Suryaa.co.in

Editorial

టీటీడీ చట్టంతో కొత్త బోర్డుకు చిక్కులు

– యాక్టులో లేని ప్రత్యేక ఆహ్వానితులు
– ఎక్స్‌అఫీషియోలకూ ‘సెక్యులర్’ సంకటం
– కోర్టుకెళితే సర్కారు నెగ్గడం కష్టమేనంటున్న న్యాయనిపుణులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సర్కారు కొత్తగా వేసిన టీటీడీ బోర్డుకు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. 50 మంది ప్రత్యేక ఆహ్వానితులతో, జగన్ సర్కారు నియమించిన బోర్డు వివాదాస్పదమైన నేపథ్యంలో.. ఇప్పుడు అసలు ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్‌అఫిషియో సభ్యుల పోస్టులే వివాదంగా మారాయి. నిజానికి టీటీడీ యాక్టులో ప్రత్యేక ఆహ్వానితులు అనే పదమే లేదు. అయినా చంద్రబాబునాయుడు హయాంలో ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినప్పటికీ, అప్పుడు దానిపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 50 మందికి చేరడంతో, ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి టీటీడీ యాక్టుపై మళ్లేందుకు కారణమయింది.
నిజానికి టీటీడీ యాక్ట్ ఆఫ్ నెంబర్ 30 ఆఫ్ 1987 (అమైండెడ్ అప్ టు 2008) ది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ప్రకారం… తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో, ‘ప్రత్యేక ఆహ్వానితుల’న్న పదం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అసలు సలహాదారుల పోస్టు లేకపోయినా, వైఎస్ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారి పివిఆర్‌కె ప్రసాద్ సేవలు వినియోగించుకునేందుకు ఆ పదవి సృష్టించారు. కానీ ఆ హోదా అధికారాలు కూడా పరిమితంగానే ఉండేవి.
వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు, అసలు టీటీడీలో తుడా చైర్మన్‌కు ఎక్స్‌అఫిషియో హోదా లేదు. కానీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోసం ఆ హోదా సృష్టించారు. తర్వాత తిరుపతి ఎమ్మెల్యేకు సైతం, ఎప్పుడూ టీటీడీలో ఎక్స్‌అఫిషియో హోదా లేదు. తన మిత్రుడైన నాటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కోసం ఆ హోదా సృష్టించి, ఆయనను టీటీడీలో చేర్చారు. దీనిపైనా అప్పట్లో పెద్ద చర్చ జరగలేదు.
టీ టీడీలో ఈఓ, ఎండోమెంట్ కమిషనర్ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా మాత్రమే ఉండేవారు. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ రెవిన్యూ (ఎండోమెంట్స్)ను ఆ హోదాలో నియమించారు. రోశయ్య ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎండోమెంట్స్) స్థానంలో, ఫైనాన్స్ సెక్రటరీని చేర్చారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా అదే పద్ధతి అనుసరించారు. జగన్ సీఎం అయిన తర్వాత ఎక్స్‌అఫిషియో సభ్యుల్లో ఆ ముగ్గురితోపాటు, తుడా చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యేను కూడా చేర్చారు.
ఇప్పుడు ఎక్స్‌అఫిషియో సభ్యులతోపాటు, ప్రత్యేక ఆహ్వానితుల హోదాలు కూడా వివాదం కావడంతో, కొందరు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రిన్సిపల్ సెక్రటరీ రెవిన్యూ (ఎండోమెంట్స్) అనేది సెక్యులర్ పోస్ట్. ఆ పదవిలో క్రైస్తవుడయినా, ముస్లిం ఐఏఎస్ అధికారయినా ఉండవచ్చు. మరి కేవలం హిందువులకు మాత్రమే పరిమితమయిన టీటీడీ బోర్డులో, అన్యమతస్తులు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉండవచ్చా అన్నది.. ఇప్పుడు తెరపైకొచ్చిన ఒక వివాదం. ఎలాగూ టీటీడీ ఈఓ, ఎండోమెంట్ కమిషనర్‌గా హిందువైన ఐఏఎస్ అధికారులే ఉంటారు కాబట్టి, ఇప్పటివరకూ దానిపై ఎలాంటి వివాదం తలెత్తలేదు.
