ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించండి

-ఉప ఎన్నికల్లో నెగ్గకపోతే వచ్చే నష్టమేమీ లేదు… మా ఓటర్లు వేరనని చెప్పడానికి సజ్జల ఉండనే ఉన్నారు
-టీడీపీ నాయకత్వం ఆహ్వానిస్తే ఆ పార్టీలో చేరడానికి మా పార్టీ ఎమ్మెల్యేలు ఎంతోమంది సిద్ధం…
-వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు, డాక్టర్ సునీత సాధించిన విజయమే
-అయినా తప్పుడు కథనాలు రాసి న సాక్షి దినపత్రిక అక్కసు
-ఓపీ ఎస్ ఇస్తామని ప్రతిపక్షాలు అంటే… జిపిఎస్ యే కావాలనే టనెంత పొగిడిన కొంతమంది ఉద్యోగ సంఘాలు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించండి . టిడిపి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, పార్టీ నాయకత్వంతో విభేదించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తనకు ప్రాణమిచ్చే శాసనసభాపతి ద్వారా అనర్హత వేటు వేయించి , ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధపడాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జెడ్పి చైర్మన్ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. గతంలో జరిగిన జెడ్పిటిసి ఎన్నికలను టిడిపి బహిష్కరించింది. ఒకటి అరస్థానాలలో మాత్రమే ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో ఖాళీ అయినా జడ్పీ చైర్మన్ స్థానానికి మా పార్టీ నాయకత్వం మహిళా అభ్యర్థిని నిలబెట్టింది. ఆమెకు ఎలివేషన్ ఇచ్చేందుకు ఇండిపెండెంట్ గా మరొక అభ్యర్థిని నిలబెట్టింది.

అయినా, జెడ్పి చైర్మన్ స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని… హవా అని సాక్షి దినపత్రికలో కథనాలు రాయడం హాస్యాస్పదంగా అనిపించింది. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవి కాకుండా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మా పార్టీ నాయకత్వం విధానాలు నచ్చక పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. టిడిపి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించి బయటకు వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి.

రాష్ట్రంలో ఈ ఏడు స్థానాలకు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సస్పెన్షన్ తో ఖాళీ అయినా లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికతో పాటే నిర్వహించేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు నిర్వహించి , ఈ ఏడు స్థానాలలో మన పార్టీ అభ్యర్థులే నెగ్గితే, జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా 175కు 175 స్థానాలలో గెలుస్తామని భావించవచ్చు. ఈ ఏడు స్థానాలలో ఓటమిపాలయితే, మాకు ఓట్లు వేసేవారు వేరే ఉన్నారని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాగో రెడీ గానే ఉంటారు. అయినా 175 స్థానాలలో ఏడు స్థానాలు ఓడిపోతే 168 స్థానాలు మనవే కదా అంటూ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

టిడిపిలో చేరేందుకు ఎంతో మంది ఎమ్మెల్యేలు రెడీ
తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిగ్నల్ ఇస్తే మా పార్టీ నుంచి, ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి టిడిపిలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిసింది.

అలాగే నిజాలను నిక్కచ్చిగా మాట్లాడే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రకు ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలియజేశారు. దశాబ్దాలుగా రాజకీయాలలో కొనసాగుతున్న కుటుంబాలకు చెందిన రెడ్డి నాయకులను ప్రతిపక్షాల వైపు చూడడం ఆ పార్టీ పెరుగుదలను సూచిస్తుంది. ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలకు చెందిన వ్యక్తులను మా పార్టీ పెద్దలు ఏక వచనంతో సంబోధించడం వల్లే ఈ దుస్థితి దాపురిస్తోంది.

తూర్పు గోదావరి జిల్లాకు కొంతమంది మా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కలిసి నట్లు తెలిసింది. అలాగే మా జిల్లాకు చెందిన కొద్దిమంది నాయకులు కూడా టిడిపి నాయకత్వంతో టచ్ లో ఉన్నారనే సమాచారం తనకు ఉంది రాయలసీమ జిల్లాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం , టిడిపిలో చేరేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

70 శాతం అప్పులను మూడు నెలల్లో ఎత్తిన జగన్ సర్కార్
ఏడాదికి 30 వేల కోట్ల రూపాయల అప్పు ఎత్తే వెసులుబాటును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం మూడు నెలల వ్యవధిలోని 70% నిధులను అప్పు రూపంలో తీసుకుంది. ఇక ఈ ఆర్థిక ఏడాది మొత్తం మిగిలిన నిధులతో ఎలా సర్దుబాటు చేసుకుంటూ వస్తుందనేది నాకు అంతు చిక్కడం లేదని రఘు రామ కృష్ణంరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సిపిఎస్ రద్దు చేశామని మా పార్టీ ప్రభుత్వం ప్రకటించింది.. ఓపిఎస్ అమలు కోసం మాత్రమే సిపిఎస్ ను రద్దు చేయమని ఉద్యోగులు కోరారు. కానీ ఓపిఎస్ స్థానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిపిఎస్ ను తీసుకువచ్చారు. గ్యారెంటీ లేని గ్యారెంటీ పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డిని కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు పొగిడిన విధానం చూస్తే, ప్రొఫెషనల్ భజన బృందం చిన్న బోతుందని అనిపించింది.

ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చి ఓ పీ ఎస్ ను అమలు చేస్తామంటే, కాదు… మాకు జీపిఎస్ మాత్రమే కావాలేనంతగా జగన్మోహన్ రెడ్డిపై కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ప్రశంసలు కురిపించారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు .

సునీత పిటిషన్ లో సిబిఐ ఇంప్లీడ్ కాలేదన్న సాక్షి దినపత్రిక
డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ లో సిబిఐ ఇంప్లీడ్ కాలేదని సాక్షి దినపత్రిక వార్తా కథనం రాయడం విస్మయాన్ని కలిగించింది. దానికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీ రాలేదు. జడ్జిమెంట్లో, సునీత పిటిషన్ పరిగణలోకి తీసుకోలేదని సాక్షి దినపత్రికకు ఏమైనా న్యాయమూర్తి చెప్పారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

సీబీఐ కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు వైయస్ భాస్కర్ రెడ్డి బెయిలు పిటిషన్ రద్దు చేయడం సునీత సాధించిన విజయంగానే పేర్కొనాలి. ఈ వార్తను ప్రముఖ దినపత్రికలన్నీ ఫస్ట్ పేజీలో ప్రచురిస్తే, సాక్షి దినపత్రికలో మాత్రం కనిపించి కనిపించినట్లుగా ముద్రించడం ద్వారా తన నైజాన్ని చాటుకుంది. హైకోర్టు న్యాయస్థానం తీర్పు స్పష్టంగా ఉన్నప్పటికీ , సిబిఐ కోర్టు వైయస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరించడం అభినందనీయం.

వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరీని సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అయితే ఇప్పటివరకు వైయస్ అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా పేర్కొనలేదు. సాక్షిగాను, అనుమానితుడిగానే భావించింది. ఇప్పుడు ఆయన్ని ఈ కేసులో ఎనిమిదవ నిందితుడని తన కౌంటర్ అఫిడవిట్లో స్పష్టం చేసింది.

మంగళవారం ఈ కేసు విచారణకు వస్తుందా?, లేదంటే బుధవారం విచారణకు వస్తుందా? అన్నది పక్కన పెడితే, సునీత పడిన కష్టానికి మాత్రం ఫలితం దక్కనుందని రఘురామకృష్ణం రాజు అన్నారు . సమాజంలో మహిళలు ఎంతో వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఒక మహిళగా సునీత చేస్తున్న పోరాటానికి మహిళా సమాజం అండగా నిలువాలని కోరారు.

ఒక పార్లమెంట్ సభ్యుడిని అపహరించి కొట్టగలిగిన పటిష్టమైన పోలీసు వ్యవస్థ కలిగిన ఈ రాష్ట్రంలో, ఒక వృద్ధురాలు వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన సందేశాన్ని మరొక వాట్సాప్ గ్రూప్ కి ఫార్వర్డ్ చేసిందని వేధించగలిగిన పోలీసులు ఉన్న ఈ రాష్ట్రంలో, దళితులను చంపి పార్సిల్ చేస్తున్న ఈ రాష్ట్రంలో, నిందితులకు అండగా అసెంబ్లీలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ రాష్ట్రంలో…. సునీత చేస్తున్న పోరాటాన్నీ ప్రతి ఒక్కరూ అభినందించి… ఆమెకు అండగా నిలబడాలని కోరారు.

డాక్టర్లు తప్పు చేయవద్దు…
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఎన్ని ఒత్తిడిలు వచ్చిన తప్పు చేయవద్దని రఘురామకృష్ణంరాజు సూచించారు. నాది మెడికో లీగల్ కేసు. వైద్య నివేదికలపై డాక్టర్లు ఎప్పుడు సంతకాలు చేశారన్నది అందరికీ తెలిసిందే. అయినా ఇప్పుడు నివేదికలను మార్చి సంతకాలు చేయవద్దు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ గా వ్యవహరిస్తున్న ప్రభావతమ్మ మరో రెండు నెలల వ్యవధిలో పదవీ విరమణ చేయనున్నారు.

ఈ లోగానే గత రెండేళ్ల వైద్య నివేదికలను స్క్రాప్ చేయాలని భావించారు. ఇదే విషయాన్ని కోర్టుకు నివేదించాను. కోర్టు కూడా వైద్య నివేదికలను అందజేయాలని ఆదేశించింది. నన్ను అకారణంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు, రమేష్ ఆస్పత్రిలోనూ వైద్యాన్ని అందించాలని, ఆ నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

అయినా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి, ఎయిడ్స్ తో మృతి చెందిన ఒక పోలీసు అధికారి నన్ను జైలులోకి తోసి వేశాడు. ప్రభావతమ్మ మొగుడు అయిన మా పార్టీ నాయకుడు ఒకరు, కోడి కత్తి కేసులో అవసరం లేకపోయినా కుట్లు వేసిన వైద్యుడు చంద్రశేఖర్ రెడ్డి, అప్పటి సిఐడికి సునీల్ కుమార్ నా వైద్య నివేదికలను తారుమారు చేసి, న్యాయమూర్తికి అందజేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.