Suryaa.co.in

Editorial

సోము-ఆర్కే ‘ఓపెన్‌హార్టు’..భలే భలే!

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. ఏబీఎన్ వీక్షకులకు ఇది బాగా సుపరిచితమైన ప్రోగ్రాం. అందులో సీనియర్ జర్నలిస్టు రాధాకృష్ణ ప్రముఖులను పిలిచి, వారి మనసులోమాటను రాబట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్రమంలో ఎదుటివారి చెప్పే మాటల్లో నిజమెంత, అబద్ధం ఎంతన్నది పక్కనపెడితే.. అది ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేదే అనడంలో అణువయినా అబద్ధం లేదు. మరుసటి రోజు ఇంటర్వ్యూ సారాంశం ఆంధ్రజ్యోతిలో వస్తుంది కాబట్టి అంతా ఆసక్తిగా చదువుతారు.

ఏ మాటకా మాట. రాధాకృష్ణ పక్కా ప్రొఫెషనల్. తాను పల్లకి మోసే వారిపట్ల సానుభూతితో ఉంటారన్న ఒక్క మైనస్ తప్ప, జర్నలిస్టుగా మిగిలినదంతా ఆయనలో ప్లస్ పాయింట్లే. పాలకుల తప్పులు ఎత్తి చూపాలంటే మీడియా చొక్కా లాగు తడుస్తున్న నేటి కాలంలో, ప్రభుత్వాధినేతల పై నిర్భీతిగా కలం ఎత్తిన రాధాకృష్ణ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలిసిందే. ప్రభుత్వాలు ఒక రూపాయి యాడ్స్ ఇవ్వకపోయినా, తన మీడియా సంస్థను నిర్విఘ్నంగా నడిపిస్తున్న పక్కా బిజినెస్ మెన్. కాకపోతే తన వాదన కోసం చివరి వరకు నిలబడరు. అందుకు గతంలో కెసిఆర్ పై చేసిన అలుపెరుగని పోరాటం, ఆనక రాజీ పడటమే ఒక ఉదాహరణ. ఇన్ని సలక్షణాలు- అవ లక్షణాలు జమిలిగా ఉన్నప్పటికీ, రాధాకృష్ణ శైలి విభిన్నం. ధైర్యానికి చొక్కా ప్యాంటు వేస్తే అది రాధాకృష్ణ అవుతుంది. ఆయనను వ్యతిరేకించే వారు సైతం అనేక అంశాల్లో రాధాకృష్ణ ను మెచ్చుకోకుండా ఉండలేరు. అదే ఆర్కే స్పెషాలిటీ.

కాకపోతే.. ఆ ప్రోగ్రాములో రాధాకృష్ణ ప్రశ్నలతో పాటు, ఎదుటివారివ్వబోయే జవాబులు కూడా ఆయనే ఇచ్చేసేలా కనిపిస్తుంటాయి. అంటే ముప్పావు భాగం ఏ రూపంలోనయినా, ఆర్‌కే హార్టే ఆ ప్రోగ్రాంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారి హార్టు కనిపించేది కొంతే. అది వేరే విషయం.

కానీ, ఆ ప్రోగ్రామును కొంత సీరియస్‌గా, మరికొంత లౌక్యంగా, ఇంకొంత జనాంతికంగా, మిగిలినది సరదాగా లాగించే రాధాకృష్ణ.. ఈసారి మాత్రం పూర్తిస్థాయి కామెడీతో నడిపించడమే విశేషం. ఎదుటి వ్యక్తి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మరి సోము వీర్రాజు స్క్రీన్ మీద కనిపిస్తే బోలెడంత సందడి. సరదా! ఆయనేం మాట్లాడాతారో.. వెంటనే సోషల్‌మీడియాలో ట్రోలింగులు పంచకల్యాణీ గుర్రంలా ఎంత వేగంగా పరిగెడుతుంటాయో.. ఆ క్రమంలో ఎంతమంది బ్రహ్మానందం కామెడీ డైలాగుల వీడియోలు, గ్రాఫిక్స్‌ను దానికి యాడ్ చేసి నెటిజన్లను నవ్విస్తారో తెలిసిందే. ఆ రకంగా ఆయన తెలుగువారిని కడుపారా నవ్వించి, రోగాలు కుదురుస్తున్నారు. అదేనండీ నయం చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు ఏపీలో సీరియస్ సబ్జెక్టు రన్నవుతున్నందున.. ఈసారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం, కాస్తంత హాటుగా ఉంటుందేమోనని ప్రోమో చూసిన ప్రేక్షకులు భావించారు. సహజంగా లోపల విషయం లేకపోయినా ప్రోమోలే ప్రోగాముకు ప్రాణం కాబట్టి, అంతా అలాగే భావించారు. కానీ తీరా టీవీ ఆన్ చేసి, ఇంకో చానెల్ మార్చేవరకూ ఆ ప్రోగ్రాము చూస్తే, సీరియస్ సినిమా కాస్తా కామెడీ సినిమా అయి కూర్చుంది. అదే అందరి హాశ్చర్యం.

ఇంతకూ ఆ ప్రోగ్రాంలో రాధాకృష్ణ తన ఎదురు కూర్చున్న సోము వీర్రాజు నుంచి పెద్దగా ఏమీ రాబట్టలేకపోయినా, ‘లోపలికి వెళ్లిన తర్వాత అన్ని విషయాలూ చెవులో చెబుతానన్న’ మాట మాత్రం తీసుకున్నారు. మరి రాధాకృష్ణ చెవిలో సోమన్న ఏం చెప్పారో తెలియదు. అసలు చెప్పారో లేదో కూడా తెలియదు. దాన్ని అలా వదిలేద్దాం. కానీ.. సినిమా భాషలో చెప్పాలంటే.. రొటీన్‌కు భిన్నంగా ఒకటి కనిపించింది.

సహజంగా ఆర్కే తన ప్రోగ్రాములో ఎదుటివారిని పెద్దగా మాట్లాడనీయరు. వారి మాటలు కూడా ఆయనే మాట్లాడతారని సోషల్‌మీడియాలో ఒక టాక్. కానీ, ఈ ప్రోగ్రాములో మాత్రం, సోము వీర్రాజు కూడా అచ్చం ఆర్కే మాదిరిగానే వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదే విశేషం. ఒక్కోసారి అంతలావు రాధాకృష్ణను కూడా ఆయన మాట్లాడకుండా చేశారు. వీర్రాజు ధైర్యం మెచ్చదగ్గదే.

ఇక జర్నలిజం విలువలు అందరికంటే ఎక్కువ తెలిసిన రాధాకృష్ణ కూడా, వాటికి మినహాంపు ఇస్తారని ఆయన ప్రోగ్రాములో చెప్పడమే వింత. సోము వీర్రాజుతోపాటు మరో ముగ్గురి కార్యక్రమాల కవరేజీ నిషేధించాలని తానే తన వాళ్లకు చెప్పానని, తనకూ పవన్‌కల్యాణ్ మాదిరిగా కొంచెం తిక్కుందని నిజాయితీగా అంగీకరించడం ఒక విశేషమయితే, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మీకు పాదనమస్కారం చేస్తానని సోము వీర్రాజు చెప్పడం చూచువారలకు చూడముచ్చట.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతిని నిషేధించాలన్న సోము వీర రాజాజ్ఞ ఎప్పుడు ఎలా ప్రకటించబడిందో.. తర్వాత ఎందుకు నీరు గారిందో ఇప్పటివరకూ ఎవరికీ తెలియని ఓ బ్రహ్మరహస్యాన్ని, ఇద్దరూ కలసి నవ్వుతూ చెప్పేయడం మాత్రం బహుబాగా నచ్చింది. నిజమే. ఏబీఎన్-ఆంధ్రజ్యోతిని ప్రెస్‌మీట్లకు, సభలకు పిలవకూడదని సోము వీర్రాజు ఆర్డర్ వేసినట్లు ప్రెస్‌నోటు రిలీజు చేసిన బీజేపీ… తర్వాత ఇద్దరికీ సర్దుబాటు జరిగిన తర్వాత ఆ నిషేధం ఎత్తేస్తున్నట్లు మాత్రం ప్రెస్‌నోట్ ఇవ్వకపోవడం ఇంకో కామెడీ.

మీరు ఏకపక్షంగా మమ్మల్ని నిషేధించారు. కాబట్టి నేనూ మిమ్మల్ని నిషేధించమని మావాళ్లకు చెప్పా. తర్వాత మీవాళ్లు వచ్చారు. మాట్లాడారు. కథ సుఖాంతమయింది. అక్కడితో అయిపోయింది. మావాళ్లొచ్చి వీర్రాజును పిలుస్తున్నామని చెబితే, పిలిస్తే పిలవండి అని రాధాకృష్ణ నిజాయితీగా చెప్పడం..

సోము వీర్రాజు కూడా.. మీతో మాట్లాడమని మా వాళ్లను పంపించడం, మీపై నిషేధం ఎత్తేశామని వారు చెప్పడం జరిగిందని అంతే నిజాయితీగా చెప్పడం చూస్తే… ఇద్దరు నిజాయితీపరులు తమపై ఒకరికొకరు విధించిన నిషేధాన్ని ఎంత పద్ధతిగా, ఎంత ప్రజాస్వామ్యమార్గంలో చర్చల ప్రక్రియ ద్వారా పరిష్కరించుకున్నారో చెప్పడం మెచ్చదగ్గదే.

మీరు మాపై ఏకపక్షంగా నిషేధం విధించారని రాధాకృష్ణ ఆరోపిస్తే, దానికి వీర్రాజు ‘అబ్బే. అది నా ఒక్కడి నిర్ణయం కాదు. మా పార్టీ తీసుకున్న సమిష్ఠి నిర్ణయం’ అని చెప్పకుండా.. అవునంటూ ‘నిజాయితీన్నర’ ప్రదర్శించి తలూపడం మరో ఆశ్చర్యం. సోమన్న నిజాయితీపరుడు కాబట్టి అంత అమాయకంగా చెప్పారు. సంతోషించండి.

కాకపోతే… మీవాళ్లు నా వార్త ఇంత చిన్నదేసి, ఒక్కోసారి నా పేరు కూడా తీసేస్తున్నారు.. కొంచెం మా పేర్లూ మా వార్తలు పెద్దగా రాయమనండి… మిమ్మల్ని మా రాష్ట్రానికి తీసుకువెళతా.. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రులను కూడా ఆంధ్రాకు తీసుకువెళతానని సోము వీర్రాజు చెప్పడం..రాధాకృష్ణ వేసిన కొన్ని ప్రశ్నలకు ‘ఇక్కడ కాదు. లోపలికి వెళ్లిన తర్వాత ప్రైవేటుగా మాట్లాడుకుందామ’నడం, అంతకుమించి… రాధాకృష్ణ వేసే ప్రశ్నలు శ్రద్ధగా రాసుకునే సీన్లు చూస్తే.. ది గ్రేట్ రాధాకృష్ణ ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో ఇంటర్వ్యూ చేశారా, లేక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడితో ఇంటర్వ్యూ చేశారా అన్న సందేహం బుద్ధిజీవులకు రాక తప్పదు.

అంతమాత్రాన తూ.గో.జీ వాడైన సోము వీర్రాజేం తక్కువ సెటైర్లు వేయలేదండోయ్.. రాధాకృష్ణపై బాగానే సెటైర్లు పేల్చారు. ‘మీకు చెబితే ఎక్కడ చేరాలో అక్కడకు చేరుతుంద’న్న వెటకారంతో కూడిన శీలహననం, ‘మీకూ కోపమేగా’ అని ఎదురుప్రశ్నలతో వీర్రాజు కూడా, ప్రోగ్రామును తన వంతుగా భలే రక్తికట్టించారు. ప్రధానంగా.. ఒకరిపై ఒకరు విధించుకున్న నిషేధాలు.. ఎలా ఎత్తేసుకున్నారో వివరించిన తీరు మాత్రం.. అద్భుత : అద్భుతస్య: అద్భుతోభ్యస.

మొత్తానికి రాధాకృష్ణ ఏపీ బీజేపీ దళపతితో చేసిన ఇంటర్వ్యూ టెలికాస్టయిన రోజు… లక్షలాది తెలుగు ప్రేక్షకులు కిందపడి తమకు తామే కితకితలు పెట్టుకుని, కడుపారా నవ్వుకుని, పూర్ణాయుషు పొందినట్లు ఒక సర్వేలో తేలిన నిఖార్సయిన నిజమట! ఈ కరోనా కష్టకాలంలో ఒక వైద్యుడు చేయలేని పని.. సాధారణ రాజకీయ నాయకుడు చేయడం అద్భుతమే కదా?!
open-heart

LEAVE A RESPONSE