Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల కమిషన్‌కు జగన్ రెడ్డి అతీతుడా?

ఓటమి భయంతోనే జగన్ రెడ్డి కారుకూతలు
చంద్రబాబుపై వ్యక్తిగతంగా దూషిస్తూ నీచ రాజకీయాలకు జగన్ రెడ్డి తెరలేపాడు
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లో సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి బొత్స, అతని సతీమణి
సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన పనికి బలైన ఆర్టీసీ ఉద్యోగులు
ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఎన్నికల కమిషన్ వెంకట్రామిరెడ్డి ని ఎందుకు సస్పెండ్ చేయలేదు?
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
తెలుగుదేశం, చంద్రబాబులను అసభ్యకరంగా వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దూషిస్తున్నాడని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీకి తెదేపా నేతల ఫిర్యాదు

ముఖ్యమంత్రి హోదాలో ఉండి మా పార్టీ అధినేత చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని అసభ్యకరంగా వ్యక్తిగతంగా జగన్ మోహన్ రెడ్డి దూషిస్తున్నాడని ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేతలు ధ్వజమెత్తారు.

రాజకీయాల్లో జగన్ రెడ్డి పెద్ద నటుడని, తన నటనతో ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎద్దేవ చేశారు. అంతేకాకుండా వర్ల రామయ్య మాట్లాడుతూ….”జగన్ రెడ్డి పెద్ద నటుడుగా గుర్తింపు పొందాడు. బాబాయిని చంపిన రోజు నుంచి జగన్ రెడ్డిలోని నటనను చూస్తున్నాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి జగన్ రెడ్డి అతీతుడు కాదు. ఎన్నికల అధికారి వెంటనే వైఎస్ఆర్ కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై కేసు నమోదు చేసి చంద్రబాబు పై అసభ్య పదజాలం ఉపయోగించినందుకు చట్టరీత్య చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

“ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ అభ్యర్ధి కూడా ప్రభుత్వ భవనాలను ఉపయోగించడానికి వీలు లేదు. కానీ మంత్రి బొత్స సత్యనారాయణ, అతని సతీమణి ఝాన్సీ గారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని రుజువులతో సహా జత చేసి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. వెంటనే ఎన్నికల అధికారి ప్రభుత్వ గెస్ట హౌస్‌ను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించినందుకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి” అని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.

“మా పార్టీ అభ్యర్ధులపై రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి కేసులున్నాయో ఈ నెల 10 తేది లోపు తెలపండని డిజిపిని అనేక విధాలుగా కోరాం. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో చంద్రబాబుపై ఏమేమి కేసులు ఉన్నాయో తెలపండని 10 రోజుల క్రితమే అభ్యర్ధిస్తే 13 జిల్లాల నుండి మాత్రమే మాకు సమాచారం వచ్చింది. మరో 13 జిల్లాల నుండి మాకు వివరాలు ఇంకా అందలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఉన్న కేసులు వివరాలు తెలపడానికే ఇన్ని రోజులు పడితే ఇక మిగిలిన అభ్యర్ధుల పరిస్థతి ఏంటి? కాబట్టి ఈ విషయాన్ని కీలకంగా పరిగణలోకి తీసుకొని వెంటనే ఎన్నికల ప్రధాన అధికారి మా అభ్యర్ధుల కేసులు వివరాలు పోలీసు శాఖ నుంచి వచ్చే విధంగా డిజిపికి ఆదేశాలివ్వండని సీఈవోను కోరాం” అని తెలిపారు.

“పెన్షన్ వ్యవహారంలో జగన్ రెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై అవమానకరంగా పోస్టులు పెట్టిస్తున్నారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని కూడా సీఈవోను కోరాం” అని తెలియజేశారు.

“సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పై ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు చేశాం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఎన్నికల ప్రచారం చేయడం నేరం. బద్వేల్‌లో ఆయనతో పాటు వైకాపా తరఫున ఎన్నికల ప్రచారాలు చేసిన ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. మరీ వారితో పాటు ప్రచారం చేసిన సెక్రటేరియట్ ఉద్యోగి వెంకట్రామిరెడ్డి ని ఎందుకు సస్పెండ్ చేయలేదు. ప్రభుత్వ ఖజానా నుండి జీతం తీసుకుంటూ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి ని వెంటనే సస్పెండ్ చేయాలి” అని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు తెలిపారు.

“అయ్యా జగన్ రెడ్డి…! చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగునంగా మాతో ఫైట్ చేయండి. ప్రజాక్షేత్రంలో మీ పార్టీ మా పార్టీ పోరాటం చేద్దాం. ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారా..! లేక మమ్మల్ని ఎన్నుకుంటారో చూద్దాం. అంతేకానీ దొడ్డి దారుల్లో పోలీసులను అడ్డుపెట్టుకొని గెలవాలని చూడకండి” అని వర్ల రామయ్య హెచ్చరించారు.

జగన్ రెడ్డి కళ్ళలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఓటమి భయంతోనే పిచ్చెక్కినట్లు జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….”ఓటమి భయంతో జగన్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి ఎన్ని సినిమా యాక్టింగ్‌లు చేసినా ఓటమి భయం మాత్రం అతని కళ్ళల్లో కనబడుతోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వలన ఆర్టీసీ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు.

అయినా కూడా సర్విస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వెంకట్రామిరెడ్డి పాల్గొంటున్నాడని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. ఎన్నికల కమిషన్‌కు ఎవరూ అతీతులు కారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోండని సీఈవోను కోరాం” అని ఉమా తెలిపారు.

 

LEAVE A RESPONSE