Suryaa.co.in

Political News

మోదీ హయాంలో పెరిగిన అంతర్జాతీయ ప్రతిష్ట

ప్రపంచంలో వివిధ దేశాల ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాధినేతల మధ్య సంబంధాలు, విదేశీ నీతి పెద్దగా మారే అవకాశాలు లేవు. అయితే మారిన అంతర్జాతీయ పరిణామాలు తప్పకుండా చర్చించే అంశాలపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ సెప్టెంబర్ 22-27 మధ్య జరుపుతున్న మరో చరిత్రాత్మక అమెరికా పర్యటన కు కీలక ప్రాధాన్యత ఉన్నది.ఏడేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టినుంచీ ప్రధానమంత్రి అమెరికా సందర్శించడం ఇది ఐదో సారి. వెళ్లిన ప్రతిసారీ ఆయనకు అక్కడి ప్రజలు, భారతీయులే కాదు, అధికార ప్రతిపక్ష నేతలు నీరాజనాలు పట్టారు. 2019 సెప్టెంబర్ లో హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోదీ సదస్సులో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటు అనేకమంది కాంగ్రెస్ రిపబ్లిక్ నేతలు హాజరై ఆయనకు ఘన స్వాగతం పలకడం మోదీకి ఆ దేశంలోఉన్న జనాదరణకు సంకేతం. ఇప్పుడు అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా మోదీ పర్యటన అదే మాదిరి అక్కడి ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించడంలో ఆశ్చర్యంలేదు.
గత జనవరిలో అమెరికాలో అధ్యక్షుడు జో బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత మోదీ ఆయనను కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ వారు రెండు సార్లు వివిధ కీలక సమావేశాల్లో వర్చువల్ గా మాట్లాడుతున్నారు. 2020 నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిచిన తర్వాత మోదీ ఆయనను అభినందించారు, ఆ తర్వాత ఇరుదేశాలమధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, కోవిడ్ పై పోరు కు సంబంధించి రెండు సార్లు ఫోన్ లో సంభాషించారు. ఇదే సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అమెరికాలో పర్యటిస్తున్నారు. మోదీ ఆయనతోకూడా కీలక చర్చలు జరిపే అవకాశం ఉన్నది.
మోదీ అమెరికా పర్యటన, ఆయన ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలతో చర్చించడం ప్రపంచ రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. గత ఏడేళ్లలో ఆయన అనేక అగ్రదేశాలతో ఏర్పర్చుకున్న సంబంధాలు, మోదీకి వారిస్తున్న ప్రాముఖ్యత్ చరిత్ర పుటల్లో ఇప్పటికే నమోదైంది. మోదీ అమెరికా పర్యటనకు ముందే అమెరికా దౌత్యవేత్త జాన్ కెర్రీ, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జె ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వేర్వేరుగా భారత దేశం వచ్చి అనేక కీలక అంశాలపై చర్చించివెళ్లారు. సెప్టెంబర్ 22న మోదీ వాషింగ్టన్ లో అడుగుపెట్టిన రోజు నుంచీ ఒక్క క్షణం తీరిక లేకుండా సమావేశాలు పెట్టుకున్నారు.
భారతీయ సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, ఆపిల్ సంస్థ అధిపతి టిం కుక్ తోసహా అమెరికాలో అత్యంత ఉన్నత వ్యాపార వేత్తలతో కూడా మోదీ సమావేశమవుతున్నారు. అంతేకాదు, ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. సాధారణ అసెంబ్లీలో మోదీ ప్రసంగించడం ఇది నాల్గవ సారి కాగా ఈ సారి మొట్టమొదటి వక్తగా మోదీకి బృహత్తర అవకాశం లభించింది..
ఈ సారి అమెరికా పర్యటనలో ఆయన ఒక్క అమెరికా దేశాధినేతలతో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధానమంత్రి యోషిహిడే సుగాలతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. అఫ్ఘనిస్తాన్ పరిణామాలు, చైనా విస్తరణ వాదం నేపథ్యంలో క్వాడ్ పేరిట ఈ నాలుగు దేశాలు ఏర్పర్చుకున్న కూటమి నేతలు జో బైడెన్ ఆహ్వానం మేరకు వైట్ హౌజ్ లో జరుపుతున్న ముఖాముఖి సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. సైబర్ , మారిటైమ్ రక్షణ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలతో పాటు భారత దేశంలో వందకోట్ల కోవిడ్ వాక్సిన్ లను ఉత్పత్తి చేయాలన్న అంశంపై క్వాడ్ లోచర్చించనున్నారు.
గత మార్చిలో జరిగిన క్వాడ్ సమావేశంలోనే అమెరికా, జపాన్, ఆస్ట్ర్రేలియా, భారత దేశాలు భారత పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణను చర్చించాయి. అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాలు ఉపసంహరించుకున్న తర్వాత తాలిబాన్ స్వాధీనపరుచుకోవడం కూడా ఈ సారి కీలక చర్చకురానున్నది. క్వాడ్ సమావేశానికి బైడెన్- హారిస్ పరిపాలనా యంత్రాంగం కీలక ప్రాధాన్యతనిస్తున్నామని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ ఇప్పటికే ప్రకటించారు. ఈ సమావేశం చారిత్రాత్మమైనదని, భారత, జపాన్, అమెరికా దేశాధినేతలతో జరిగే చర్చలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మారిసన్ కూడా ప్రకటన చేశారు. నిజానికి మోదీ అమెరికా పర్యటనకు ముందే క్వాడ్ సభ్య దేశాలైన భారత ఆస్త్రేలియా మంత్రిత్వ శాఖ చర్చలు జరిపాయి.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగమంత్రి జయశంకర్ ఆస్ట్రేలియా రక్షణ, విదేశాంగమంత్రులతో చర్చలు జరిపారు. అఫ్ఘనిస్తాన్ లో దీర్ఘకాల శాంతి, సుస్థిరత ఏర్పడేందుకు వీలుగా ఒక విశాల ప్రాతిపదిక గల, అందరికీ భాగస్వామ్యం ఏర్పర్చగల ప్రభుత్వం ఉండాలని, అక్కడి మహిళలు, పిల్లలకు రక్షణతో పాటు ప్రజాజీవనంలో పాల్గొనే అవకాశం ఉండాలని, ఈ రెండు దేశాల మంత్రులు కలిసికట్టుగా ప్రకటన చేశారు.ముంబాయి, పఠాన్ కోట్, పుల్వామా ల ఉగ్రవాద దాడులను ఆస్ట్రేలియా స్పష్టంగా ఖండించింది, కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాలని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సైనిక, నౌకా విన్యాసాలు కుడా జరిగాయి,మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో క్వాడ్ కు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఒక దేశం ఆర్థికంగా బలోపేతమై విస్తరిస్తూ పోతూ, దేశాలను స్వాధీనం చేసుకుంటూ పోయినా,, ఉగ్రవాద శక్తులకు ప్రోత్సాహం కల్పించినా ఇతర దేశాలు మౌనంగా ఉండవేనే సందేశం క్వాడ్ ప్రపంచానికి తెలిపింది. 2004లో బంగాళాఖాతంలో సునామీ తర్వాత ఏర్పడ్డ ఈ నాలుగు దేశాల స్నేహం 2007లో జపాన్ ప్రధాని షింజో అబే చొరవతో ఒక కూటమిగా అవతరించింది. కాని 2017లో మనీలాలోని ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో డోనాల్డ్ ట్రంప్, షింజో అబే, మాల్కం ట్రంబెల్, నరేంద్రమోదీ కలిసికట్టుగా క్వాడ్ కూటమిని ఏర్పర్చుకున్నారు. ఈ స్నేహం క్రమంగా దౌత్యపరమై, సైనిక పరమైన అవగాహనకు దారితీసింది.తర్వాతి కాలంలో లో ఈ దేశాలు కలిసికట్టుగా నౌకా విన్యాసాలను జరిపాయి. భారత-పసిఫిక్ లో భావసారూప్యత గల సమర్థవంతమైన మారిటైమ్ శక్తిగా రూపొందాయి.
అమెరికా-భారత్ -జపాన్ మంత్రిత్వ స్థాయిలో పలు త్రైపాక్షికచర్చలు జరిపాయి, భారత-అమెరికా నౌకా విన్యాసాల్లో జపాన్ ను శాశ్వతంగా చేర్చుకున్నాయి. జపాన్ భారత దేశానికి రక్షణ ఉపకరణాల అమ్మకం కలిసికట్టుగా ఉత్పత్తి కోసం స్నేహహస్తం చాచింది.రక్షణ టెక్నాలజీ కిసంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. మరో వైపు భారత-జపాన్- ఆస్ట్రేలియా త్రైపాక్షిక చర్చలు కూడా ఫలవంతమయ్యాయి. అంతేకాక భారత్ – ఆస్ట్రేలియాలు ఇండోనేషియాతో కూడా త్రైపాక్షిక చర్చలు ప్రారంభించాయి. అమెరికాకు జపాన్, ఆస్త్రేలియా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ తో ఉన్న లోతైన సంబంధాలు భారత దేశానికి దౌత్యపరంగా ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో ఈ దేశాలన్నిటితో బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. ఇవాళ రష్యాతో పాటు అమెరికా కూడా భారత్ కు ఒక బలమైన రక్షణ భాగస్వామి. అమెరికాతో సైనిక విన్యాసాలు మాత్రమే కాక కలిసికట్టుగా రక్షణ ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ది కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్ లో అమెరికా, ఆస్ట్ర్లేలియా,జపాన్, భారత్ మరో నాటోగా బలమైన శక్తిగా మారేందుకు రంగం సిద్దమైంది.. నిజానికి అఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామికంగాఎన్నికైన ప్రభుత్వాలకు భారత్ ఎప్పుడూ మద్దతునిస్తోంది. ఆ దేశంలో 300 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిన భారత్ దేశమంతతా 400 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహాయం చేసింది.
అఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా భారత్ స్నేహ హస్తం చాచింది. అక్కడ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను సాగిస్తే భారత్ వ్యతిరేకించాల్సింది ఏమీ ఉండదు. కాని భారత్ లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపించి విఫలమైన పాకిస్తాన్ అఫ్ఘన్ లో పరిణామాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుని సమస్యలను సృష్టించాలని ప్రయత్నిస్తే భారత ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. అదే సమయంలో తాలిబాన్లతో స్నేహసంబంధాలు పెంచుకుని నిధులు సరఫరా చేసేందుకు చైనా చేసే ప్రయత్నాలను కూడా భారత్ గమనించకపోలేదు.
ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డా కావడం, చైనా విస్తరణ వాదం , చైనాకు పాకిస్తాన్ కు మధ్య ఉన్న సంబంధాల గురించి మొత్తం ప్రపంచం గమనిస్తోంది. అదే సమయంలో ఆల్ ఖాయిదాకు పాకిస్తాన్ ఇచ్చిన ప్రోద్బలం కూడా ప్రపంచానికి తెలుసు. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన, క్వాడ్ దేశాల సమావేశం పాకిస్తాన్ కు,దాన్నిసమర్థించే శక్తులకూ ముచ్చెమటలు పోయించడంలో ఆశ్చర్యం లేదు. ప్రపంచ దేశాధినేతల్లో జనాదరణ నేతగా గుర్తింపు పొందిన మోదీ ఈ పర్యటనతో ప్రపంచ చిత్రపటంలో భారత్ మరింత బలమైన దేశంగా నిలదొక్కుకుంటుందనడంలో సందేహం లేదు.

-వై.సత్యకుమార్,
బిజెపి జాతీయ కార్యదర్శి

LEAVE A RESPONSE