Suryaa.co.in

Andhra Pradesh

అప్పర్ భద్రా ప్రాజెక్టు నిర్మాణంతో ఏపికి తీవ్ర అన్యాయం

-రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం
-ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
-రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ

అనంతపురం అర్బన్: ఏప్రిల్ 1.: కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్రా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఏపిలో రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి నీటి సామర్థ్యంతో నిర్మించాలని కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న అప్పర్ భద్రా ప్రాజెక్టును ఆపాలని జిల్లా కేంద్రంలోని కమ్మ భవన్ లో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు,మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్, సీనియర్ నాయకుడు ఎంవి రమణ, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దాదా గాంధి, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పెద్దన్న, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామక్రిష్ణ మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల లబ్దికోసమే అప్పర్ భద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారని ఏకరువు పెట్టారు.
ప్రాజెక్టు నిర్మాణానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు సైతం లేవని స్పష్టం చేశారు. అప్పర్ భద్రా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇంత జరుగతున్నా ఇటీవల బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం అప్పర్ భద్రా నిర్మాణానికి 5 వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారేగాని నిధులు ఏమాత్రం మంజూరు చేయడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2 వేల 9 వందల కోట్లు కేంద్రం ఇవ్వాల్సివుండగా ఆ అంశాన్ని పట్టించకోకుండా అప్పర్ భద్రా కు 5 వేల కోట్ల పైచిలుకు నిధులు విడుదల చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి వ్యవస్థలన్నింటిని తుంగలో తొక్కుతున్నారని బీజేపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పు బడుతున్నామని అసహనం వ్యక్తం చేశారు.రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని నిరూపించుకుంటోన్దని దీన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు.కేంద్రంలో బిజెపి,రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాల స్వార్థ రాజకీయాలవల్ల హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, శ్రీశైలం డ్యాం ద్వారా రాయల సీమకు వచ్చే నీటికి ఇబ్బందులు ఎదురౌతాయని విచారం వ్యక్తంచేశారు.

అంతేకాకుండా తుంగ భద్రా నుండి శ్రీశైలం డ్యాం కు వచ్చే అదనపు నీరు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో రాయలసీమ ప్రాంతం ఎడారి కాబోతోందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని కావలసిన నిధులు విడుదల చేయకపోగా ఉన్న నిధులను సైతం సక్రమంగా ఖర్చు చేయడం లేదని విరుచుకు పడ్డారు.రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల సత్వర నిర్మాణం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు అన్ని వర్గాల ప్రజలు సమాయత్తం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకుడు న్యాయవాది ఐదుకల్లు రవీంద్ర,ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ సాకే హరి,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి,మల్లికార్జు,జిల్లా కార్యవర్గ సభ్యులు రాజారెడ్డి, శ్రీరాములు, రామకృష్ణ, నారాయణస్వామి, రమణ, కేశవరెడ్డి, రంగయ్య, లింగమయ్య, నాగార్జున, పెద్దయ్య, గోవిందప్ప, చెన్నప్ప యాదవ్,రాజేష్ గౌడ్, పిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీరాములు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుల్లాయి స్వామి, చిరంజీవి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్, సంతోష్ కుమార్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి అల్లిపిరా, ప్రజా సంఘాల నాయకులు సిపిఐ జిల్లా సమితి సభ్యులు నగర కార్యవర్గ సభ్యులు సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE