కేంద్ర ప్రభుత్వానికి వి.విజయసాయి రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, మార్చి 29: నానాటికీ పెరుగుతున్న ఎరువుల ధరలతో రైతాంగం అతలాకుతలమవుతున్నందున కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని పెంచి రైతాంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ గత ఏడాదిగా ఎరువుల ధరలు గణనీయంగా పెరగడంతో రైతాంగం తీవ్ర ఇక్కట్ల పాలవుతోందని అన్నారు. ఏడాది కాలంలో వివిధ ఎరువుల ధరలు సగటున 45 నుంచి 60 శాతం పెరిగాయి. దీని వలన సాగు పెట్టుబడి వ్యయం పెరిగి రైతుల కష్టార్జితానికి గండి పడుతోంది. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి పెరిగిన ఎరువుల ధరలు శరాఘాతంగా పరిణమించాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశంలో ఎరువులకు మరింత కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ ఏటా దిగుమతి చేసుకునే ఎరువులలో 10 శాతం ఈ రెండు దేశాల నుంచే వస్తోందని అన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు మాదిరిగానే ఎరువుల ధరలు కూడా మరింతగా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రైతాంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతుందని విజయసాయి రెడ్డి అన్నారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని లక్షా 40 వేల కోట్ల రూపాయల నుంచి లక్షా 5 వేల కోట్ల రూపాయలకు అంటే 30 శాతం తగ్గించింది. ఏడాదిగా ఎరువుల ధరలు క్రమేపీ పెరుగుతుంటే ప్రభుత్వం బడ్జెట్‌లో ఎరువులపై సబ్సిడీని గణనీయంగా తగ్గించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి రైతు వ్యతిరేక చర్యకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో రైతాంగాన్నిఆదుకోవలసిన తక్షణ కర్తవ్యం ప్రభుత్వంపై ఉన్నందున వెంటనే ఎరువులపై సబ్సిడీని పెంచాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.