-
తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యలపై రగడ
-
తెలంగాణ ప్రజల దర్శనాలకు ఇబ్బంది ఎందుకు కలిగిస్తున్నారన్న శ్రీనివాసగౌడ్
-
తెలంగాణలో ఆంధ్రావాళ్లు కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకోవడం లేదా అన్న ప్రశ్న
-
ఇలాగైతే తెలంగాణలో ఉన్న ఆంధ్రావాళ్లు భవిష్యత్తులో ఇబ్బంది పడతారని హెచ్చరిక
-
చైర్మన్‌కు స్వేచ్ఛ ఇస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్య
-
మాజీ మంత్రి వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం
-
నిబంధనల ప్రకారం ఆయనపై కేసు పెట్టాలని చైర్మన్ ఆదేశం
-
కేసు వద్దంటూ సీఎంఓ కీలక అధికారి టీటీడీ అధికారికి ఫోన్?
-
ప్రాంతీయ విద్వేషాలకు కారణమవుతుందన్న భయమే కారణమా?
-
రేపు వైసీపీ నేతలు మాట్లాడినా కేసులు పెట్టలేం కదా అంటున్న బోర్డు సభ్యులు
-
శ్రీనివాసగౌడ్‌పై ఏం చర్యలు తీసుకున్నారో బోర్డు మీటింగ్‌లో ఈఓను అడుగుతామన్న సభ్యులు
-
అసలు కొండపై మీడియా ఎందుకంటున్న భక్తులు
-
మీడియాను నిషేధిస్తే నాయకులు మాట్లాడరు కదా అన్న ప్రశ్నలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ తెలంగాణ ఏర్పడిన తర్వాత భారీగా లబ్ధిపొందింది ఆంధ్రావాళ్లే. వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తూ పదవుల్లో లబ్దిపొందుతున్నది కూడా ఆంధ్రావాళ్లే. గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లకు ప్రాధాన్యం ఉండేది. కూటమి ప్రభుత్వం దానిని తొలగించడం అన్యాయం. దేవుడి ముందు అందరినీ సమానంగా చూడాలి. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపడం న్యాయం కాదు. తెలంగాణ పట్ల వివక్ష చూపితే రాబోయే రోజుల్లో, తెలంగాణలో ఆంధ్రావారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. టీటీడీ చైర్మన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఏకైక అనుబంధం తిరుమల మాత్రమే. తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డ శ్రీవారిని దర్శించుకుని, తలనీలాలు సమర్పించుకోవాలని ఆశిస్తాడు. గతంలో దర్శనాల విషయంలో ఎలాంటి తేడాలు రాలేదు. జగన్ కూడా దానినే కొనసాగించారు. కానీ ఇప్పుడు తెలంగాణ భక్తుల పట్ల తేడా చూపిస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు’’
– ఇదీ.. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత శ్రీనివాసగౌడ్ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్న తర్వాత మీడియానుద్దేశించి చేసిన వ్యాఖ్యలు.
మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యలు మీడియా-సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకు మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. నిజానికి గతంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు-తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీలో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులకు గతంలో మాదిరిగానే ప్రాధాన్యం ఇవ్వాలని, తిరుమలపై స్థలం ఇస్తే తాము వసతిగృహం నిర్మించి, తెలంగాణ భక్తులకు ఇస్తామని బాబును కోరారు. కానీ బాబు ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.
ఎందుకంటే తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖను ఆమోదిస్తే, కర్నాటక, మహారాష్ట్ర, చెన్నై ప్రజాప్రతినిధుల లేఖలనూ ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పటికే వీఐపీల దర్శనాల వల్ల, సామాన్య భక్తులు ఇబ్బందిపడుతున్నారన్న విమర్శలువస్తున్నాయి. ఈ కారణంతోనే ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధుల లేఖలు ఆమోదించడం లేదంటున్నారు. అయితే ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మాత్రం, వారికి ప్రొటోకాల్ దర్శనం ఇస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
తర్వాత బీఆర్ నాయుడు చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మాజీ మంత్రి హరీష్‌రావును, మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లారు. ఆ సందర్భంలో హరీష్‌రావు కూడా, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులు ఆమోదించాలని నాయుడును కోరారు. ఆ తర్వాత టీటీడీ ఈఓ శ్యామలరావు నిర్వహించిన ‘డయల్ యువర్’ ఈఒ కార్యక్రమంలో, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదించలేమని స్పష్టం చేశారు.
ఆ తర్వాత తిరుమల దర్శనానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం.. తెలంగాణ ప్రజాపతినిధుల లేఖలను ఆమోదించకపోతే, తాము తెలంగాణ అసెంబ్లీలో కీలమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. ‘‘ఆంధ్రా వాళ్లు తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటుంటే మేం ఎప్పుడైనా అడ్డుకున్నామా? మా ప్రాంతంలోని యాదాద్రి, భద్రాచలం, వేములవాడ ఆలయాలకు ఆంధ్రా ఎమ్మెల్యేల లేఖలను ఆమోదిస్తున్నప్పుడు, మీరు టీటీడీకి మేం ఇచ్చే లేఖలను ఎందుకు ఆమోదించరు’’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో యాదగిరిగుట్టకు వెళ్లిన ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ..ఈ విషయంలో ప్రదర్శించిన అత్యుత్సాహం విమర్శలకు దారితీసింది. తాను సీఎంతో టీటీడీకి తెలంగాణ ఎమ్మెల్యేల లేఖల ఆమోదంపై చర్చిస్తానని హామీ ఇవ్వడం విమర్శలకు దారితీసింది. ఓ వైపు టీటీడీ ఈఓ స్వయంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను ఆమోదించమని స్పష్టం చేస్తే, ఆ శాఖతో ఎలాంటి సంబంధం లేని కార్మిక మంత్రి.. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై ఎలా హామీ ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.
తాజాగా మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. మాజీమంత్రి శ్రీనివాసగౌడ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమయింది. ‘‘తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా తిరుమల కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదు. తిరుమల పవిత్ర క్షేత్రమే తప్ప, రాజకీయ వేదిక కాదు. తిరుమలను ఎవరు రాజకీయంగా వేదిక చేసుకున్నా చట్టపరమైన చర్యలు తప్పవని గతంలో స్పష్టం చేశాం. తిరుమల పవిత్రతు కాపాడేందుకే మేం తొలి సమావేశంలోనే ఆమేరకు బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. కొండపై రాజకీయంగా విమర్శలు చేసేవారు ఎంతపెద్దవారైనా విడిచిపెట్టం. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ విమర్శలు తీవ్రంగా పరిగణించి అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నాం’’అని స్పష్టం చేశారు.
తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేదేలేదు.
తిరుమల పవిత్ర క్షేత్రం. ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగింది. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా…
— B R Naidu (@BollineniRNaidu) December 19, 2024
అంతవరకూ బాగానే ఉంది. తిరుమలపై రాజకీయ వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు చేయకుండా నిషేధించిన ఘనత ఈ పాలకవర్గానిదే. అందువల్ల తాము రూపొందించిన నిబంధ నలు అమలుచేసేందుకు, చైర్మన్ నాయుడు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం స్వాగతించదగ్గ పరిణామమే. అయితే..చైర్మన్ నాయుడు మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌పై చర్యలకు ఆదేశించిన తర్వాత, ఏపీ సీఎంఓలోని ఒక కీలక అధికారి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. చైర్మన్ ఇచ్చిన ఆదేశాలు అమలుచేయవద్దని, ఇది రెండు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలు, విద్వేషాలు, రాజకీయ వైరానికి కారణమవుతుందని హితోపదేశం చేసినట్లు సమాచారం. ఆ మేరకు సోషల్‌మీడియాలో కూడా చర్చకు తెరలేచింది.
బహుశా ఈ అంశం తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు.. రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం ఉన్నందున, కేసు విషయంలో ముందుకు వెళ్లవద్దన్న ఆదేశాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సచివాలయం పక్కన ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌ను కూల్చివేసి, దాని స్థానంలో అసెంబ్లీ నిర్మించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు టీటీడీ సిఫార్సు లేఖల వ్యవహారం మాట్లాడిన, బీఆర్‌ఎస్ మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌పై కేసు పెడితే.. అది మళ్లీ ప్రాంతీయ రాజకీయాలకు ఆజ్యం పోసి, బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా లాభం కలిగిస్తుందన్న అంచనా కూడా సీఎంఓ నిర్ణయంలో లేకపోలేదు.
