పెట్టుబడుల సేకరణలో జగన్‌, విజయసాయి కీలకపాత్ర:సీబీఐ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డి.. తన తండ్రి అధికారంతో పలువురికి లబ్ధి చేకూర్చి, వారి నుంచి పెట్టుబడుల రూపంలో ముడుపులు సేకరించారని సీబీఐ వాదించింది. హెటిరో భూకేటాయింపులకు, జగతి పబ్లికేషన్స్‌లో ఆ కంపెనీ పెట్టుబడులకు సంబంధం ఉందని సీబీఐ స్పష్టం చేసింది.
హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించవద్దని ఉన్నత న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన పలు వ్యాజ్యాలపై హైకోర్టు రోజువారీ విచారణలో భాగంగా… జస్టిస్ షమీమ్ అక్తర్ ఇవాళ హెటిరో, ఆ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపారు. సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది కె.సురేందర్ వాదనలు వినిపించారు.
‘‘జగన్‌ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పలువురికి లబ్ధి చేకూర్చి వారి నుంచి ముడుపులను రాబట్టేందుకు విజయసాయిరెడ్డి, జగన్‌ కుట్ర పన్నారు. పెట్టుబడుల రూపంలో ముడుపులను సేకరించేందుకు పక్కా పథకాన్ని రూపొందించారు. జగతి పబ్లికేషన్స్‌లో జగన్ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూ. 1,246 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టారు. జగన్‌కు చెందిన కార్మెల్ ఏసియా, సండూప్ పవర్ రూ.73 కోట్లు పెట్టినప్పటికీ.. అవి కూడా ఇతరులు పెట్టిన సొమ్మే.
భూకేటాయింపులు, పెట్టుబడులు వేర్వేరు అని హెటిరో చేస్తున్న వాదన తప్పు. ఆ రెండింటిని కలిపి చూస్తేనే కుట్ర బయట పడుతుంది. ప్రజాప్రయోజనం, ఉపాధి కల్పన, అభివృద్ధి కోసమే అయితే నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? భూకేటాయింపులకు సంబంధించిన దస్త్రాలు పరిశీలిస్తున్న క్రమంలో పెట్టుబడులు జగతి పబ్లికేషన్స్‌లోకి మళ్లినట్లు గుర్తించాం. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయి. ఆయనపై కేసును కొట్టివేయొద్దు. సీబీఐ కోర్టులో కేసు డిశ్చార్జ్ పిటిషన్ దశలో ఉంది. పూర్తి స్థాయి విచారణ జరిగినప్పుడు అన్ని ఆధారాలతో రుజువు చేస్తాం’’ అని సీబీఐ వాదనలు వినిపించింది. పిటిషన్‌పై రేపు కూడా విచారణ జరగనుంది.

Leave a Reply