-బెజవాడ సీపీగా పీహెచ్‌డి రామకృష్ణ
– ఈసీ నిర్ణయం
విజయవాడ: ఇంటలిజన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీసు కమిషనర్‌గా పిహెచ్‌డి రామకృష్ణ నియమితులయ్యారు. ఇంటలిజన్స్ చీఫ్‌గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసుకమిషనర్‌గా ఉన్న కాంతిరాణా తాతాలను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి స్థానంలో ఇంటలిజన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, బెజవాడ సీపీగా రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
దానికంటే ముందు.. ఇంటలిజన్స్ చీఫ్ పోస్టు కోసం కుమార్ విశ్వజిత్, అతుల్‌సింగ్, ఎన్.సంజయ్ పేర్లు సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈసీకి జాబితా పంపించారు. అదేవిధంగా విజయవాడ పోలీసు కమిషనర్ కోసం మనీష్‌కుమార్‌సిన్హా, పిహెచ్‌డి రామకృష్ణ, హరికృష్ణ పేర్లు సిఫార్సు చేశారు. అందులో ఇంటలిజన్స్ చీఫ్‌గా విశ్వజిత్, బెజవాడ సీపీగా రామకృష్ణను ఈసీ ఎంపిక చేసింది. నిజానికి విజయవాడ సీపీగా వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి, కడప ఎంపి అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఒక అధికారి వస్తారన్న ప్రచారం రెండురోజుల పాటు వినిపించింది. కానీ ఈసీ అన్ని కోణాలు పరిశీలించి, విశ్వజిత్-రామకృష్ణను ఎంపిక చేసింది.
కాగా ఈ ఇద్దరు అధికారులపై ఇప్పటివరకూ ఎలాంటి ఆరోపణలు గానీ, పార్టీ ముద్రలుగానీ లేకపోవడం కూడా వారి ఎంపికకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రామకృష్ణ అధికారపార్టీ వారి మాట ఖాతరు చేయకపోవడం, ముక్కుసూటిగా పనిచేయడం వల్ల ఆయన అనేకసార్లు బదిలీకి గురయ్యారు. ఇప్పుడు ఏసీబీలో ఐజీగా పనిచేస్తున్న రామకృష్ణ బెజవాడ సీపీగా నియమితులు కావడంతో, అక్కడి కమిషనరేట్‌లో ఎన్నికలు ప్రశాంతంగా-నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది.