– వెంటరాని సొంత కమ్మ వర్గం
– బాధితులంతా ఏకమవుతున్న వైనం
– కమ్మ వర్గం మద్దతు కన్నాకే
– కన్నాను కలసి కమ్మ వర్గీయుల సంఘీభావం
– రుద్రవరం ఘటనతో పాత రచ్చ మళ్లీ తెరపైకి
– వైసీపీ మీడియాలో నాటి కథనాలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షం
– ఇప్పుడు అదే వైసీపీ మీడియా శివరామ్‌కు మద్దతుపై తమ్ముళ్ల అనుమానాలు
– రుద్రవరం బాధితులపై ఓ పోలీసుల అధికారి బెదిరింపు?
– కోడెల విగ్రహం వద్ద ధర్నా చేస్తే అరెస్టు చేస్తామని శివరాం బాధితులకు హెచ్చరిక
– శివరాం ర్యాలీకి పోలీసుల పరోక్ష సహకారం?
– రుద్రవరం ర్యాలీలో నర్సరావుపేట నుంచి జనం తరలింపు?
– కోడెల ఘాట్ ఏర్పాటుచేద్దామని చంద్రబాబు కోరినా కుటుంబ సభ్యులు స్థలం లేదన్నారా?
– రైల్వే కాంట్రాక్టు బాధితులలో టీడీపీ నేతలే బాధితులు
– మరోసారి ముందుకురానున్న శివరాం బాధితులు
– అందరితో కలసి త్వరలో బాధితుల సభ?
– ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్ తీసుకున్న శివరాం
– శివరామ్‌కు వైసీపీ సర్కారు పరోక్ష సహకారం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘నేను తండ్రి లేని కొడుకును. నా పిల్లలు తాత లేని వాళ్లు. నాకు మీరే దిక్కు’’.. ఇలాంటి సెంటిమెంట్ డైలాగులతో రాజకీయ కథ రక్తికట్టిస్తున్న, దివంగత నేత కోడెల శివప్రసాదరావు తనయుడు, శివరాం పొలిటికల్ సెంటిమెంట్ కథ కంచికి చేరుతుందా? ప్రజల్లో దివంగత కోడెల సానుభూతి కుటుంబానికి లేదా? గుంటూరు జిల్లాలో వివిధ పోలీసుస్టేషన్లలో, ఆయనపై కేసులు పెట్టిన బాధితులంతా త్వరలో ఒకే వేదిక మీదకు రానున్నారా? వీటికి మించి.. సొంత కమ్మ వర్గం సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా నియమించిన, కన్నా లక్ష్మీనారాయణకు బాసటగా నిలిచారా? రైల్వే ప్రాజెక్టు పనుల్లో టీడీపీ వికలాంగనేత కూడా బాధితుడేనా? పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించినా, ఆ వికలాంగ నేత దగ్గర తీసుకున్న డబ్బు ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదా? బాబు ఆగ్రహానికి అది కూడా ప్రధాన కారణమా? శివరామ్‌కు కమ్మవర్గం పూర్తి స్థాయిలో దూరమయిందా? రుద్రవరంలో కోడెల విగ్రహావిష్కరణను అడ్డుకున్న శివరాం బాధితులపై, ఓ పోలీసు అధికారి బెదిరింపులకు పాల్పడ్డారా? శివరాం ర్యాలీకి, అధికార పార్టీ పరోక్షంగా సహకరించిందా? అంటే.. సత్తెనపల్లి తెలుగు తమ్ముళ్లు అవుననే సమాధానం ఇస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా అడుగులేస్తున్న కోడెల శివరాం.. వేదికలపై వినిపిస్తున్న సెంటిమెంటు కథలు, పెద్దగా వర్కవుటయ్యేలా కనిపించటం లేదు. అసలు పులిలా బతికిన కోడెల శివప్రసాదరావు, ఎవరి వల్ల ఆత్మహత్య చేసుకున్నారో స్పష్టంగా తెలిసిన సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాలతో పాటు, గుంటూరు జిల్లా ప్రజలు.. శివరాం తిరుగుబాటుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పైగా ఆయన తిరుగుబాకు వెనుక ఎవరున్నారన్న దిశగా చర్చిస్తుండటం గమనార్హం.