అదేవిధంగా తుడా చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే కూడా సెక్యులర్ పోస్టులే. ఆ రెండు పోస్టుల్లో రాజకీయ పార్టీలు, అధికార పార్టీకి చెందిన క్రైస్తవ-ముస్లిం నాయకులు ఎవరైనా ఉండవచ్చు. వేరే మతానికి చెందిన వారు తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నిక కావచ్చు. మరో మతానికి చెందిన వ్యక్తి తుడా చైర్మన్‌గా నియమితుడు కావచ్చు. అప్పుడు ఆ వ్యక్తులు టీటీడీ బోర్డులో, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఎలా ఉంటారన్నది ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన వివాదం. అన్యమతస్తులకు టీటీడీ బోర్డులో స్థానం లేనప్పుడు, ఒకవేళ ఇతర మతాలకు చెందిన తుడా చైర్మన్-తిరుపతి ఎమ్మెల్యేలు, బోర్డులో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉండటం.. బోర్డు యాక్టుకు విరుద్ధమన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అందుకే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవిన్యూ (ఎండోమెంట్), తిరుపతి ఎమ్మెల్యే, తుడా చైర్మన్‌లను ఎక్స్‌అఫిషియో సభ్యులుగా తొలగించాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే, ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటు కాదన్నది న్యాయకోవిదుల వాదన.
ఇక అసలు టీటీడీ యాక్టులో ప్రత్యేక ఆహ్వానితులు అన్న పదమే లేనప్పుడు, 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం కూడా యాక్టుకు విరుద్ధమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా ఎవరైనా కోర్టుకెళ్లినా, ప్రభుత్వ నియామకం నిలబడదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘‘ అసలు సెక్యులర్ పోస్టులయిన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవిన్యూ ఎండోమెంట్స్, తుడా చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యేలను ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నియమించడమే టీటీడీ యాక్టును వెక్కిరించడం. ఇది టీటీడీ ప్రతిష్ఠను ఉల్లంఘించడమే. అసలు కొండను ఏం చేద్దామనుకుంటున్నారో అర్ధం కావడం లేదు. ప్రత్యేక ఆహ్వానితులన్న ఊసే యాక్టులో లేనప్పుడు, ఏకంగా 50 మందిని ఎలా వేస్తారు? కావాలంటే ఉన్న 50 మందిని కూడా చట్టంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని, బోర్డు సభ్యులుగా వేసుకోవచ్చు. గతంలో 15 మంది ఉన్న వారిని ఇప్పుడు పెంచుకున్నట్లే దాన్నీ పెంచుకోవచ్చు. అయితే ఇప్పటి ప్రభుత్వ నిర్ణయంపై ఎవరైనా కోర్టుకు వెళితే, ప్రభుత్వ నియామకాలు నిలబడవు. అన్ని విషయాల్లోనూ మొండిగా వెళుతున్న జగన్ ప్రభుత్వం, చివరకు టీటీడీ విషయంలో కూడా అదే మొండి వైఖరి ప్రదర్శించడం, హిందువుల మనోభావాలను గాయపరచడమే’నని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ వ్యాఖ్యానించారు.
కాగా దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలయిన శబరిమల అయ్యప్పస్వామి, జమ్ము వైష్ణవిదేవి ఆలయం, మధుర మీనాక్షి, కంచి కామాక్షి వంటి ఆలయాలకు సైతం ఎక్కడా ప్రత్యేక ఆహ్వానితులు లేరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘ జగన్ ప్రభుత్వ పద్ధతి అంతా విచిత్రంగా ఉంది. ఈవిధంగా ప్రత్యేక ఆహ్వానితులను వేసిన ఆయన.. రోమ్‌లోని వాటికన్‌సిటీ చర్చిలో ఎవరైనా ప్రత్యేక ఆహ్వానితులున్నారేమో ఓసారి వెళ్లి చూస్తే మంచిదని’ రమణ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కాగా..సెక్యులర్ అయిన సీఎం పదవిలో ఉన్న ఎవరైనా.. టీటీడీ నియామకాల్లో జోక్యం చేసుకోకూడదని, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. చివరకు హిందూమతస్తుడైన సీఎం ఉన్నప్పటికీ, హిందూ ధర్మం తెలిసిన పీఠాథిపతులు గానీ, ఇతర హిందూమత పెద్దల సలహాతో గానీ సభ్యులను నియమించాల్సి ఉందన్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా సెక్యులర్ పోస్టుల్లో ఉన్న వారిని నియమించకూడదని, తాను గతంలోనే ప్రభుత్వానికి సూచించానని టీటీడీ ఈఓగా కూడా పనిచేసిన ఎల్వీఎస్ వెల్లడించారు. టీటీడీ యాక్టులో ప్రత్యేక ఆహ్వానితులన్న పదం లేని మాట నిజమేనని అంగీకరించారు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే ప్రభుత్వ నిర్ణయం చెల్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE