Suryaa.co.in

Editorial

‘పువ్వు’ నవ్వకపోతే తప్పు పవన్‌దా?

– ఎన్నికల్లో జనసేన సహకరించలేదన్న బీజేపీ నేత మాధవ్
– మరి జనసేన మద్దతు ముందే ఎందుకు తీసుకోలేదు?
– సోము వీర్రాజు జనసేనానిని కలసి మద్దతు కోరారా?
– పొత్తు పెదవులపైనే తప్ప కలసి కదనం ఏదీ?
– జనసేనపై బీజేపీకి పెదవులపై ప్రేమేనా?
– రాష్ట్ర కమిటీలో జనసేనతో పొత్తుపై తీర్మానం ఎందుకు చేయలేదు?
– పవన్‌కు రూట్‌మ్యాప్ ఎప్పుడో ఇచ్చామన్న సోము మాటలు అబద్ధమేనా?
– ఢిల్లీతోనే తన పొత్తు అని స్పష్టం చేసిన పవన్
– బీజేపీకి బలం లేకపోతే అది జనసేన తప్పెలా అవుతుంది?
– ఎన్నికల్లో ఓటమిని జనసేనపై తోసేస్తారా?
– మాధవ్ వ్యాఖ్యలపై జనసైనికుల మండిపాటు
( మార్తి సుబ్రహ్మణ్యం)

గ్య్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ ఆత్మపరిశీలన బదులు.. పరనిందకు పాల్పడటంపై జనసైనికులు మండిపడుతున్నారు. బీజేపీ-జనసేన పొత్తుపై, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలతోపాటు.. ఎన్నికల్లో జనసేన సహకరించలేదన్న ఆయన ఆరోపణలపై జనసైనికులు అగ్గిరాముళ్లలవుతున్నారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తమ అధినేత పవన్‌ను కలసి, కనీస మద్దతు కోరలేదని జనసైనికులు గుర్తు చేస్తున్నారు. జనంలో బలం లేని బీజేపీ.. తన ఓటమి కారణాన్ని, జనసేనపై రుద్దడం చేతకానితనం-పలాయనవాదంగా అభివర్ణిస్తున్నారు.

జనసేన తమతో కలసి రాలేదన్నదే తమ ఆరోపణ అని, కుండబద్దలు కొట్టిన మాధవ్.. తమ రెండు పార్టీల మధ్య పేరుకే పొత్తు ఉందని అంగీకరించడం మరో విశేషం. రెండు పార్టీల మధ్య పేరుకే పొత్తన్న మాధవ్ వ్యాఖ్య అక్షర సత్యాలంటున్నారు. అయితే బీజేపీతో జనసేన కలసి ఉండాలనుకుంటే.. ఇరు పార్టీలు కలసి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేయాలన్న, మాధవ్ షరతును జనసైనికులు తప్పు పడుతున్నారు.

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తమ పార్టీతో కలసి రాకపోవడం, పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్ధులు లేని పరిస్థితుల్లోనే, జనసేన-టీడీపీ కలసి పోటీచేయాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. సోము వీర్రాజు సొంత నియోజకవర్గం-మండలంలో ఆ పార్టీకి అభ్యర్ధులే దిక్కులేరని గుర్తు చేస్తున్నారు. అసలు పోటీ చేసే అభ్యర్ధులే లేని పార్టీ నేతలు కూడా, తమపై ఆరోపణలు చేయడం వింతగా ఉందంటున్నారు.

తమ అభ్యర్ధులకు జనసేన మద్దతు ఉందని పీడీఎఫ్ ప్రచారం చేసుకుంటే, జనసేన దానిని ఖండించలేదని మాధవ్ ఆరోపించడాన్ని జనసైనికులు తప్పుపడతున్నారు. పీడీఎఫ్ ప్రచారాన్ని ఖండించాలని తాము పవన్, నాదెండ్ల మనోహర్‌ను కోరినా పట్టించుకోలేదన్న మాధవ్ విమర్శను జనసైనికులు ఎద్దేవా చేస్తున్నారు.

జనసేన పేరును ఎవరెవరో వాడుకుంటే, దానిని తామెందుకు ఖండించాలని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. తాము బహిరంగంగా పీడీఎఫ్‌కు మద్దతునివ్వాలని ప్రకటించనప్పుడు, పీడీఎఫ్ చేసుకునే ప్రచారాన్ని తాము ఖండించడంలో అర్ధం లేదన్నారు. అనే నిజమైతే మరి బీజేపీ కూడా జనసేన మద్దతు తమకే ఉందని ఎందుకు ప్రచారం చేసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటిదాకా రాజకీయ అంశాలపై పవన్.. ఢిల్లీ నేతలతోనే మాట్లాడుతున్నారు తప్ప, రాష్ట్ర నేతలతో మాట్లాడని వైనాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అసమర్ధ నాయకత్వం వల్లే పవన్, ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. రాజకీయంగా ఎదగడం, సర్కారుపై పోరాడటం చేత కాక.. ఓటమికి జనసేన మద్దతు లేదన్న కారణం చూపించడం, పలాయనత్వమేనని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన మాధవ్, తాను దారుణంగా ఎందుకు ఓడిపోయింది ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదంటున్నారు. టీడీపీ-జనసేన పొత్తులో విజయం సాధించిన మాధవ్, ఇప్పుడు ఘోరంగా ఓడిన కారణాలను విశ్లేషించుకుని, దానిని ఢిల్లీ నాయకత్వానికి వివరిస్తే మంచిదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కల్యాణ్ రాష్ట్ర బీజేపీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆయన వారితో ఎందుకు విసిగిపోయారో కూడా జాతీయ నాయకత్వాన్ని అడిగి తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

విశాఖ స్టీల్, రైల్వే జోన్ వంటి అంశాలపై మేధావులకు నచ్చచెప్పడంలో, బీజేపీ నేతలు విఫలమయ్యాయని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ స్టీల్‌పై తాము చేసిన పోరాటాల్లో, బీజేపీ పదిశాతం కూడా చేయలేదని గుర్తు చేస్తున్నారు. రహదారుల సమస్యపై తాము ప్రత్యక్ష ఆందోళన చేస్తే, వాటికి బీజేపీ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నిస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడంలో బీజేపీ విఫలమయిందన్న పట్టభద్రుల ఆగ్రహానికి, సరైన సమాధానం ఇవ్వడంలో బీజేపీ నేతలు విఫలయ్యారని విశ్లేషిస్తున్నారు.

జనసేన కలసి రాకపోతే జనంతోనే పొత్తు అని, గతంలో ప్రకటించిన సోము వీర్రాజు.. మరి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో జనంతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? ఒకవేళ పెట్టుకున్నా ఓడిపోయినందున, బీజేపీకి సరైన వ్యూహం లేనట్లే కదా? అని జనసైనికులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

వైసీపీ సర్కారుపై కనీసం బంతిపూల యుద్ధం కూడా చేయకుండా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రత్యక్ష పోరాటాలు చేయని బీజేపీని ప్రజలు, మేధావులు ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఎదుగుదల- ప్రభుత్వం సమస్యలు లేకుండా పాలన సాఫీగా సాగిపోవడానికి, కేంద్రంలోని బీజేపీనే కారణమన్న అభిప్రాయాన్ని తొలగించడంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం విఫలమయిందని జనసైనికులు విశ్లేషిస్తున్నారు.

పవన్‌కు రోడ్‌మ్యాప్ ఎప్పుడో ఇచ్చామని సోము వీర్రాజు.. గతంలో చేసిన మాటలు అబద్ధమేనని, ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. కలసి వస్తే జనసేనతో పొత్తు ఉంటుందని, లేకపోతే జనంతోనే పొత్తు ఉంటుందన్న వీర్రాజు వ్యాఖ్యలను జనసైనికులు గుర్తుచేస్తున్నారు.

జనసేనతో పొత్తు ఉంటుందని చెప్పిన సోము వీర్రాజు.. గత రాష్ట్ర కమిటీ సమావేశాల్లో, ఆ మేరకు స్పష్టంగా తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. జససేన పేరు ప్రస్తావించకుండా, కలసివచ్చే పార్టీతో పోటీ చేస్తామని స్పష్టం చేశారంటే.. బీజేపీలోని ఓ వర్గానికి, జనసేనతో కలసి పోటీ చేయడం ఇష్టం లేనట్లు అర్ధమవుతుందని జనసైనికులు విశ్లేషిస్తున్నారు.

ప్రధానంగా వైసీపీ సర్కారు చేస్తున్న అప్పులకు.. కేంద్రంలోని బీజేపీ సహకరించకపోతే, అన్ని అప్పులు ఎలా పుడతాయన్న సామాన్యుల ప్రశ్నలకు.. బీజేపీ ఏం సమాధానం ఇస్తుందని నిలదీస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అప్పులతోపాటు, ఇవ్వాల్సిన నిధులే ఇవ్వని కేంద్రం.. ఏపీ సర్కారు ఎప్పుడు అడిగితే అప్పుడు, నిధులు ఇవ్వడం వెనుక మతలబేమిటని ప్రశ్నిస్తున్నారు. దీన్నిబట్టి వైసీపీ-బీజేపీ ఒకటేనన్న భావన సహజంగానే ఏర్పడుతుందని, దానిని ఖండించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని నిరూపించుకోవాల్సిన బీజేపీ, మౌనంగా ఉండటం కూడా ఆ పార్టీని దెబ్బతీసిందని విశ్లేషిస్తున్నారు.

తాము రాష్ట్రంలో మోదీ-అమిత్‌షాను అడిగే నిర్ణయం తీసుకుంటున్నామని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలోనే స్పష్టం చేసిన విషయాన్ని జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. దానిని గతంలో అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్ తప్ప ఇప్పటికీ ఎవరూ ఖండించి, ఎదురుదాడి చేయలేదని స్పష్టం చేస్తున్నారు.

దానితో ప్రజలు ఇప్పటికీ అదే నిజమని నమ్ముతున్నారంటున్నారు. వైసీపీ-బీజేపీ కలసే ఉన్నామని ప్రచారం చేస్తున్న వైసీపీ.. రాష్ట్రంలో బీజేపీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందన్న మాధవ్, దానిని తమ నాయకత్వం వద్ద తేల్చుకోకుండా, జనసేనను నిందించడం ఎంతవరకూ సబబని ప్రశ్నిస్తున్నారు.

గతంలో తిరుపతి ఎంపీ అభ్యర్ధిని ఏకపక్షంగా ప్రకటించిన బీజేపీ, ఎన్నికల ప్రచారంలో జనసేనను ఎందుకు భాగస్వామిని చేయలేదని, జనసైనికులు నిలదీస్తున్నారు. అయినప్పటికీ ఆ ఎన్నికలో పవన్ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో, బీజేపీ తమ పార్టీని ప్రచారానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నిస్తున్నారు.

బీజేపీలోనే టీడీపీ అనుకూల- వ్యతిరేక వర్గాలున్నాయని, కొందరు వైసీపీకి రహస్యంగా మద్దతిస్తుంటే, మరికొందరు టీడీపీతో పొత్తు కోరుకుంటున్నారని జనసైనికులు విశ్లేషిస్తున్నారు. అసలు పొత్తుపై జాతీయ నాయకత్వం అభిప్రాయమేమిటో తెలుసుకోకుండా.. తమతో పొత్తు కొనసాగించాలంటే కలసి పనిచేయాలని, బీజేపీ నేతలు తమకు షరతు విధించడంపై జనసేన నేతలు విరుచుకుపడుతున్నారు.

ఏదేమైనా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. వైసీపీ-బీజేపీ తెరచాటు బంధంపై, ప్రజల మనోగతాన్నే ఆవిష్కరించారని జనసైనికులు మెచ్చుకుంటున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సైతం.. బీజేపీ-వైసీపీ ఒకటేనని జనం భావిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యను తమ వాదనకు మద్దతుగా చూపిస్తున్నారు. అందువల్ల రాష్ట్ర బీజేపీ నేతలు.. ముందు సంస్థాగతంగా వరస ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుని, వైసీపీపై పార్టీ విధానం గురించి.. జాతీయ నాయకత్వం నుంచి స్పష్టత తీసుకుంటే మంచిదని, జనసైనికులు ఎద్దేవా చేస్తున్నారు.

LEAVE A RESPONSE