Suryaa.co.in

Features

కుల మార్పిడి చట్టం చేయడం ఎవరికైనా సాధ్యమా?

మిత్రులారా!  మరో రెండు సంవత్సరాల తర్వాత జరుగనున్న పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ సున్నితమైన మత సంబంధిత విషయాల పైన ఉద్వేగపూరిత చర్చలు ఇంకా ఇంకా పెరుగుతాయి. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పుట్టుకతో సంక్రమించే కులము – మతములతో రాజకీయ క్రీడలు సలిపే దుష్ట పాలకులు మనకి ఉన్నారు. మన అనుమతితో నిమిత్తం లేకుండా పుట్టుకతో మన మతాన్ని నిర్ణయించే పాలకులు, తమ స్వీయ అభిమతంతో పౌరులు మతo మార్చుకోవడానికి వీలు లేదంటున్నారు. అసలు మతo మార్పుకే అవకాశం లేకుండా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో ఈనాడు చట్టబద్ధంగా నిషేధానికి పూనుకుంటున్నారు.

దీని వెనుకనున్న అసలు సిసలు కారణాల్ని మాత్రం మరుగు పరుస్తూ ఉంటారు.
మనం అనుకునే హిందూమతంలోకి అన్యమతస్తులు ఎవరూరారు. కారణం వీరికి తెలిసినా చెప్పరు. అలా పొరపాటున ఎవరైనా మనo అనుకునే హిందూ మతంలోకి వస్తే వారికి ఏ కులం ఇస్తారు? అన్యులు ఎవరైనా తమ మతం మారి హిందూమతం అనుకునే దానిలోకి వస్తే, వారికి కులం గుర్తింపు ఎవరిస్తారు? మనం ఇచ్చే కులం వారు పుచ్చుకుంటారా? వారు కోరిన కులం ఇవ్వగలిగే వారెవరైనా ఉన్నారా? వారెవరైనా ఉన్నారా?

మతమార్పిడి సాధ్యం అవుతుందేమో కానీ కులం మార్పిడి ఎలా సాధ్యం? చట్టాన్ని ఏమార్చవచ్చునేమోగానీ ఆచరణలో కులానికి గుర్తింపునిచ్చేది పితృస్వామిక నిచ్చెనమెట్ల కుల సమాజమే కానీ వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, విశ్వాసాలు కాదు గదా!!

మతం మార్చుకున్న వారి కులం మారిన దాఖలాలు మనకు కానరావు. ఇది భారతీయమైన పితృస్వామిక కులవ్యవస్థ అనే నిచ్చెనమెట్లలో తప్ప వేరే వ్యక్తిగత సాంఘిక స్థితికి ఇసుమంత అవకాశం ఇవ్వలేని హిందూసమాజపు మౌలిక లక్షణం. అందుకే దీని నుండి వెలుపలకి పోవటం ఉంటుందే తప్ప లోనికి వచ్చే అవకాశం ఉండదు.

ప్రపంచంలో మరే మతానికి లేని ఏక కవాట లక్షణం దీనికి మాత్రమే ఉంది.దీని స్వభావాన్కి నేను పెట్టిన పేరు లీకింగ్ వాటర్ ట్యాంక్. కుల వ్యవస్థ సజీవంగా ఉన్నంతకాలం ఇది ఇలాగే ఉంటుంది.ఈ సంగతి బాగా తెలిసిన గాంధీ గారు హిందూ మతం ఎక్కడ బలహీనపడి పోతుందో అని మత మార్పిడిని పదే పదే ఖండించేవారు. ( పాపం! వీర హిందూత్వవాదుల చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు )
హిందూ మత వ్యవస్థలో భాగంగా ఉన్నట్లు గుర్తింపు ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్ల సౌకర్యం కల్పించటానికి ఒక కారణం, మత మార్పిడిని నిరోధించటం కూడా!! .

సుమారు 250 సంవత్సరాలుగా కొత్త కులాల పుట్టుక ఆగిపోయింది. ఆధునిక వృత్తులకు కులం పేరు ఉండదు. మనము ఈ రోజు మాట్లాడుకునే కులాలన్నీ పాతకాలపు భూస్వామ్య వ్యవస్థకు పుట్టినవి. కనుక చారిత్రకంగా కులవ్యవస్థకు కాలం చెల్లిపోయింది.

కానీ వాస్తవంలో అది సజీవమయిన శవంలా మన మధ్యనే బతికి ఉన్నది. దాని కంపునే ఇంపుగా ఆస్వాదిస్తున్న మహిమాన్విత సమాజంలో మనo జీవిస్తున్నాం. ఈ కంపులో జీవించలేకే కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణానంతరo చట్టం రంధ్రాన్వేషణలు చేసి అతని కులాన్ని నిర్ధారించింది, దళితుడు కాదు అని!

ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను తద్వారా మతాన్ని కాపాడుకోవడానికి మత మార్పిడిని నిరోధించాలని నేడు చట్టబద్ధంగా మరో ప్రయత్నo చేస్తున్నారు. దాన్ని ఉద్వేగపూరిత అంశంగా మార్చి ఎన్నికలలో ఓట్లు సీట్లు సంపాదించాలని కూడా చూస్తున్నారు. ఎంత ఆత్మవంచనా పూరిత ప్రజాస్వామ్యంలో మనం జీవిస్తున్నామో కదా !
దీన్ని చట్టబద్దంగా నిరంకుశ పాలనను రుద్దే ప్రజాస్వామ్యం అంటే తప్పేముంది?
మత మార్పిడిపై చర్చ ఈనాటిది కాదు.(పదమూడేళ్ల క్రితపుది)

మతము – మార్పిడి
విశ్వాసాలన్నీ మతం కాకపోయినా మతం మాత్రం ఒక విశ్వాసం! విశ్వాసాలకు కొంతైనా భావజాలం కావాలి. వాటికి ఎంతోకొంత ఊహ కావాలి. ఎన్నో ఆలోచనలు కావాలి. ఆలోచనలకు అవసరమైన భాష కావాలి. భాషనేది మహా మహా జ్ఞానసంపన్నులకు కూడా పుట్టుకతో రాదుగాక రాదు! అది జీవితంలో నేర్చుకునేది!!

మనిషి సృష్టించుకున్న భాష ద్వారానే మత విశ్వాసాలు పుట్టి పెరిగాయి కనుక మతాలన్నీ మానవుల సృష్టి మతాలావిర్భవించిన నాటికాలపు భాషలు చాలా మార్పులకు గురయినాయి. వయసురీత్యా అన్నిటిలోకీ చిన్నదయిన ఇస్లాం మూలపు అరబ్బీ తప్ప మిగతా భాషలేవీ సజీవంగా కూడా లేవు.

బాల్యంలో పిల్లలకు పెద్దల ఆసరా తప్పనిసరయినట్లు, మానవజాతి బాల్యదశలో అన్ని ప్రాంతాల సమాజాలకూ దేవుడు ఒక భావంగా అవసరమయ్యాడు. ఒక ఆలంబనయ్యాడు. మానసిక ఆసరా అయ్యాడు. మనిషి మారుతున్న కొద్దీ దైవభావంలో, దేవుని రూపంలో మార్పులొచ్చాయి. ఏన…ఇప్పటిదాకా ఎవరైనా తన కులాన్ని తానే నిర్ణయించుకుని, తానే పోషించుకుoటూ సమాజపు గుర్తింపుతో పనిలేకుండా బ్రతి కారేమో కానీ సమాజం తన పద్ధతిలోనే వారిని గుర్తిస్తుంది.
ఇది నిచ్చెనమెట్ల కులవ్యవస్థ కలిగిన సమాజం. నచ్చిన మెట్ల వ్యవస్థ కాదు!

ఒకప్పుడు కొందరు కమ్మవారు జంధ్యాలు వేసుకుని తామూ బ్రాహ్మలమే అని ప్రకటించుకున్నారట. హిందూ మతం అనుకునే నిచ్చిన మెట్ల వ్యవస్థ నుండి మతం మారిన క్రిస్టియన్లకు కులం లేకుండా పోయిందా?

ఫ్యూడల్ సంస్కృతిలో అగ్రవర్ణాలు మాత్రమే ఉండవు. శూద్ర బహుజన దళిత కులాలు కూడా ఉంటాయి. ఆ సంస్కృతి అనే దళసరి పొరల నుండి తరతమ స్థాయిలలో అందరూ బయట పడవలసే ఉంటుంది.

ఆ ఫ్యూడల్ సంస్కృతి పొర ఎక్కువ మందంగా ఎవరిపై ఉంటుంది? ఆర్థిక రాజకీయ రూపాలలో దళితులు తర్వాత బహుజనుల పైనా, సాంస్కృతిక రూపాలలో అగ్రవర్ణాలు అగ్రకులాలపైన ఉంటుందని స్థూలంగా అనుకోవచ్చు.

ఆ పొరను బద్దలు కొట్టుకుని బయట పడటం వ్యక్తులుగా సాధ్యపడే విషయం కాదు.
కుల మంటె సంఘము, సమూహ చిహ్నము
ఆస్థి వ్యక్తిగతము, అది వర్గ రూపము
సిరివచ్చి పోయినట్లు కులం రా, బోదయో
సత్యమెరుగ రండి శ్రమజీవులారా!

వర్గ పేద యొకడు ధనికుడవగలడు
వర్ణ పేదరికము వెనువెంటె పోబోదు
కుందేలు వర్గమూ! తాబేలు వర్ణము!!
సత్యమెరుగ రండి శ్రమజీవులారా!
(22 ఏళ్ల క్రితం నేను రాసుకున్న వర్గము – కులము పద్యాలలోవి)

మన సమాజం ఇంకా ఫ్యూడల్ కుల సంస్కృతిలోనే కొట్టుమిట్టాడుతోంది అంటే మనకు సామూహిక బూర్జువా సాంస్కృతిక చైతన్యం కూడా అలవడలేదు అని అర్థం! ఇంకొక రకంగా చెప్పాలంటే మనం బూర్జువా ప్రజాతంత్ర విప్లవ దశలోనే ఉన్నామని కూడా అర్థం!!
( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)

– దివికుమార్

LEAVE A RESPONSE