Suryaa.co.in

Andhra Pradesh National

కోటి 30 లక్షల మందిని విమానం ఎక్కించిన ఉడాన్‌

– రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4: విమాన ప్రయాణం గురించి కలలో కూడా ఆలోచించని సామాన్య ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్‌ యోజన్‌ వలన ఈరోజు విమాన ప్రయాణం చేయగలుగుతున్నారు. ఉడాన్‌ యోజన్‌ కింద ఇప్పటి వరకు కోటి 30 లక్షల మంది విమాన ప్రయాణం చేశారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాధిత్య సింధియా వెల్లడించారు.

ఉడాన్‌ యోజన కింద దేశ వ్యాప్తంగా ప్రభుత్వం కేటాయించిన రూట్లలో మూడేళ్ళ కన్సెషన్‌ గడువు దాటిన తర్వాత కేవలం 7 శాతం రూట్లు అంటే 54 రూట్లలో మాత్రమే కార్యకలాపాలు సాగుతున్నట్లుగా కాగ్‌ నివేదిక వెల్లడిస్తోంది. మిగిలిన రూట్లు కన్సెషన్‌ గడువు వరకు కూడా ఎందుకు మనుగడ సాగించలేకపోయాయి అంటూ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సిపి సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సుదీర్ఘంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

భారత దేశ చరిత్రలో పౌర విమానయాన మ్యాప్‌లో కనిపించని 76 ఎయిర్‌పోర్టులు ఉడాన్‌ యోజన్‌ కారణంగా ఈరోజు మళ్ళీ ఆ మ్యాప్‌లో ప్రత్యక్షం అయ్యాయని మంత్రి తెలిపారు. ఉడాన్‌ స్కీం కింద ఇప్పటి వరకు కోటి 30 లక్షల మంది సామాన్య ప్రజలకు విమాన ప్రయాణం చేసే యోగ్యం లభించింది. ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (విజిఎఫ్‌) కారణంగా ఇప్పటి వరకు 2 కోట్ల 75 లక్షల విమాన ప్రయాణాలు జరిగాయి. విమానయాన ప్రయాణానికి దూరంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం అయ్యాయి.

ఈశాన్య రాష్ట్రాలలో కొత్తగా 9 ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం జరిగింది. అందులో 6 ఎయిర్‌పోర్ట్‌లు కేవలం ఉడాన్‌ యోజన కిందే ఏర్పాటు సాకారం అయ్యాయి. ఈ స్కీం కింద ఆయా రూట్లలో విమానాలు నడిపే సంస్థలకు మూడేళ్ళపాటు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను చెల్లించాలని ప్రతిపాదించడం జరిగింది. మూడేళ్ళ తర్వాత గిట్టుబాటు కాని రూట్ల స్థానంలో కొత్త రూట్లను ఉడాన్‌ స్కీం కింద గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువలనే ఈ స్కీం కింద మొదట్లో వేయి రూట్లను లక్ష్యంగా చేసుకోవడం జరిగింది.

ఇందులో 74 రూట్లలో మూడేళ్ళ కాల వ్యవధి తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రజలు విమాన ప్రయాణానికి అలవాటు పడుతున్నకొద్దీ ఈ రూట్ల సంఖ్య కూడా పెరుగుతుంటుంది. 1920లో కోటి 44 లక్షలు ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2030 నాటికి 42 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

LEAVE A RESPONSE