జగనన్న పుణ్యాన పెరిగిన తెలంగాణ మందు ఆదాయం

– 14000 కోట్లు పెరిగిన తెలంగాణ ఆబ్కారీ ఆదాయం
గత రెండున్నరేళ్లుగా పిచ్చి బ్రాండ్లు అమ్ముతూ.. ఏపీ సీం జగన్ కొనసాగిస్తున్న నిర్ణయం, తెలంగాణ ఖజానాకు కాసులు కురిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల చేతిలో చీప్ లిక్కర్ అమ్మకాలు వెళ్లిన నేపథ్యంలో.. బ్రాండెడ్ మందుకు అలవాటుపడ్డ మందుబాబులు, సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. తనిఖీల వంటి లంపటాలు లేకుండా, కృష్ణా- గుంటూరు జిల్లా సరిహద్దులో ఉన్న తెలంగాణ వైన్‌షాపులకు వెళ్లి మస్తుగా తాగుతున్నారు. ఇంకొంతమంది ఏదో ఒక రూపంలో తెలంగాణ మందు తెచ్చుకుంటున్నారు.
గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో వైసీపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు- స్థానిక నేతలకు ఈ దందా కల్పవృక్షంగా మారిందట. సరే.. ఏదైతేనేం.. జగనన్న పుణ్యాన కష్టాల్లో ఉన్న తెలంగాణ ఖజానాను, ఆంధ్రామందుబాబులు ఆదుకుంటున్నారు.
అలంపూర్‌ మునిసిపాలిటీలో ఒక మద్యం దుకాణం ఉండగా, అందులో రూ.50 కోట్ల అమ్మకాలు జరిగాయి. వడ్డేపల్లి మునిసిపాలిటీలోని మద్యం దుకాణంలో రూ.40 కోట్ల వరకు మద్యం అమ్ముడైంది. కోదాడ మండలం నల్లబండగూడెంలోని దుకాణంలో రూ.52 కోట్ల మద్యం అమ్ముడైంది.
నల్లగొండ జిల్లాలోని మద్యం దుకాణాల్లో పెద్దవూర మద్యం దుకాణం-1లో రూ.40 కోట్ల వరకు అమ్మారు. మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో 12 మద్యం దుకాణాలుండగా.. సగటున రూ.20 కోట్ల మద్యం అమ్ముడైంది. అడవిదేవులపల్లిలోని మద్యం దుకాణంలోనూ రూ.40 కోట్ల వరకు అమ్మారు.
ఖమ్మం జిల్లా కల్లూరులోని నాలుగు మద్యం దుకాణాల్లో దాదాపు రూ.90 కోట్లు, కామెపల్లిలో రూ.55 కోట్లు, ఎర్రుపాలెంలోని ఓ మద్యం దుకాణంలో రూ.25 కోట్ల మద్యం సేల్స్‌ జరిగాయి.
ఆంధ్ర సరిహద్దులోని అశ్వారావుపేట, మధిర, సత్తుపల్లి, తల్లాడ, ముదిగొండ, చింతకాని, బోనకల్‌, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, నాగార్జునసాగర్‌, తదితర మద్యం దుకాణాల్లో అధికంగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గత రెండేళ్లలో రాష్ట్రంలో రూ.54వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంతకుముందు మద్యం పాలసీతో పోలిస్తే దాదాపు రూ.14వేల కోట్ల వరకు అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.12 వేల కోట్లు, నల్లగొండలో రూ.6 వేలకోట్లు, హైదరాబాద్‌లో రూ.5800 కోట్ల అమ్మకాలు జరిగాయి.
కొత్త మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 23వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 8వేల దరఖాస్తులు రావడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 210 మద్యం దుకాణాలకు 4500 వరకు దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డిలోనూ 4500 దరఖాస్తులు దాఖలయ్యాయి. హైదరాబాద్‌లో 1300 వరకు వచ్చాయి.