ఘనంగా తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపదినోత్సవం – విశిష్ట పురస్కారాల ప్రదానం

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నందమూరి తారకరామారావు కళా మందిరంలో 2020 సంవత్సరానికిగాను సాహిత్యరంగం నుండి ప్రముఖ సాహితీవేత్త, రచయిత డా.ముదిగంటి సుజాతారెడ్డి, 2021 సంవత్సరానికిగాను సాంస్కృతిక రంగం నుండి ప్రసిద్ధ సంగీత రికార్డుల సేకర్త, సంగీత, సాహిత్య, నృత్య కళా విమర్శకులు బొబ్బిలి జమిందారీ వంశీయులు వి.ఎ.కె. రంగారావులకు విశిష్ట పురస్కారాలను లక్ష రూపాయల నగదు, ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.

సత్కార కార్యక్రమానంతరం ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలుగు మాతృభాషను మరవద్దని, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలుగువారికి జీవనాడులనీ వాటి పరిరక్షణకు పాటుపడుతున్న తెలుగు విశ్వవిద్యాలయం అభినందనీయమనీ అన్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కేవలం ఇంగ్లీషు వలననే ఆర్జించవచ్చుననే అపోహ ఉండొద్దనీ, పాశ్చాత్య శాస్త్రవేత్తలు తమ మాతృభాషలోనే పరిశోధనలు చేస్తూ ప్రపంచానికి ఉత్పత్తులను అందించారనీ తెలియజేశారు.

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయంలో ఖాళీగావున్న ఉద్యోగాలతోపాటు అదనంగా మరో వెయ్యి ఉద్యోగాలను నియమించడానికి ముఖ్యమంత్రిగారు నిర్ణయం తీసుకున్నారనీ తెలియజేశారు. త్వరలో బాచుపల్లికి తరలించే తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించుకుందామని అన్నారు.

సభా ప్రారంభకులు గా విచ్చేసిన సాంస్కృతిక సలహాదారు డా. కె.వి.రమణాచారి మాట్లాడుతూ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలవైపు ఆకర్షితులవుతున్న యువత మాతృభాషను మరువకుండా, సంస్కృతి, సంప్రదాయాలను రక్షిస్తూ తెలుగు భాషా వికాసానికి దోహదపడాలని విద్యార్ధులకు పిలుపునిచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయం కోర్సులు కేవలం స్వయం ఉపాధికే పరిమితం కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించే విధంగా కోర్సులను రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తద్వారా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉపాధి అవకాశాలుంటాయని అన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావు మాట్లాడుతూ అన్య రాష్ట్రాల సరిహద్దులలో తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాలను ఏర్పాటు చేసి తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి మరింత చేరువవ్వడానికి విశ్వవిద్యాలయం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు డా. నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. 2023 జనవరి రెండవ వారంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లి ప్రాంగణానికి తరలిస్తున్నట్లు ప్రకటించారు.

విశిష్ట పురస్కార గ్రహీతలు వి.ఎ.కె.రంగారావు, డా ముదిగంటి సుజాతారెడ్డి గారు తమ స్పందనలో విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. విశ్వవిద్యాయ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ విశ్వవిద్యాలయ ప్రగతి నివేదికను సమర్పించారు. కార్యక్రమానికి ముందుగా నృత్యశాఖ అధ్యాపకురాలు, ప్రముఖ ఆంధ్రనాట్య కళాకారిణి డా. సువర్చలాదేవిగారి కుమార్తె సాత్త్విక ఆంధ్రనాట్య ప్రదర్శనకు పలువురు ముగ్ధులయ్యారు.

జానపద కళల శాఖ విద్యార్ధిని దివ్యాంగురాలైన కుమారి భాగ్య బృందం చేసిన నాట్యప్రదర్శన అందరిని విస్మయపరిచింది. జానపద పరిశోధక విద్యార్ధి చుక్కా రవికుమార్ బృదం ఒగ్గుడోలు నృత్యప్రదర్శన సభికులను ఆకట్టుకుంది. విస్తరణసేవా విభాగం ఇంఛార్జి రింగు రామ్మూర్తి కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

Leave a Reply