క్రైస్తవ బాలుడిపై పాస్టర్ లైంగిక దాడి

– రాజీ పేరుతో రంగంలోకి దిగిన వైసీపీ నేతలు
– వైరల్ అవుతున్న వైసీపీ మహిళా క్రైస్తవ నేత వీడియో
( మార్తి సుబ్రహ్మణ్యం)

మహిళపై మగవాడు లైంగిక వేధింపులకు పాల్పడటం చూశాం. అనేక రాష్ట్రాల్లో చర్చిలే వేదికగా పాస్టర్లు, బిషప్పులు, ఫాదర్లు అమాయక మహిళలను ప్రార్ధనల పేరుతో అత్యాచారాలకు పాల్పడటం, అవి కాస్తా పోలీసుస్టేషన్లు, మీడియా వరకూ చేరి నిందితులు జైలుపాలయ్యే వార్తలు నిత్యం చూస్తున్నవే. కానీ ఒక మగవాడు మరో మగవాడిపై కీచకపర్వానికి దిగడం.. అది కూడా సదరు కీచకుడు దేవుడి దూతగా చెప్పుకునే ఓ పాస్టరే కావడం ఆశ్చర్యం. లైంగిక దాడికి గురైన బాలుడు కూడా క్రైస్తవుడే కావడం మరో ఆశ్చర్యం. క్రైస్తవ సమాజం తలదించుకుని నివ్వెరబోయే ఈ విచిత్ర ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. అయితే, ఈ కీచక కథ బయటకు రాకుండా పాపం ఓ వైసీపీ నేత చేస్తున్న ప్రయత్నం, సోషల్‌మీడియాలో గిర్రున తిరుగుతోంది. ఇక కీచక కథలోకి వెళితే..

ఆ అమాయక క్రైస్తవ బాలుడికి ఓ పాస్టర్ మాయమాటలు చెప్పాడు. నిజమని నమ్మిన పాపం ఆ బాలుడిపై పాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన తలిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు సదరు పాస్టర్‌ను అదుపులోకి తీసుకోవడం జరిగిపోయింది. కేసు నమోదు చేసే సమయంలో అధికార వైసీపీకి చెందిన క్రైస్తవనేత, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్ మనోరంజని మేడమ్ గారు రంగంలోకి దిగారు.

పోలీసుస్టేషన్‌కు వెళ్లి వ్యవహారం చక్కబెట్టే పని ప్రారంభించారు. సీఐతో మాట్లాడి వచ్చారట. తర్వాత ఇంకేముంది? లైంగిక దాడికి గురయిన బాలుడి కుటుంబంతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాలుడి కుటుంబం కూడా క్రైస్తవులే కావడంతో ‘మతం కార్డు’ సంధించే ప్రయత్నం చేశారు. ఈ కీచక విషయం

బయటకు పొక్కితే, అల్లరవడమే కాకుండా.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, హిందువులు రేపటినుంచి దీనిని రచ్చ చేస్తారని మేడమ్ గారు, బాధితుడి తండ్రికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎక్కడో కాదు. పోలీసుస్టేషన్ బయటనే.

అయితే పాస్టర్ అఘాత్యానికి బలైన బాలుడి తండ్రి మాత్రం.. ఎక్కడా తగ్గేదేలే అని కేసు పెట్టాల్సిందేనని పట్టుపట్టడం విశేషం. ఈలోగా బాలుడి కుటుంబానికి డబ్బులిప్పాద్దామని మేడం పక్కనున్న ఒకాయన సలహా ఇస్తే, ‘కోటిరూపాయలిచ్చినా ఒదిలేది లేదు. నాకు నా కొడుకు కావాలి. బాధ నాది. కొడుకు పాడయిపోయిన తర్వాత ఇక అల్లరయితే ఏముంది? ఇప్పుడు జరిగిన ఇస్యూ వల్ల వాడెలా ఉంటాడు? వాడు మైండెలా ఉంటుందో మాకు తెలియదు కదా? ఇలాంటి పాస్టర్ల వల్లే చెడ్డపేరు వస్తోందని’ వాపోయాడు. కానీ మనోరమ మేడమ్ గారు మాత్రం.. తన మాట విని రాజీ కావాలని సూచించారు.
‘ఈ బాధ నీదే కాదు. నాది కూడా. నాకొడుక్కి అలా అయితే నేను చూస్తుంటానా? కానీ మనం క్రిస్టియన్లుగా ఉండి మనమే రోడ్డెక్కుతామా ఈ ఇస్యూ వల్ల? వాడినీ మనం బయటేసుకోలేం పసిపిల్లాడిని. ఇప్పుడు రోడ్డెక్కితే మనం అల్లరయిపోతాం. క్షమాపణ చెప్పిద్దాం. పిల్లాడని డాక్టర్ల దగ్గరకు నేను తీసుకువెళతా’ అని సలహా ఇచ్చారు.

అవసరమైతే నిన్ను హోసన్న మినిస్ట్రీలో పెట్టిస్తానన్న ఆఫర్ కూడా ఇచ్చారు. నీకేం కావాలో చెప్పు చేయిద్దామని మేడమ్ గారు ఎంత లౌక్యంగా అడిగినా… బాధితుడు తండ్రి మాత్రం ‘‘నాకేమీవద్దు. నాకు నా కొడుకు ముఖ్యం. నేనెవరినీ నమ్మను. నేనూ పాస్టర్ల వెంట నాలుగు రాష్ట్రాలు తిరిగొచ్చా. కొంతమంది ఉన్నారుగానీ ఇలాంటి ఎదవ నాకెక్కడా తగల్లేదు. నేను నా కొడుకును ఎవరి దగ్గరకూ పంపించను. నా దగ్గరే ఉంచుకుంటా. నాకు డబ్బులేమీ వద్దు. నాకొడుక్కు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు. అది ఆడపిల్ల కానీ, మగ పిల్లాడు గానీ’’ అని నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టాడు. ఈ కీచక పర్వానికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply