గుడ్డి గుర్రాలు ఇకనైనా కళ్ళు తెరవాలి

అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదని, మూడు రాజధానులతోనే ఆకాశం ఊడి ఏపీపై పడుతోందని ప్రచారం చేసిన వైకాపా నాయకులు, గత తెదేపా ప్రభుత్వం అమరావతిని ఏనాడో చంపేసిందని, దానిని వైకాపా ప్రభుత్వం పూడ్చేసిందని జ్యోతిష్యం చెప్పే గుడ్డి గుర్రాలు కేంద్ర ప్రభుత్వ ప్రకటనతోనైనా కళ్ళు తెరవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హితవు పలికారు. మంగళవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానులకు రాజ్యాంగలోని 12వ షెడ్యూల్ ప్రకారం మాస్టర్ ప్లాన్ ఆమోదం ఉందని, ఏపీకి కూడా రాజధాని అమరావతి ఆమోదం ఉందని రాజ్యసభ లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గత ప్రభుత్వం మూడేళ్ళు, కొత్త ప్రభుత్వం ఐదేళ్ళు పాలన చేసిందీ, చేస్తున్నదీ అమరావతి నుంచే అన్నారు. రాజధానికి రక్షణ కవచంగా ఏర్పాటు చేసిన శాసన సభ తీర్మానాలు, సిఆర్డిఎ చట్టాలు, ఫాం నెంబర్ 14 వంటి అంశాలే న్యాయ స్థానాలలో నెగ్గాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అలాంటి ముందు జాగ్రత్తలు ఎన్నో తీసుకుందని, కేవలం ముఖ్యమంత్రి రాజధానిపై పై రాజకీయ యుద్ధం మొదలెట్టారని పేర్కొన్నారు. రాజధానిపై ప్రభుత్వం వేసిన బండరాళ్లు చాలక, కొత్తగా కొందరు గులకరాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారని, బండరాళ్ళను బద్దలు కొట్టిన రాజధాని మహిళలు, బహుజన ఉద్యమ కారులు గులక రాళ్ళను కాళ్ళతో తోసేస్తారని చెప్పారు.

రాజధానిపై రాళ్ళేసినా, అమరావతి మహిళలపై నిందలు వేసినా చరిత్ర క్షమించబోదని హెచ్చరించారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా, అమరావతిపై మహాదాడి చేసిన ప్రభుత్వ వైఖరితో జత కడితే, ప్రజలు ఇటువంటి వారినీ పక్కన పెడతారని తెలిపారు. రాష్ట్రంలో 67 రాజకీయ పార్టీలు ఉన్నాయని, వీటిలో 60 పార్టీలు ప్రజలకు తెలియవని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పుడుతుంటాయి, గిడుతుంటాయి అనీ, ఏ రాజకీయ పార్టీ అయినా స్పష్టమైన విధానాలతో, కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లి పని చేసుకోవడంలో తప్పు లేదని పేర్కొన్నారు.

రహస్య ఎజెండాలతో పని చేస్తే, రాజకీయ సొంత పంచాంగాలు చదివితే, అది ప్రభుత్వానికే ఉపయోగపడుతుందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని, రోజుకు ఆరు వీడియోలు చేసినా, 12 వీడియోలు పెట్టినా ప్రజలు నమ్మేస్తారనో, ఓట్లు వేస్తారనో భ్రమించటం రాజకీయ అపరిపక్వత అవుతోందని పేర్కొన్నారు. మూడు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో భాధ్యతతో పోరాడాల్సిన శక్తులు పోరాడుతూనే ఉన్నాయని, తాము ఆశించిన ‘రహస్య’ ఫలితాలు అందలేదని, ప్రజల మీద, ఉద్యమాల మీద దుమ్మేస్తే, అది ప్రభుత్వ విధానాలకు ఊడిగం చేసినట్లే అవుతుందని బాలకోటయ్య హెచ్చరించారు.

Leave a Reply