– తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఫైర్
హైదరాబాద్: “నాకున్న సమాచారం మేరకు ఆ హీరో థియేటర్ కు వచ్చి సినిమా చూస్తుంటే బయట తొక్కిసలాట జరిగిందని పోలీసులు అధికారులు వచ్చి ఆ హీరోకు చెప్పారు. ఒక మహిళ మృతి చెందిందని, ఒక బాలుడు కిందపడిపోయాడని వారు ఆ హీరోకు వివరించారు. దాంతో ఆ హీరో ఆనందంగా ఇక మన సినిమా హిట్టయినట్టే అన్నాడట. ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది, ఆ పిల్లవాడు తీవ్ర గాయాల పాలయ్యాడు. అయినా గానీ ఆ హీరో థియేటర్లో కూర్చుని సినిమా చూస్తూనే ఉన్నాడు.
థియేటర్ బయటికి వచ్చి కూడా వాహనం పైనుంచి చేయి ఊపుతూ వెళ్లాడుంటే ఏమనాలి? ఇది మానవీయ వైఖరేనా? నేను కూడా బహిరంగ సభలకు హాజరవుతుంటా. ఆ సభలకు వేలాదిగా ప్రజలు వస్తుంటారు. కానీ ఎక్కడా తొక్కిసలాట జరగకుండా జాగ్రత్త పడతా. నా చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్లు ప్రజలను నెట్టివేయకుండా చూసుకుంటాను” అని తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అక్బరుద్దీన్ హీరో అల్లు అర్జున్ పై పరోక్షంగా ధ్వజమెత్తారు.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిందని ఆ హీరోకు పక్కనున్న వాళ్లు చెప్పారని, అలాగైతే మన సినిమా హిట్టయినట్టేనని ఆ హీరో అన్నట్టు తనకు తెలిసిందని వెల్లడించారు. సంధ్య ధియేయటర్లో పుష్ప సినిమా తొక్కిసలాట ఘటనను అసెంబ్లీలో ప్రస్తావించిన అక్బర్, దానిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.