Suryaa.co.in

National

ఇండియా- అమెరికా కలిసి పని చేయాలి

– చైనాను ఎదుర్కొనే ప్లాన్‌ చెప్పిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఖచ్చితంగా సమావేశం అవుతానని, అన్ని విషయాలు మాట్లాడతానని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. చైనాతో స్నేహ పూర్వక సంబంధాలను కోరుకుంటున్నాననే తప్ప, గొడవలు కాదని ఖరాఖండీగా చెప్పారు. భవిష్యత్‌లో అన్ని ప్రధాన దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని ట్రంప్‌ వ్యక్తం చేశారు. ప్రతీకారం కోసం ఒకరిపై ఒకరు డబ్బు ఖర్చు చేసుకునే బదులు, ఆ డబ్బును మంచి పనులు -ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని కూడా ట్రంప్‌ సూచించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా, మోదీ కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. చైనాతో వాణిజ్యం, సుంకాల యుద్ధం గురించి అడిగిన ప్రశ్నలకు అమెరికా అధ్యక్షుడు బదులు ఇచ్చారు.

చైనాను ఎదుర్కోవడంలో భారత్‌-అమెరికా సంబంధాలను మీరు ఎలా చూస్తారని ANI డొనాల్డ్ ట్రంప్‌ను అడిగింది. దీనికి సమాధానంగా మాట్లాడిన ట్రంప్‌, “చైనాతో మా సంబంధాలు చాలా బాగుంటాయని నేను భావిస్తున్నాను. కోవిడ్-19కి ముందు, నాకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తో చాలా మంచి సంబంధాలు ఉండేవి. ప్రపంచంలో చైనా చాలా ముఖ్యమైన దేశం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో జిన్‌పింగ్‌ మాకు సహాయం చేయగలరని నేను భావిస్తున్నాను. చైనా, భారత దేశం, రష్యా, అమెరికా కలిసి పని చేయగలవని నేను ఆశిస్తున్నాను. ఇది చాలా ముఖ్యం కూడా” అని చెప్పారు.

‘ప్రతీకారం కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం ఎందుకు?’ – ట్రంప్‌..

భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో ఇంకా చాలా విషయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడారు. “నా మొదటి పదవీ కాలంలో అణ్వాయుధ నిరాయుధీకరణ ‍‌గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో మాట్లాడాను. నా ప్రయత్నానికి సానుకూల స్పందన వచ్చింది. అదే విధంగా, నేను ఈ విషయంపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా మాట్లాడాను, ఆయన కూడా చాలా చక్కగా స్పందించారు. మేము (అమెరికా), దేశ రక్షణ కోసం 900 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాము. చైనా కూడా 450 బిలియన్‌ డాలర్ల వరకు వెచ్చిస్తోంది. ఇంత డబ్బును ఒకరిపై మరొకరు ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బును మంచి ప్రయత్నాల కోసం ఎందుకు వినియోగించకూడదు..?. భవిష్యత్తులో ఇలాంటి మంచి జరుగుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని వెల్లడించారు.

ఇజ్రాయెల్ & హమాస్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి నేను మాట్లాడతా: ట్రంప్‌

“నేను అధికారంలో ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం లేదు &రష్యా – ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం లేదు. నేను తిరిగి అధికారం లోకి వచ్చేసరికి ప్రపంచం మొత్తం రగిలి పోతోంది. నేను ముందు ఈ మంటను చల్లార్చాలి. ఆ తరువాత, నేను రష్యా & చైనా లతో కూర్చుని మాట్లాడతాను. పరస్పర సంఘర్షణను ముగించడానికి అవసరమైన విషయాల గురించి ఖచ్చితంగా చర్చిస్తాను” అని డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు..

LEAVE A RESPONSE