– కేంద్ర ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: బీసీల్లో క్రీమీ లేయర్ వార్షిక ఆదాయ పరిమితిని 8 లక్షల నుంచి 12 లక్షలకు పెంచాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో సోమవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి ఆనుగుణంగా ప్రతి మూడేళ్ళకు ఒకసారి క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి సవరణ క్రమం తప్పకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
చివరిసారిగా 2017లో బీసీ క్రీమీ లేయర్ ఆదాయ పరిమితిని 6 లక్షల నుంచి 8 లక్షలకు పెంచుతూ సవరణ జరిగింది. ఆ తర్వాత గడచిన ఆరేళ్ళుగా ఈ ఆదాయ పరిమితిలో ఎలాంటి సవరణ జరగలేదని ఆయన అన్నారు. ఈ ఆరేళ్ళ కాలంలో దేశంలో ద్రవ్యోల్బణం అనేక రెట్లు పెరిగిపోయింది. కానీ క్రీమీ లేయర్ ఆదాయ పరిమితిలో సవరణ జరగనందున ఆ కేటగిరిలో ఉన్న వెనుకబడిన కులాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
సమాజంలోని ఇతర వర్గాలతో సమాన హోదా సాధించేందుకు వీలుగా భారత రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలకు విద్య, ఉపాధి రంగాలలో రిజర్వేషన్ కల్పించారు. బీసీలు సమాజంలో వివక్షకు, అన్యాయానికి గురైన వారిగా మండల్ కమిషన్ గుర్తిస్తూ నిర్దేశించిన వార్షిక ఆదాయ పరిమితికి లోబడిన వెనుకబడిన కులాల వారికి అన్ని రంగాలలో రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసింది. బీసీల్లో నిర్దేశించిన ఆదాయ పరిమితిని దాటిన వారిని క్రీమీ లేయర్‌గా గుర్తించి వారు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి అనర్హులుగా ప్రకటించిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
2004లో తొలిసారిగా బీసీల్లో క్రీమీ లేయర్ వార్షిక ఆదాయ పరిమితిని రెండున్నర లక్షలకు పెంచారు. ఆ తర్వాత 2008లో దీనిని 4.5 లక్షలకు. 2013లో 6 లక్షలకు పెంచుతూ సవరణలు జరిగాయి. చివరిసారిగా 2017లో క్రీమీ లేయర్ ఆదాయ పరిమితిని ఏడాదికి 8 లక్షలుగా సవరించారు. మూడేళ్ళకు ఒకసారి జరగాల్సిన ఈ ప్రక్రియ ఇప్పటికి రెండు పర్యాయాలు బకాయి పడ్డాయని విజయసాయి రెడ్డి చెప్పారు.
క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి సవరణలో జరుగుతున్న ఈ జాప్యం వలన అర్హులైన బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోతున్నాయని ఆయన అన్నారు. అందువలన క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి సవరణ సత్వరమే జరగాల్సింది ఉందని అన్నారు. క్రీమీ లేయర్ ఆదాయ పరిమితిని ప్రస్తుతం ఉన్న 8 లక్షల నుంచి 12 లక్షలకు పెంచాలని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కూడా సిఫార్సు చేసినందున ప్రభుత్వం తక్షణమే దీనిపై దృష్టి సారించి క్రీమీ లేయర్ పరిమితిని వెంటనే సవరించేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఆదాయ పరిమితి సవరణ ప్రక్రియ క్రమం తప్పకుండా ప్రతి మూడేళ్ళకు ఒకసారి జరిగేలా చూసి దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు.