– నాడు ఉద్యోగులపై జగన్ ఉక్కుపాదం
– నేడు జగన్ పార్టీపై ఓట్లతో ఉద్యోగుల ఉక్కుపాదం
– పోటెత్తిన ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్
– గతంలో కంటే పెరిగిన ఓట్ల శాతం
– కసి తీరా ఓటేసిన ఏపీ ఉద్యోగులు
– ఉద్యోగ, పెన్షనర్ల కుటుంబాల ఓట్లు 30 లక్షలు
– మంత్రి కొట్టునే పరిగెత్తించిన ఉద్యోగుల ఆగ్రహం
– ఉద్యోగుల కాళ్లకు దణ్ణం పెట్టిన వైసీపీ అభ్యర్ధులు
– పోస్టల్ బ్యాలెట్‌లో ‘ఫ్యాను’ రెక్కలు విరిచేసిన ఉద్యోగులు
– వైసీపీ కొంప ముంచిన టీచర్లు
– జగన్‌కు ఉద్యోగుల ఓట్లూ పాయె
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఉద్యోగులంటే ఒకప్పుడు పాలకులకు మహా భయం. వాళ్లు కన్నెర చేస్తే పీఠాలు కదులుతాయన్న భయం. అందుకే ప్రతి పాలకుడూ వారిని జాగ్రత్తగా చూసుకున్నారు. చంద్రబాబునాయుడు కూడా వారితో పనిచేయించి, తర్వాత ‘ఫలితం’ అనుభవించారు. ఆ తర్వాత ఆ అనుభవంతో విభజిత రాష్ట్రంలో, వారిని ఇంటల్లుడిలా చూసుకున్నారు. ఖజానా బోసిగా ఉన్నా వారిని తృప్తి పరిచారు.
అయినా ఉద్యోగుల ఆశ చావలేదు. ఇంకేదో ఆశించారు. ‘అంతకుమించి’.. ఇస్తామని అప్పటి విపక్ష నేత-వైసీపీ అధినేత జగన్ హామీలు గుప్పించారు. దానిని నమ్మి ఉద్యోగులు రెండు చేతులతో ఓట్లేసి వైసీపీని గద్దెనెక్కించారు. ఆ మాట వారే చెప్పారు మరి! అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వారిని మర్చిపోయారు. సీపీఎస్ రద్దు హామీ అమలు కుదరదన్నారు. బాబు జమానాలో ఒకటో తేదీన జీతాలు తీసుకున్న ఉద్యోగులు, పెన్షనర్లకు.. 15వ తేదీ కూడా అవి రావడం కష్టమైపోయింది. కొత్త కోరికల మాట దేవుడెరుగు. నెలకు జీతం సక్రమంగా ఇస్తే చాలన్న స్థాయికి వచ్చేశారు. డీఏలు దైవాధీనం లారీ సర్వీసులా మారింది. ఉద్యోగులపై ఏసీబీ దాడులు పెరిగాయి. ఎవరికీ ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. దానితో ‘జగన్ ఉద్యోగుల దూల బాగా తీర్చార’ని, సోషల్‌మీడియాలో ఉద్యోగులను వెటకారం చేయడం ప్రారంభమయింది.
ఉద్యోగ సంఘ నేతలు మాత్రం.. జగన్‌కు భజన సంఘాల్లా మారినా, ఉద్యోగులు వైసీపీ సర్కారుపై కుతకుతలాడారు. ప్రధానంగా టీచర్లపై జగన్ ఉక్కుపాదం మోపారు. విజయవాడకు వచ్చేందుకు ప్రయత్నించిన ఉద్యోగులను, ఎక్కడికక్కడ అరెస్టులుచేశారు. ముఖ హాజరు పేరుతో వారిని వేధించారు. జగన్‌కు భజన చేసే ఐఏఎస్ అధికారి వచ్చి, ఆకస్మిక తనిఖీల పేరిట రాష్ట్రంలోని టీచర్లను హడలెత్తించారు. ఇవన్నీ ఉద్యోగులలో వైసీపీ సర్కారు వ్యతిరేకతకు కారణమయ్యాయి.
ఆ ఆగ్రహం-అసంతృప్తి పోస్టల్ బ్యాలెట్ రూపంలో చూపించారు. గతంలో పోస్టల్ బ్యాలెట్‌ను పార్టీల ప్రతినిధి చేతికి ఇచ్చే పద్ధతి ఉండేది. దానితో వారిని ప్రలోభపెట్టడం సులభమయ్యేది. ఇప్పుడు ఆ పద్ధతి మార్చారు. దానితో ఉద్యోగులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఉద్యోగుల వ్యతిరేకత గ్రహించిన వైసీపీ సర్కారు.. పోస్టల్ బ్యాలెట్ సంఖ్యను తగ్గించేందుకు విశ్వప్రయత్నం చేసినా, ఈసీ జోక్యం చేసుకుని గడువు పొడిగించడంతో అది విఫలమయింది.
ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఉన్నారని గ్రహించిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ల కాళ్లబేరానికి రావలసి వచ్చింది. జగన్‌ను కాదు. మా ముఖం చూసి ఓటేయండని ప్రాధేయపడాల్సి వచ్చింది. తాజాగా పోస్టల్ బ్యాలెట్ సెంటరుకు వచ్చి, ఓటేయమని అభ్యర్ధించిన మంత్రి కొట్టు సత్యనారాయణను, కారు ఎక్కేంతవరకూ ఉద్యోగులు తరమికొట్టారు.
అంటే జగన్ సర్కారుపై ఉద్యోగుల ఆగ్రహజ్వాల, ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. ఇక మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఓటేసేందుకు వెళుతున్న ఉద్యోగుల కాళ్లు నిస్సిగ్గుగా మొక్కిన వైనం పరిశీలిస్తే.. ఉద్యోగులు కొంపముంచుతారన్న సంగతి, వైసీపీ అభ్యర్ధులకు ముందస్తుగా తెలిసిపోయినట్టయింది. ఇవన్నీ సోషల్‌మీడియాలో అందరూ దర్శించిన దృశ్యాలే.
నిజానికి రాష్ట్రంలో పోస్టల్ ఓటు వినియోగించుకున్న ఉద్యోగుల సంఖ్య 5 లక్షలమందిగా తేలింది. లోక్‌సభ స్థానాలకు 4,44,216 , అసెంబ్లీ స్థానాలకు 4,44,218 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఆఖరిరోజు పార్లమెంటు నియోజకవర్గాలకు 11,374, అసెంబ్లీ నియోజకవర్గాలకు 11,370 ఓట్లు పోలయ్యాయి. నెల్లూరు ఎంపీ నియోజకవర్గంలో అత్యధికంగా 22,650 ఓట్లు, అమలాపురంలో 14,526 అత్యల్పంగా ఓట్లు పోలయ్యాయని ఈసీ ప్రకటించింది.
కొంపముంచింది టీచర్లే
ముఖ్యంగా వైసీపీ సర్కారును వీలైనంత వరకూ భ్రష్ఠు పట్టించింది టీచరు వర్గమే. సమాజాన్ని ప్రభావితం చేసే వర్గమైన టీచర్లు చెప్పే మాట ప్రజలు ఆలకిస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రజలు ఎక్కువగా టీచర్ల సలహాలు తీసుకుంటారు. వారితో ఎక్కువ మమేమవుతారు. ఆ రకంగా ఒక టీచరు పదిమందిని సులభంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. టీచర్లకు ముఖ హాజరు పెట్టాలని నిర్ణయించిన తర్వాత, వారంతా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌత్ పబ్లిసిటీ ప్రారంభించారు.
మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే బతకడం కష్టమన్న ప్రచారాన్ని క్షేత్రస్థాయికి చేర్చారు. దానితో టీచర్లను ఎన్నికల విధుల్లో హాజరుకాకుండా ఉండేలా నిర్ణయించింది. ఫలితంగా మళ్లీ రెచ్చిపోయిన టీచర్లు, జగన్ వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పుడు గ్రామాల్లో ప్రజలు చెబుతున్న అభిప్రాయాలన్నీ, టీచర్ల హితబోధల సౌజన్యమే కావడం ప్రస్తావనార్హం.
నిజానికి రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగ, రిటైర్డు ఉద్యోగుల కుటుంబాలకు ఓట్లు ఉన్నాయి. వారిలో జగన్‌పై కులాభిమానం-మతాభిమానంతో ఒకటి, అర శాతం వైసీపీకి ఓటు వేసినా.. మిగిలినవారంతా జగన్‌కు వ్యతిరేకంగానే ఓట్లు వేస్తారని, ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు.
దానికి గతంలో కంటే ఈసారి పెరిగిన బ్యాలెట్ ఓట్లే నిదర్శనంగా కనిపిస్తోంది. 2014లో 5.69 పెరుగుదలతో 78.41శాతం మంది పోస్టల్ ఓట్లు వినియోగించుకున్నారు. ఇప్పుడు 1.23 పెరుగుదలతో 79.64 శాతం పెరగడం బట్టి.. ఉద్యోగులు జగన్ సర్కారుపై, ఏ స్థాయిలో కసితీరా ఓటేశారో స్పష్టమవుతోంది.