కాబట్టి.. చైర్మన్ నాయుడు ఆదేశాలు అమలయ్యే అవకాశాలు లేవని అర్ధమవుతుంది. ఈ నెల 24న జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో సభ్యులెవరైనా ఈ అంశాన్ని ప్రస్తావిస్తే, ఈఓ ఏం సమాధానం ఇస్తారో చూడాలి. సీఎంఓ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయన్నది, ఈఓ బోర్డు సభ్యులను వివరించి తీరాల్సిందే. ఒకవేళ అలాంటి ఆదేశాలు రాకపోతే, బోర్డు నిర్ణయం ప్రకారం శ్రీనివాసగౌడ్‌పై ఎందుకు కేసు నమోదు చేయలేదన్నదీ వివరించాల్సిందే.
అయితే ఇప్పుడు రాజకీయ అంశాలు ప్రస్తావించిన శ్రీనివాసగౌడ్‌పై చర్యలు తీసుకోకుండా వదిలేస్తే.. రేపు వైసీపీ నేత, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా వంటి వారు సైతం తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తే, వారిపై కేసులు పెట్టే అవకాశం ఉండదు కదా? అని టీటీడీ బోర్డు సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. మరి అప్పుడు తిరుమలపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే, కేసు పెడతామన్న తీర్మానం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.
‘ ఇక్కడి నుంచి బోర్డులో నియమితులమైన మాపై తెలంగాణలో ఎమ్మెల్యేల లెటర్లు తీసుకోవాలన్న ఒత్తిడి ఉంది. కానీ అది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. మా చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం శ్రీనివాస్ గౌడ్‌పై ఏం చర్యలు తీసుకున్నారో మేం రేపు బోర్డు మీటింగులో అడుగుతాం. బోర్డు ఒక తీర్మానం చేస్తే దానిని ఈఓ, అధికారులు అమలుచేయాల్సిందే. మరి లేకపోతే మేం బోర్డులో ఉన్నది ఎందుకు’’ అని తెలంగాణకు చెందిన ఓ బోర్డు సభ్యులు ప్రశ్నించారు.
కాగా టీటీడీ చైర్మన్‌కు స్వేచ్ఛ ఇస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్న మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మాజీ మంత్రి వ్యాఖ్యల ప్రకారం.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ఆమోదం విషయంలో చైర్మన్‌కు స్వేచ్ఛ లేదని చెప్పకనే చెప్పినట్లయింది.
కొండపై మీడియా ఎందుకు?
అయితే.. ఇన్ని వివాదాలకు కారణమవుతున్న తిరుమలపై.. అసలు మీడియాను ఎందుకు నిషేధించరన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ‘కొండపై మీడియాతో మాట్లాడే వెసులుబాటు కల్పించడం వల్లే కదా రాజకీయనేతలు వచ్చి మీడియాతో మాట్లాడగలుగుతుంది? అదే అసలు కొండపై మీడియాను నిషేధిస్తే, అప్పుడు వీఐపీలు మాట్లాడే అవకాశమే ఉండదు కదా? భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్లేప్పుడు మీడియా ఎందుకు? అయోధ్య, రామేశ్వరం, శబరిమల, బద్రీనాధ్, హంపి, శృంగేరి వంటి ఆలయాల్లో మీడియా లేనప్పుడు తిరుమలపై ఎందుకు’’ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బహుశా చైర్మన్ నాయుడు, స్వయంగా ఒక పెద్ద టీవీ చానెల్ అధిపతి అయినందున.. కొండపై మీడియా నిషేధంపై నిర్ణయం తీసుకునేందుకు వెనకాడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా కొండపై పెద్ద మీడియా సంస్థలు, తమిళనాడుకు చెందిన మీడియా ప్రతినిధుల్లో చాలామందికి షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఉన్నాయన్న విమర్శలు లేకపోలేదు. వాటి ఆదాయంతో తిరుపతిలో సెల్‌ఫోన్ డీలర్‌షిప్పులు, భవనాలు నిర్మించే స్థాయికి ఎదిగారంటున్నారు. కేవలం తమ యాజమాన్యాలకు తిరుమల దర్శనాలు చేయించేందుకే తప్ప, కొండపై మీడియా చేసేదేమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.