Suryaa.co.in

Andhra Pradesh

దిశ బిల్లు ప్రతులను కాల్చడమంటే.. మహిళల్ని అవమానించడమే

– లోకేష్ పై మహిళా కమిషన్ ధ్వజం
– ప్రభుత్వ పథకాలు, మహిళాసాధికారత ఫలితాలపై సదస్సులు
– మీడియాతో”వాసిరెడ్డి ” వెల్లడి
గుంటూరు: మహిళలకు అరచేతిలో రక్షణ, భద్రతకు సంబంధించిన ‘దిశ’ చట్టం ప్రతులను కాల్చడమంటే మహిళల్ని అవమానించడమే నని ప్రతిపక్ష నేత నారా లోకేష్ పై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. దిశను కాల్చారంటే టీడీపీ నేతలకు, లోకేశ్‌కు చట్టంపై ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని ఆమె ధ్వజమెత్తారు. శనివారం గుంటూరు జిల్లా జైలు సందర్శన సందర్భంగా వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. లోకేష్ ‘దిశ’ బిల్లు ప్రతులను కాల్చి మహిళలను అవమాన పరిచారని…మహిళా హక్కులను కాలరాసే దుర్మార్గానికి ఒడిగట్టడం సిగ్గుచేటని ఖండించారు.
మహిళల భద్రత విషయంలో టీడీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు వాస్తవాలు గమనించి, దిశచట్టంపై పార్లమెంట్‌లో, కేంద్రపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవాలని సూచించారు. దిశ చట్టం ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందలేదని, అయినప్పటికీ ఆ చట్టంలో నిర్దేశించుకున్న విధంగా 1,600కు పైగా కేసుల్లో వారం రోజుల్లోనే చార్జ్‌షీట్‌ దాఖలు చేశామని ఆమె స్పష్టం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో బంగారు భవిష్యత్ అందిస్తున్నారని, అన్ని పథకాల్లో మహిళలకే ప్రభుత్వం భాగస్వామ్యం కల్పిస్తోందని తెలిపారు. ప్రతిపక్షాల వల్లే మహిళాలోకానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. మహిళలపై ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తోందని గుర్తుశారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే రెండేళ్లలో 4శాతం క్రైం రేటు తగ్గిందని, మహిళా సాధికారత అనే పదాన్ని దేశానికి పరిచయం చేసిందే సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత ఫలితాలపై రాష్ర్ట వ్యాప్తంగా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వివిధరంగాలకు చెందిన మేధావులతో చర్చాగోష్టులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా ఈనెల 23, 24 తేదీల్లో తిరుపతి, కడప 28, 29 న శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కేంద్రాల్లో సదస్సులు పెట్టి మేధావులతో చర్చించనున్నట్లు వాసిరెడ్డి పద్మ వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ‘ఈ-నారి’ కార్యక్రమం కింద కొనసాగుతున్న వెబినార్ సమావేశాల్లో మహిళల రక్షణ, ఆన్లైన్ మోసాలు, చట్టాలు, హక్కులు కాపాడుకోవడంపై మహిళా కమిషన్ విద్యార్థినులను అవగాహన చేస్తున్నట్టు వివరించారు.

LEAVE A RESPONSE