Suryaa.co.in

Telangana

36 నెలల్లో మూసీ నదీ పరివాహక అభివృద్ధి

-తొలిదశలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి
-హెచ్ఎండీఏ అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని రాబోయే 36 నెలల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అందులో భాగంగా తొలుత హైదరాబాద్ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధి పై మంగళవారం నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్ డిజైన్ ఇందుకోసం ఎంపిక చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎమ్యూస్ మెంట్ పార్క్, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ ఉండాన్నారు.

ఇందుకోసం విదేశాలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్ట్ ల డిజైన్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లోగా సంబంధిత పనులు ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆకస్మిక వరదలు వచ్చిన తట్టుకునే విధంగా వర్షపు నీటిని మూసీలోకి మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

మూసీ నది పరీవాహక అభివృద్ధికి భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రక కట్టడాలు చార్మినార్, తారామతి బరాదరీ, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ డిజైన్ రూపొందిచాలన్నారు.

పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE