకులు వ్యాఖ్యానించారు. కర్ణాటకలో అప్పుడు గవర్నర్‌గా ఉన్న వాజుభాయ్ వాలా.. గుజరాత్ బీజేపీలో కీలక వ్యక్తి కావడమే కాకుండా, బీజేపీ హయాంలో స్పీకర్‌గా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్నవారు.
2019లో మహారాష్ట్రలో మరో ఘోర దురంతం అని చెప్పుకోదగిన రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. శాసనసభ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి పీఠం కోసం ఒకరితో ఒకరు విభేదించి బీజేపీ-శివసేన విడిపోయాయి. ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపోయే సంఖ్యాబలం లేకపోవడంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. అటువంటి సమయంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ‘మహా వికాస్ అఘాడీ’గా ఏర్పడి ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిని చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి.
మహా వికాస్ అఘాడీ ఏర్పాటును లోపాయికారిగా తెలుసుకున్న బీజేపీ, ఎన్సీపీ నుండి అజిత్ పవార్‌ను చీల్చి తమ వైపుకు తిప్పుకున్నది. తెల్లవారితే మహా వికాస్ అఘాడీ గవర్నర్‌ను కలిసి తమ బలాన్ని తెలుపుతూ లేఖ సమర్పించాలని నిర్ణయించుకున్నది. కానీ ఈలోపుగానే నవంబర్ 23 తెల్లవారుజామున 5:47 నిమిషాలకు, ప్రధానమంత్రి క్యాబినెట్ ఆమోదం అవసరం లేకుండానే రూల్ 12 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి పాలనను ఎత్తివేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేశారు. ఆఘమేఘాల మీద గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ప్రధానమంత్రి ఆదేశాలను అమలు చేసి, ఉదయం 7:55 నిమిషాలకే దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
కానీ అజిత్ పవార్ తనకు మద్దతు ఇస్తారని గవర్నర్‌కు సమర్పించిన లేఖలోని శాసనసభ్యులు ఆయనకు మద్దతు తెలపలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే బలనిరూపణ చేయవలసి రాగానే, అబద్ధపు లేఖతో ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ రాజీనామా చేశారు. దాంతో దేవేంద్ర ఫడ్నవీస్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశారు. ఈ సంఘటనను రాజకీయ విశ్లేషకులు ‘అర్ధరాత్రి రాజకీయం’ అనటమే కాక, 2019 నవంబర్ 23ను ఒక ‘చీకటి రోజు’గా అభివర్ణిస్తారు.
ఆనాటి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఉత్తరాఖండ్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు తమిళనాడులో అదే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. కానీ ఇలాంటి సంఘటనలు గవర్నర్ వ్యవస్థను దుర్బలపరచడమే కాక, దానిని పెంచి పోషించే పార్టీలకు కూడా విలువను తగ్గిస్తాయి.
గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి, హార్స్ ట్రేడింగ్‌తో పార్టీలను చీల్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి మధ్య ఉన్న ప్రజాస్వామ్య రేఖను చెరిపివేయడం వల్ల వ్యవస్థలు భ్రష్టు పట్టిపోతున్నాయి. గవర్నర్ అంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణంలో కీలక వ్యక్తి కావచ్చు కానీ, వారికి నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉంటాయి. ఈరోజు అధికార బలం చూపించేవారే, రేపు తలదించుకోక తప్పని పరిస్థితి వస్తుంది అనేది మరచిపోకూడదు.!