Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్ల ద్వారానే రూ.4వేల పెన్షన్ ఇళ్లవద్దకు ఇస్తాం!

అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే పెన్షన్ పెంచి అందజేస్తాం
రాజకీయ లబ్ధికోసం కుల,మతాల పేరుతో జగన్ చిచ్చు
మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో నారా లోకేష్

మంగళగిరి: వాలంటీర్లను వైసిపి రాజకీయంగా ఉపయోగించడం వల్లే వారిపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వందరోజుల్లో వాలంటీర్ల ద్వారానే 4వేల రూపాయల పెన్షన్ తోపాటు ఇతర సంక్షేమ పథకాలు అందజేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… పెన్షన్ల విషయంలో జగన్ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. దేశంలో తొలిసారి పెన్షన్ ప్రవేశపెట్టింది అన్న ఎన్టీఆర్. 200 రూపాయల పెన్షన్ ను 2వేలు పెంచింది చంద్రబాబునాయుడు. ఎన్నికల తర్వాత 4వేలు ఇచ్చేది కూడా చంద్రబాబేనని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ కుల,మతాల పేరుతో చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. 2014-19 మధ్య ఏనాడు ముస్లిం మైనారిటీలపై దాడులు జరగలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక నంద్యాలలో అబ్దుల్ సలామ్, పలమనేరులో మిస్బా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు, నర్సరావుపేటలో మసీదు ఆస్తుల పరిరక్షణకు పోరాడిన ఇబ్రహీంను నరికి చంపారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా, దుల్హాన్, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనాలు అందించాం. మైనారిటీల క్షేమాన్ని కాంక్షించేది ఎవరో ముస్లిం సోదరులు గుర్తించాలి. రాబోయే ఎన్నికల్ల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం.

దళితులపై కూడా జగన్ ప్రభుత్వం కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన 27సంక్షేమ పథకాలను రద్దుచేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యంను జగన్ పక్కన కూర్చొబెట్టి సమీక్షలు చేస్తున్నారు. జగన్ కపటప్రేమను దళితులు, మైనారిటీలు గమనించాలని లోకేష్ విజ్ఞప్తిచేశారు.

LEAVE A RESPONSE