వీటన్నింటికి మించి.. సొంత కమ్మ సామాజికవర్గమంతా, కన్నా లక్ష్మీనారాయణతో కలసి ఉండటం.. శివరామ్‌ను ఒంటరిని చేసినట్టయింది. సత్తెనపల్లి రూరల్ మండలంలోని కమ్మ సామాజికవర్గమంతా, ఏకతాటిపై నిలిచి కన్నాకు మద్దతు ప్రకటించడమే దానికి కారణం. తాము ఎట్టి పరిస్థితిలోనూ శివరామ్‌కు మద్దతునివ్వమని, చంద్రబాబు ఆదేశాలను పాటిస్తామని కన్నాను కలసి హామీ ఇవ్వడంతో, శివరాం పోరాటానికి కమ్మవర్గం దూరమైనట్లయింది.
తనకు వారసత్వ రాజకీయాలు ఇష్టం లేదని, తన కుటుంబసభ్యులెవరూ రాజకీయాల్లోకి రారని.. డాక్టర్ కోడెల జీవించినప్పుడు మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన అభిమానులు,
ప్రధానంగా కమ్మ సామాజికవర్గం గుర్తు చేస్తోంది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కోడెల సత్తెనపల్లి ఎమ్మెల్యేగా రాకముందు వరకూ ఆయనకు ఉన్న ఇమేజ్‌ను, తర్వాత కుటుంబసభ్యులే డామేజీ చేశారన్న వ్యాఖ్యలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. చివరకు సొంత కులం, సొంత పార్టీ నేతలనూ విడిచిపెట్టని విషయాన్ని.. ఇప్పుడు పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఉద్యోగాలు, కాంట్రాక్టులు, బదిలీల పేరుతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చి, సర్దుబాటు చేసేందుకు, డాక్టర్ కోడెల వద్ద చివరిరోజుల్లో 5 కోట్లు లేని దుస్థితి ఏర్పడిందని ఆయన సన్నిహితుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆ డబ్బు ఆయనకు సర్దుబాటు చేస్తే, అందరినీ పిలిచి ఎంతో కొంత సర్దుబాటు చేయాలన్నది కోడెల ఆలోచన. అదే జరిగితే ఆయన జీవించేవార’ ని టీడీపీ సీనియర్లు స్పష్టం చేశారు. ఆ డబ్బు ఉంటే అందరికీ సర్దుబాటు చేసేవారని, కానీ అది కూడా ఇవ్వకుండా ఆయనను మానసిక క్షోభకు గురిచేశారంటున్నారు.
సత్తెనపల్లిలో రైల్వే ట్రాక్ కాంట్రాక్టు తీసుకున్న తెలంగాణకు చెందిన ఓ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతోపాటు, టీడీపీ ప్రభుత్వంలో వికలాంగ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన మరో నేత నుంచి, వసూలు చేసిన డబ్బుల పంచాయతీ ప్రధాని కార్యాలయానికి చేరింది.
అది చివరకు చంద్రబాబు వద్దకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సదరు వికలాంగ సంస్థ మాజీ చైర్మన్‌కు , ఇప్పటివరకూ డబ్బులు ఇవ్వలేదంటున్నారు. ఆ ఆగ్రహంతోనే సదరు వికలాంగ నేత నకరికల్లు కార్యక్రమంలో, కోడెల వెళితే కర్ర అడ్డం పెట్టిన విషయాన్ని టీడీ పీ లోని కమ్మ వర్గ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఇక నర్సరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించిన ఒక కాంట్రాక్టరును కూడా, బిల్లుల విషయంలో వేధించారన్న ఆరోపణలు లేకపోలేదు. డాక్టర్ కోడెల జీవించిన సమయంలో కాంగ్రెస్ నుంచి వచ్చి, ఆర్ధికంగా అండగా నిలిచిన సీనియర్ నేత రాజా కాశిని కూడా.. ఆర్ధికంగా దెబ్బతీశారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. నర్సరావుపేట, సత్తెనపల్లితో పాటు గుంటూరు జిల్లాలో ఇలాంటివి ఇప్పటికీ కథలు కథలుగా వినిపిస్తూనే ఉండటం విశేషం.
‘అసలు శివరాంకు మా కులంలో గానీ, ప్రజల్లో గానీ బలం, సానుభూతి ఉంటే పార్టీ ఆయనను ఎందుకు వదులుకుంటుంది? అసలు వ్యతిరేకత అంతా ఆయనపైనే. అలాంటప్పుడు అతనికి ఇన్చార్జి ఎలా ఇస్తుంది? డాక్టరు గారు సత్తెనపల్లికి రాకముందు, వచ్చిన తర్వాత ఎలా మారిపోయారు? దానికి కారణం ఎవరన్నది అందరికీ తెలుసు. డాక్టరు గారు బతికున్నప్పుడు వైసీపీ మీడియాలో ఎంత చండాలంగా వార్తలు వచ్చాయో మీకు తెలియదా? ప్రతి దానికీ ఖరీదు కట్టారు కదా? చివరకు అసెంబ్లీ ఫర్నీచర్ కూడా ఎత్తుకెళ్లి డాక్టర్ గారి పరువు తీశారు కదా? పార్టీని బెదిరించి లబ్థి పొందాలంటే కుదరదు. లోకేష్ ఇలాంటివి అసలు సహించరు. చంద్రబాబులా ఆ అబ్బాయి మెతకకాదు’ అని కమ్మ వర్గానికి చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడు కోడెల కుటుంబంపై రెండు నియోజకవర్గాల్లో కనీస సానుభూతి లేదని సొంత సామాజికవర్గ నేతలే స్పష్టం చేస్తున్నారు.
‘ డాక్టరు గారు బతికున్నప్పుడు వైసీపీ మీడియాలో ఎన్ని వ్యతిరేక వార్తలు వచ్చాయి? ఆ అవమానం భరించలేకనే కదా డాక్టర్ గారు బయటకూ రాలేకపోయారు? ఇప్పుడు అదే మీడియాలో శివరాంకు అనుకూలంగా కథనాలు వస్తున్నాయంటే, ఏం జరుగుతుందో తెలియని అమాయకులమా? ఎవరి ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తున్నారో మాకు తెలియదా? గతంలో జగన్‌ను విమర్శించిన శివరాం, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధం చేసుకోలేనంత అమాయకులు కాదు’ అని సత్తెనపల్లికి చెందిన ఓ టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
కాగా.. కోడెల జీవించిన సమయంలో, ఆయన కుటుంబసభ్యులపై వ్యతిరేక వార్తలు రాసిన వైసీపీ మీడియాలో వచ్చిన కథనాలు.. మళ్లీ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండటం, శివరాంకు ఇరకాటంగా పరిణమించింది. అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం, సొంత భవనాన్ని ఎక్కువ రేటుతో ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వడం, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, వైన్‌షాపులు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశారంటూ.. వైసీపీ మీడియాలో వచ్చిన కథనాలన్నీ ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీనితో శివరాంకు మద్దతునిచ్చేందుకు, పార్టీ నేతలెవరూ ముందుకురావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
‘డాక్టరు గారికి పార్టీ వల్ల పేరొచ్చింది గానీ, ఆయన వల్ల పార్టీకి పేరు రాలేదని గుర్తుంచుకోవాలి. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం’ అని మరో కీలక నేత స్పష్టం చేశారు. జిల్లాలో పెద్ద రత్తయ్య, పుష్పరాజ్, ఉమ్మారెడ్డి, యలమందరావు లాంటి సీనియర్లను కూడా కాదని, కోడెల శివప్రసాద్‌ను ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లక్ష్మీపార్వతి అడ్డుకున్నా, చంద్రబాబు నాయుడు అప్పట్లో శివప్రసాదరావు కోసం పోరాడారని గుర్తు చేస్తున్నారు.
నిజంగా డాక్టర్ గారి వారసులకు ఆయనపై అంత ప్రేమ ఉంటే, ఆయన పేరిట ఇప్పటిదాకా స్మృతివనం ఎందుకు ఏర్పాటుచేయలేదన్న ప్రశ్నలు, దివంగత కోడెల అభిమానుల్లో వినిపిస్తున్నాయి. ఆయన చనిపోయిన తర్వాత నర్సరావుపేటలో జరిగిన కార్యక్రమాలకు డాక్టర్ అరవిందబాబు సహా, కోడెల అభిమానులు చందాలు వేసుకుని.. కార్యకర్తలకు భోజనాలు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. నర్సరావుపేటలో ఆస్తులు కాపాడుకునేందుకు ఎవరితో కలసి వ్యాపారాలు చేస్తున్నారో కూడా అందరికీ తెలుసునంటున్నారు.
కాగా.. కోడెల శివరాంపై గతంలో పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసిన బాధితులంతా, త్వరలో ఒకే వేదికపై రానున్నట్లు తెలుస్తోంది. గుంటూరు లేదా సత్తెనపల్లిలో వారంతా, ఒక సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తమ కేసులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తొలుత కోడెల కుటుంబంపై కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ కుటుంబానికే మద్దతునిస్తోందని చెబుతున్నారు.
సత్తెనపల్లిలో శివరామ్ టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించే కార్యక్రమాలకు మద్దతునివ్వడం ద్వారా, ఓట్లు చీల్చాలన్న వైసీపీ ఎత్తుగడను ప్రజలు ఇప్పటికే అర్ధం చేసుకున్నారని దివంగత కోడెల అభిమానులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే దివంగత కోడెల లక్ష్యమైనప్పుడు, అందుకు భిన్నంగా వ్యవహరించే ఆయన వారసుల వెంట తాము ఎందుకు నడుస్తామని కోడెల సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు.
రుద్రవరంలో ఒక వృద్ధ దంపతుల కుటుంబం.. తమ నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తే తప్ప, విగ్రహం ఆవిష్కరించబోమని ధర్నా చేయడం బట్టి.. అధికారంలో ఉన్నప్పటి అరాచాలను ఊహించుకోవడం, పెద్ద కష్టం కాదని కమ్మ వర్గ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
శివరామ్‌ను పిలిచి మాట్లాడితే సమస్య సర్దుకుంటుందన్న అభిప్రాయం, మరొక వర్గంలో వ్యక్తమవుతోంది. అయితే అలాంటివి ప్రోత్సహిస్తే, రాష్ట్రంలో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయని, వారందరినీ నాయకత్వం బతిమిలాడాల్సి వస్తుందని మరో వర్గం వాదిస్తోంది. పార్టీకి నష్టం కలిగించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నప్పుడు.. ఆయనను పిలిచి మాట్లాడినా వృధా అన్న అభిప్రాయం, పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి, పార్టీని ఓడి ంచాలన్న ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవని టీడీపీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. సొంత కమ్మవర్గమే పార్టీ ఇన్చార్జిగా ప్రకటించిన కన్నాకు మద్దతునిస్తుంటే, ఇక శివరామ్‌కు దన్నుగా నిలిచేదెవరని ప్రశ్నిస్తున్నారు. పార్టీని బెదిరించే వ్యూహాలను లోకేష్ సహించరంటున్నారు.
ఇప్పటికీ ఈ ఎపిసోడ్ వెనుక.. గుంటూరు నగరం, గుంటూరు రోడ్‌లోని ఒక ఆసుపత్రికి చెందిన భార్యభర్తలు పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వారి సాయంతోనే ఒక ప్రభుత్వ సలహాదారు, ఇందులో చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం బహిరంగ రహస్యమేనని తమ్ముళ్లు స్పష్టం చేస్తున్నారు.