-అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
-పర్యాటక ప్రాజెక్ట్ పనులను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేయాలి
-ప్రైవేట్ కు ధీటుగా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దాలి
-స్వయం సమృద్ధి సాధించాలి
-వినూత్న మార్గాలను అన్వేషించి ఆదాయం పెంచాలి
-తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సమీక్షలో అధికారులకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం
హైదరాబాద్, జనవరి 2: జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆక్టుకునేలా తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని అబ్కారీ, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేట లోనిహరిత ప్లాజా లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్ లు, హరిత హోటల్స్ నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారామంత్రికి వివరించారు.
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పర్యాటక శాఖ ఆద్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్ లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్దిష్ట కాల వ్యవధిని నిర్దేశించుకొని, దానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని, నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు.
రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెరగాలంటే అందుకుతగ్గ వసతులు ఉండాలని, ప్రపంచ స్థాయి పర్యాటకులను రప్పించాలంటే ఆ స్థాయి సౌకర్యాలు కలిపించినప్పుడే ఆది సాధ్యపడుతుందని చెప్పారు.
ప్రైవేట్ కు ధీటుగా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దాలని, ఆక్సుపెన్సీ రేషియో పెంచుకునేలా వినూత్న మార్గాలను అన్వేషించి ఆదాయం పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్వహణలో నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఆదాయంలో ప్రైవేటు హోటల్స్
తో పోటీ పడాలని, ప్రభుత్వంపై ఆధార పడకుండా
స్వయం సమృద్ధి సాధించి, ఇతర శాఖలకు మార్గదర్శకంగా నిలవాన్నారు. పర్యాటక శాఖను మరింత లాభాల బాట పట్టించేందుకు నిబద్ధతతో పని చేయాలని అధికారులకు హితవు పలికారు.
కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని, మంచి ఫలితాలు వచ్చేలా సమిష్టిగా అధికారులందరూ పని చేయాలన్నారు.
అంతకుముందు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది మంత్రి జూపల్లికి నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, జనరల్ మేనేజర్ ( ఫైనాన్స్) శాంతి, జనరల్ మేనేజర్ (అడ్మిన్) రవీందర్ నాయక్, జనరల్ మేనేజర్ ( టూర్స్) తదితర అధికారులు పాల్గొన్నారు.