Suryaa.co.in

Political News

గ్రేటర్‌లో సెటిలర్లు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయలేదంటే..

– సెటిలర్లను ఓన్‌ చేసుకోని కాంగ్రెస్‌
– ప్రచారంలో సెటిలర్లను వాడుకోవడంలో విఫలం
– అసలు ప్రచారంలో వెనకబడిన వైఫల్యం
– తెలంగాణ జిల్లాల్లో మాత్రం చేయెత్తిజైకొట్టిన సెటిలర్లు

శేరిలింగంపల్లి నియోజకవర్గం లో…నల్లగండ్ల డివిజన్ పరిధిలో, ఒక విల్లా కమ్యూనిటీలో….కృష్ణా జిల్లాకు చెందిన ఒక కుటుంబం.అప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరికపూడి గాంధీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న కుటుంబం. ఒకరకంగా ఎమ్మెల్యే గాంధీకి ఆ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్. గత రెండు ఎన్నికలలో ఆ కుటుంబం గాంధీ కోసం ఓట్లు వేయడమే కాకుండా,ఎంతో మంది చేత ఓట్లు వేయించారు.
చంద్రబాబు గారిని అరెస్టు చేసి జైలుకు పంపించిన తర్వాత, వాళ్ళింటికి టీ తాగడానికి వచ్చిన గాంధీని(చంద్రబాబు అరెస్టు తర్వాత కేటీఆర్ వ్యాఖ్యల గురించి) ఆ కుటుంబంలోని మహిళలు నిలదీశారు.

జీవితంలో తెలుగుదేశం పార్టీకి తప్ప… ఏ పార్టీకి ఓటు వేయని ఆ కుటుంబం… ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్నామని… గాంధీ గారికి స్పష్టంగా చెప్పారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో….వనస్థలిపురంలో…తెలుగుదేశం పార్టీ మద్దతుదారులైన కొన్ని వేలమంది స్వచ్ఛందంగా కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి కి మద్దతు ప్రకటించారు. నామినేషన్ వేయడానికి ముందే మధుయాష్కి ఆ ప్రాంతంలో ప్రముఖ నాయకుడైన యలమంచిలి భాను ప్రసాద్ గారిని కలిసి మద్దతు కోరారు. అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత,కాంగ్రెస్ అభ్యర్థి వారిని కలవలేదు.

చంద్రబాబు గారి అరెస్టుకు నిరసనగా ఎల్బీనగర్ లో జరిగిన ర్యాలీలో బిఆర్ఎస్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు బిఆర్ఎస్ కి ఎన్నికలలో మద్దతు ఇవ్వలేదు. కపక్క కాంగ్రెస్ అభ్యర్థి అడ్రస్ లేడు…మరోపక్క బీఆర్ఎస్ నుంచి బిజెపి నుంచి వత్తిళ్లు… ఆ వత్తెళ్లలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరిని తీసుకొచ్చి సమావేశం నిర్వహించి, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను. ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు తీవ్ర ఒత్తిడికి లోనైనప్పటికీ..కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి రాకపోయినప్పటికీ… కాంగ్రెస్కే ఓటేశారు. మధ్యలో ఒకసారి మధు యాష్ కి నాకు ఫోన్ చేసి ప్రచారంలో సహాయం కోరారు. ఆ తర్వాత దానికి ఫాలోఅప్ గా ఎవరూ నన్ను సంప్రదించలేదు. వనస్థలిపురం తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు వాళ్ళ బాధను ప్రతిరోజు నాతో పంచుకునేవారు.

సనత్ నగర్ నియోజకవర్గం పరిస్థితి అత్యంత విషాదకరం.
నామినేషన్ల ప్రక్రియకు ముందే …చంద్రబాబు గారి అరెస్టు తర్వాత సనత్ నగర్ జక్ కాలనీ లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు నిరాహార దీక్షా శిబిరం నిర్వహించారు.నిమ్మరసం ఇచ్చి దీక్ష ముగించే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు.
ఆ తర్వాత ఎన్నికల వేడి మొదలైన తర్వాత సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆహ్వానించి,మద్దతుగా సభలు నిర్వహించి,ఆ కాలనీలో 6000 ఓట్లు, మొత్తం సనత్ నగర్ నియోజకవర్గంలో దాదాపు 35 వేల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వేయడం కోసం చాలా ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి ఎలాంటి సహకారం లభించలేదు.కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి రాలేదు.కోటి రూపాయలు ఇచ్చినా….తెలుగుదేశం పార్టీకి తప్ప ఇతర పార్టీలకు ఓట్లేయని వేలాదిమంది, కనీసం ఒక్కసారి కనిపించమని కాంగ్రెస్ అభ్యర్థి కి చేసిన విజ్ఞప్తి ఫలితం లేకుండా పోయింది.

పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ…ఎలాగైనా కెసిఆర్ కు వ్యతిరేకంగా ఓటేయాలి అన్న లక్ష్యంతో… వీళ్లే చొరవ తీసుకొని ఒక సభ నిర్వహించి…సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిని భర్త అయిన, ఏఐసీసీ మీడియా సెల్ చైర్మన్ పవన్ ఖేరా చేత నాకు ఫోన్ చేయించారు.ఆ మరుసటి రోజు జరిగిన సమావేశంలో పవన్ ఖేరా తో పాటు నేను కూడా పాల్గొని,రాజకీయ ఉపన్యాసం చేయకుండా…అమరావతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం తెలంగాణలో ఓటు ఎలా ఉపయోగించాలో… మాట్లాడాను.

ఇదంతా జరుగుతున్న సమయంలోనే…..ఆంధ్రప్రదేశ్ లో మాల మహానాడు నాయకులు కొందరు నాకు ఫోన్ చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న గద్దర్ కూతురు వెన్నెల కోసం ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. అయితే నిధుల కొరత కారణంగా కంటోన్మెంట్లో కాంగ్రెస్ వెనుకబడి ఉందని చెప్పారు. గద్దర్ అన్నతో నాకున్న పరిచయం కారణంగా,వెన్నెలకు ఆర్థికంగా సహాయం చేసే విషయంలో కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడితే… వాళ్లు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు .

ఇలా చెప్పుకుంటూ పోతే….నగరాలలో దాదాపు పది నియోజకవర్గాలలో ఆంధ్ర ప్రాంత ప్రజలు కాంగ్రెస్ గెలుపు కోసం ఎంత నిజాయితీగా పనిచేశారో చాలా ఉదాహరణలు చెప్పగలను. 2014లో తాము స్వయంగా గెలిపించిన గాంధీ గారిని గచ్చిబౌలి సభలో….గో బ్యాక్ గాంధీ… అని నినదించిన…. నిజాయితీకి నేనే సాక్ష్యం.

ఓట్లు వేయటానికి వేలాది మంది సిద్ధంగా ఉన్నప్పటికీ….కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైఫల్యం కారణంగా… ఆంధ్ర ప్రాంత మూలాలున్న హైదరాబాద్ ప్రజలు ఎంత ఒత్తిడి అనుభవించారో నాకు తెలుసు.

మొత్తం మీద పోలింగ్ రోజు సెటిలర్స్ లో 90 శాతం మంది నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. పూర్తిగా నమ్ముతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లలో 90 శాతం వీరు వేసిన ఓట్లే. మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఒక సీటు కూడా రాలేదంటే…ఇతర కారణాలు చాలా ఉన్నాయి.

2014 తర్వాత….హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావ అయింది. గత కార్పొరేషన్ ఎన్నికలలో కేవలం 2 డివిజన్లకు పరిమితమైంది. హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎన్నికలో అనేక తప్పులు జరిగాయి.

పైన కంటోన్మెంట్ గురించి చెప్పినట్టు,కొంతమంది అభ్యర్థులు నిధుల సమస్య ఎదుర్కొన్నారు. మరి కొంతమంది డబ్బు ఉన్న అభ్యర్థులు… అవసరమైన స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టలేదు. రాత్రి నుండి సోషల్ మీడియాలో…ఒక కులం వారిని టార్గెట్ చేసి…ద్రోహం చేసారు.. మోసం చేశారు….అంటున్నారు. మరి దాదాపు లక్ష కాపు ఓట్లు ఉన్నాయని చెబుతున్న….కూకట్పల్లిలో జనసేన అభ్యర్థికి 39 వేల ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి?

మరో ముఖ్యమైన అంశం….
హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఇతర ప్రాంతాల ప్రజలకు కెసిఆర్ పాలనలో హైదరాబాద్ సురక్షిత నగరంగా అనిపించింది. గత కొద్ది నెలలుగా హైదరాబాద్ నగర అభివృద్ధిని బిఆర్ఎస్ నాయకత్వం అద్భుతంగా మార్కెట్ చేసుకుంది.ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పక్కనపెడితే ….హైదరాబాద్ నగర అభివృద్ధిని కొనసాగించడంలో మెజార్టీ ప్రజలకు కేసీఆర్,కేటీఆర్  విషయంలో …పెద్ద వ్యతిరేకత లేదు.

పైగా సనత్‌నగర్‌లో తలసాని..ఎల్బీనగర్ లో సుధీర్ రెడ్డి, శేరిలింగంపల్లి లో గాంధీ, ఖైరతాబాద్ లో దానం నాగేందర్, కుత్బుల్లాపూర్ లో వివేక్…. మొదలైన బిఆర్ఎస్ నాయకులు నిరంతరం జనంతో ఉండే నాయకులు. ఈ అంశాలు బి ఆర్ ఎస్ కి కలిసి వచ్చాయి.

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE