– తనహయాంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకోసం ముఖ్యమంత్రి ఒక్క కొత్త పథకాన్నైనా తీసుకొచ్చాడా? – గతంలోఉన్న 26 పథకాలను రద్దుచేసి, దళిత, గిరిజనుల్ని అణచివేస్తున్నాడు.
• దళితమంత్రులంతా జగన్ రెడ్డికి చిడతలు వాయించడం తప్ప, మూడున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఏంచేశాడని ఏనాడైనా ఆయన్ని నిలదీశారా?
• నోరేసుకొని అడ్డగోలుగా పిచ్చిపిచ్చిగా మాట్లాడే దళితమంత్రులు, జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దళితులకోసం ఏంపథకాలు అమలుచేస్తుందో చెప్పగలరా?
• పిల్లలు పుట్టడానికి, ప్రభుత్వపాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గడానికి సంబంధం ఉందా? : ఏ.ఎస్.
• విచారణ జరిపితే దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా ‘నాడు-నేడు’ నిలుస్తుంది.
• ఉపాధ్యాయులకు 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన చంద్రబాబు గొప్పా…23 శాతం ఇచ్చిన జగన్ రెడ్డి గొప్పా? : రామకృష్ణ
టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీఎమ్మెల్సీ ఏ.ఎస్. రామకృష్ణ
దళిత, గిరిజన విద్యార్థులు ఉన్నతవిద్యార్జన చేయడంకోసం గతంలో టీడీపీప్రభుత్వం ఏర్పాటుచేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని రద్దుచేస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనెం-19ని హైకోర్టు రద్దుచేయడాన్ని స్వాగతిస్తున్నామని, దళితులఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, వారితలలపై ఎక్కి వారినే పాతాళంలోకి తొక్కేస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు స్పష్టంచేశారు.మంగళవారం ఆయన మాజీఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ తో కలిసి మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు వారి మాటల్లోనే ..“ కార్పొరేట్ విద్య అనేది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందనిద్రాక్షలా ఉండేదని, దాన్ని వారికి చేరువ చేయడంకోసమే గతంలో తమప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తో పాటు, అంబేద్కర్ విదేశీవిద్యాదీవెన వంటి అనేకపథకాలు అమలుచేసింది. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ వారినెత్తిమీదఎక్కి తొక్కుతున్నాడు. జగన్ ప్రభుత్వంలో ఎక్కువగా దగాపడినవారు దళితులే. దళిత గిరిజనులకు రాజ్యాంగంద్వారా సంక్రమించిన హక్కులు, అధికారాల్ని జగన్ రెడ్డి కాలరాస్తు న్నాడు. పదో తరగతి అయ్యాక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విద్యాభ్యాసంతో కూడిన ఇతరత్రా సౌకర్యాలు ఉచితంగా లభించేవి.
నేరుగా కేంద్రప్రభుత్వం నుంచే స్కాలర్ షిప్ లు, మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ఇతరత్రా ఛార్జీలు దళితవిద్యార్థులకు అందేవి. పథకాలపేరుతో అవన్నీ రద్దుచేసిన జగన్ రెడ్డి, దళిత, గిరిజన విద్యార్థులహక్కులు హరించడం ఎంతవరకు సబతో ఆయనకేబినెట్ లోని దళితమంత్రులు సమాధానం చెప్పాలి. ఎప్పటినుంచో ఉన్న దళిత విద్యార్థులకు అందుతున్న ఫీజు రీయింబర్స్ మెంట్ సాయానికి కోతపెట్టి, ఉద్దేశపూర్వ కంగానే వారిపై కక్షతో వ్యవహరిస్తున్నాడు.
తనపాలనలో ప్రత్యేకంగా దళితులకేం చేశాడో ముఖ్యమంత్రి చెప్పగలడా?
జగన్ రెడ్డి అమ్మఒడి, ఆసరాపథకాలు అందరితో పాటే దళితులకు అమలుచేస్తున్నాడు తప్ప, ప్రత్యేకంగా తనమూడున్నరేళ్లపాలనలో వారికేంచేశాడో చెప్పాలి. దళితులు, ఆయావర్గాల విద్యార్థులకు అదనంగా ముఖ్యమంత్రిచేస్తున్న సాయం శూన్యం. గతంలో కుటుంబంలో ఎందరు విద్యార్థులుంటే అందరికీ ప్రభుత్వసాయం అందేది. ఇప్పుడేమో అమ్మఒడి కింద ఇచ్చేఅరకొర సాయం కుటుంబం లో ఒక్కరికే వస్తోంది. ప్రభుత్వంలోని దళితమంత్రులు ముఖ్యమంత్రిని పొగుడుతూ చిడతలు వాయిస్తున్నారు తప్ప, తమవర్గాలకుజరిగే అన్యాయంపై స్పందించరు. దళితులకు జగన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక్కపథకాన్నైనా అమలుచేస్తున్నాడని మంత్రులు చెప్పగలరా?
మా దళిత వర్గాలకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని ఏనాడైనా కేబినెట్ లో ఉన్న ఏ దళితమంత్రైనా ముఖ్యమంత్రితో చర్చించాడా? అమల్లోలేని అంబేద్కర్ విదేశీవిద్యాదీవెన పథకానికి తనపేరు పెట్టుకున్నాడు. విద్యారంగానికి సంబంధించి జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, మరీ ముఖ్యంగా పాఠశాలల మూసివేత, ఫీజురీయింబర్స్ మెంట్ రద్దుతో ఎక్కువగా నష్టపోయింది దళితులే. జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకోసం కొత్తగా ఎక్కడైనా ఒక్క విద్యాలయం నిర్మించిందా? ఆఖరికి సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ కు సన్నద్ధమయ్యే దళిత విద్యార్థులకు గతప్రభుత్వంనుంచి అందుతున్న ఆర్థికసాయాన్ని కూడా జగన్ రెడ్డి తొలగించాడు.
విదేశీవిద్యాదీవెన పథకానికి అంబేద్కర్ పేరుతీసేసి, తనపేరు పెట్టుకోవడానికి నిజంగా జగన్ కు అసలు సిగ్గుందా? వసతిదీవెన, విద్యాదీవెన అని పేర్లుమార్చి దళితవిద్యార్థుల్ని మోసగిస్తున్నాడు. అంబేద్కర్ స్టడీసర్కిళ్లను మూసేశాడు. దళితులు, గిరిజనులకు సంబంధించి గతప్రభుత్వంలో అమలైన 26పథకాలను నిర్దాక్షణ్యంగా తొలగించిన వ్యక్తిగా, దళితులద్రోహిగా జగన్ రెడ్డి నిలిచిపోతాడు. మెస్ బిల్లులు, హాస్టల్ ఫీజు, కళాశాలఫీజుతో పాటు ఆఖరికి కటింగ్ ఛార్జీలు కూడా జగన్ రెడ్డి నిలిపేశాడు. 2022-23 విద్యాసంవత్సరంలో 3.5లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లారన్న నివేదికలపై ముఖ్యమంత్రి ఏం చెబుతారు? నాణ్యమైన విద్య ప్రభుత్వపాఠశాలల్లో లభిస్తే, ఎక్కువఖర్చుతోకూడిన ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు వెళతారు?
అధికారంలోకి రాకముందు జగన్ రెడ్డి కే.జీ.నుంచి పీ.జీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఇప్పుడేమో ఎయిడెడ్ కళాశాలల్లో పీ.జీ.చదివే వారికి స్కాలర్ షిప్ లు రద్దుచేశాడు. స్కాలర్ షిప్ లపై ఆధారపడి విద్యాభ్యాసంచేసేది ఎక్కువగా దళితులు, గిరిజనులే. దళితవిద్యార్థులు సొంతఖర్చుతో పీ.జీ. చదివే స్థాయిలో ఉన్నారా? అంత అవకాశం వారికి ఉందా అనే ఆలోచన కూడా జగన్ రెడ్డి చేయకపోవడం సిగ్గుచేటు. మెస్ బిల్లురుసుం 6ఏళ్లక్రితం ఎంతుందో ఇప్పుడు అదే ఇస్తున్నారు. తాను లేవనెత్తిన అంశాలపై సమాధానంచెప్పే ధైర్యం దళితమంత్రులకు ఉందా? భయంతో, పదవులకోసం ఎన్నాళ్లు బిక్కుబిక్కుమంటూ బతుకుతారని వారిని ప్రశ్నిస్తున్నాం. దళిత సోదరులు, దళితసంఘాలు జగన్ రెడ్డిచేస్తున్న అన్యాయంపై ఎందుకు నోరెత్తడంలేదు.
జీవోనెం-19 తీసుకొచ్చి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దుచేసిన జగన్ రెడ్డిని, ఆయనప్రభుత్వాన్ని హైకోర్టు చీవాట్లు పెట్టడమే గాకుండా, ఆజీవోని కూడా కొట్టేసింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దళిత, గిరిజన విద్యార్థులకోసం ఆలోచిస్తే మంచిది. తప్పుడు నిర్ణయాలు, అసమర్థ పాలనతో నిత్యం న్యాయస్థానాలతో చీవాట్లు తింటున్నా, జగన్ రెడ్డిలో, ఆయనప్రభుత్వంలో మార్పురావడంలేదు. దళిత, గిరిజనులకు అన్యాయంచేస్తున్న జగన్ రెడ్డికి రోజులు దగ్గరపడ్డాయని, ఆయావర్గాలు త్వరలోనే ఆయనపై తిరగబడటం ఖాయం” అని ఆనందబాబు హెచ్చరించారు.
నాడు-నేడు పై విచారణ జరిపిస్తే దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా నిలుస్తుంది : ఏ.ఎస్ రామకృష్ణ
“జగన్ రెడ్డి ఆయనప్రభుత్వం విద్యావ్యవస్థపై, ఉపాధ్యాయులపైపగబట్టింది. అమరావతిని, పోలవరాన్ని నాశనంచేద్దాం… రైతుల పాదయాత్రను అడ్డుకుందామనే పిచ్చిపిచ్చి ఆలోచనలు తప్ప, రాష్ట్రబాగు, ప్రజలక్షేమం ప్రభుత్వానికి పట్టడంలేదు. టీడీపీ హాయాంలో బడికి రావడానికి విద్యార్థులకు ఎలాంటి నిబంధనలు లేవు. జగన్ పాలనలో బడిముఖం చూడని విద్యార్థులలెక్క ప్రభుత్వం వద్దఉందా? అధికారులు పైకి చెప్పే లెక్కలుకాదు, దాదాపు 5లక్షల పైచిలుకు డ్రాపౌట్స్ ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ రెడ్డి విద్యార్థులకు సంబంధించి కొత్తకొత్తపేర్లు పెట్టి, చివరికి ‘జగనన్న విద్యాదీనం’ పథకాన్ని అమలుచేస్తున్నాడు. మూడున్నరేళ్లలో విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడు.
పాఠశాలవిద్యశాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ పొంతనలేని ప్రకటనలిస్తున్నారు. పిల్లల పుట్టుకకు ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులహాజరుకి ఏంసంబంధమో ఆయనే చెప్పాలి. జనవరి 31, 2022న విడుదలైన ప్రభుత్వగెజిట్ లో ప్రపంచబ్యాంకు షరతులకు లోబడే విద్యావ్యవస్థలో మార్పులన్నారు.
మంత్రి బొత్ససత్యనారాయణ, ప్రభుత్వాధికారులు విద్యార్థులు పోలోమంటూ ప్రభుత్వపాఠశాలలకు వస్తున్నారని నిన్నటివరకు జబ్బలు చరిచారు. గతంలో ప్రైవేట్ పాఠశాలలనుంచి ప్రభుత్వపాఠశాలలకు వస్తే, ఇప్పుడు పరిస్థితి రివర్స్. అమ్మఒడి పథకాన్ని 43లక్షలమంది విద్యార్థులకు ఇస్తున్నామని, ప్రతిబిడ్డకు ఇస్తున్నారని గతంలో జగన్ సతీమణి భారతి చెప్పారు. ప్రభుత్వలెక్కలేమో కేవలం 13లక్షలమందికి మాత్రమే అంటున్నాయి. విద్యార్థుల సంఖ్యలో ఇంతవ్యత్యాసం ఎలావచ్చింది?
విద్యార్థులతో, వారిచదువులతో వ్యాపారం చేసే స్థితికి ప్రభుత్వం దిగజారింది
ప్రభుత్వమిచ్చిన బ్యాగ్, యూనిఫామ్ వారానికే చిరిగిపోయాయి…అదో పెద్దస్కామ్. విచారణ జరిపితే దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా నాడు-నేడు నిలుస్తుంది. భవననిర్మాణంలో వాడేవస్తువుల సరఫరాను తాడేపల్లి ఆదేశాలప్రకారం నచ్చినవారికి అప్పగించారు. ప్రధానోపాధ్యాయులు గోడలకు నీళ్లుకొట్టి, నేలపై బండలు వేయాలా..ఏమిటీ దుస్థితి? జగన్ నిర్వాకంతో కరోనావేళ 54మంది ప్రధానోపాధ్యాయులు, 1200మంది టీచర్లు చనిపోయారు. పీఆర్సీ ఉద్యమంచేశారన్న అక్కసుతో ఉపాధ్యాయుల్ని మానసికంగా వేధిస్తున్నారు. ఉపాధ్యాయులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు నూటికినూరుశాతం నిజం.
హరీశ్ రావువ్యాఖ్యలకు సమాధానంచెప్పలేకే బొత్స అసలు ఆయన ‘ఆమాటఅన్నాడా’ అంటూ దీర్ఘం తీశాడు. హరీశ్ రావు కాకుండా, టీడీపీ వారు అంటే ఒంటికాలిపై లేచేవారు. ఉపాధ్యాయుల ఫిట్ మెంట్ లో 43.23శాతంలో గతంలోనే 43శాతం చంద్రబాబు ఇచ్చారు. జగన్ రెడ్డి ఇచ్చింది కేవలం 23శాతమే. చంద్రబాబుగారు గతంలో ఇచ్చినదానిలో జగన్ రెడ్డి సగంకూడాఇవ్వలేదు. ఇవేవీ మంత్రులకు, విద్యాశాఖాధికారులకుతెలియదా? రాష్ట్ర విద్యాశాఖ నిద్రపోతోంది అనడంలో ఎలాంటి సందేహంలేదు. మూడున్నరేళ్లలో ఒక్క ఉపాధ్యాయుడిని నియమించారా? మెగాడీఎస్సీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటేనే దడుస్తున్నారు.
బైజూస్ అనే ట్యూషన్ సంస్థతో ఒప్పందం చేసుకోవడానికి జగన్ రెడ్డి దావోస్ వరకు వెళ్లాలా? ల్యాప్ ట్యాప్ ల పంపిణీలో వాటాలు లేకుండానే ఒప్పందాలు జరిగాయా? రాష్ట్రంలోని 2లక్షలమంది నిష్ణాతులైన ఉపాధ్యాయులకి ఇవ్వాల్సింది ఇస్తే, వారు బైజూస్ కంటే మిన్నగా పాఠాలు చెప్పరా? ఏపీ విద్యావ్యవస్థ అంతా గజిబిజీ, గందరగోళంగా తయారైంది. విద్యారంగానికి ప్రభుత్వం వేలకోట్లు ఖర్చుపెడితే ప్రభుత్వపాఠశాలల్లో డ్రాపౌట్స్ ఎందుకు పెరుగుతున్నాయో ముఖ్యమంత్రి చెప్పాలి. మంత్రులు, ముఖ్యమంత్రికి విద్యగొప్పతనమే తెలియదు. విద్యారంగాన్ని నిర్లక్ష్యంచేసి, ఉపాధ్యాయుల్ని వేధింపులకు గురిచేస్తే, అంతిమంగా నష్టపోయేది పేదప్రజలు, వారిపిల్లలే. ముఖాముఖి విద్యాబోధనకు, ఆన్ లైన్ క్లాసులకు చాలా వ్యత్యాసం ఉంది.
జీవోనెం 117తీసుకొచ్చిన జగన్ రెడ్డి విద్యావ్యవస్థను సర్వనాశనంచేయడమే కాక, ఉపాధ్యాయులపై పనిభారం పెంచాడు. ఆఖరికి ప్రైవేట్ పాఠశాలలకు పుస్తకాలు కూడా తామే సరఫరా చేస్తామనే దుస్థితికి ప్రభుత్వం వచ్చింది” అని రామకృష్ణ వాపోయారు.