Suryaa.co.in

Telangana

కీలక ప్రాజెక్టుల కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం:కేటీఆర్‌

హైదరాబాద్‌: అభివృద్ధిలో దూసుకెళ్తోన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు మరింత చేయూతను అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ ఐటీసీ కాకతీయలో సీఐఐ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅథిగా హాజరయ్యారు. బెస్ట్ ఇన్నోవేషన్, బెస్ట్ స్టార్టప్, బెస్ట్ ఎక్స్ పోర్ట్ కేటగిల్లో అవార్డులను కేటీఆర్ అందజేశారు. బెస్ట్ ఇన్నోవేషన్ – గోల్డ్ కేటగిరీలో 2021 సంవత్సరానికి గాను ఇండస్ట్రీస్ అవార్డును భారత్ బయోటెక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అవార్డులు అందజేసిన మంత్రి కేటీఆర్ రాష్ట్రం పట్ల కేంద్రం తీరును నిరసించారు.
‘‘దేశ జీడీపీ, ఎకానమీకి తెలంగాణ కీలక భాగస్వామిగా ఉంది. అయినప్పటికీ రాష్ట్రానికి తిరిగి ఇచ్చేందుకు కేంద్రానికి మనసు రావడం లేదు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ నిధులను వారికి అందించే వరకు కేంద్రానికి గుర్తు చేస్తూనే ఉంటాం. ఐటీఐఆర్ ప్రాజెక్టు, బుల్లెట్ ట్రైన్, ఇతర ఏ అభివృద్ధి ప్రాజెక్టుల్లోనూ రాష్ట్రాన్ని కేంద్రం భాగస్వామిని చేయలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాలకు ఈ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోంది’’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE