Suryaa.co.in

Editorial

పవన్‌ ప్రచారమంటే బీజేపీకి భయమా?

– తెలంగాణలో జనసేనకు 8 సీట్లిచ్చిన బీజేపీ
– ఇప్పటివరకూ బీజేపీ ప్రచారంలో కనిపించని పవన్‌
– పేరుకే పవన్‌ పార్టీతో పొత్తా?
– పవన్‌ వస్తే ఆంధ్రా ముద్ర పదడుతుందని బీజేపీ అనుమానిస్తోందా?
– పవన్‌ రాకను బీఆర్‌ఎస్‌ సొమ్ము చేసుకుంటుందన్న భయమా?
-గతంలో చంద్రబాబు అనుభవమే దానికి కారణమా?
-అందుకే పవన్‌తో ప్రచారం చేయించడం లేదా?
– కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్ధి కోసం పనిచేయని బీజేపీ క్యాడర్‌
– 26న కూకట్‌పల్లిలో పవన్‌ భారీ బహిరంగసభ
– జనసేన అభ్యర్ధుల వెంట కనిపించని కమలదళాలు
– తెలంగాణలో బీజేపీ-జనసేన ఉత్తుత్తి పొత్తులేనా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ను ప్రచారబరిలో దింపేందుకు బీజేపీ భయపడుతోందా? పవన్‌తో కలసి వేదిక పంచుకుంటే.. మళ్లీ ‘ఆంధ్రా ముద్ర’తో బీఆర్‌ఎస్‌ పవన్‌ భుజంపై తుపాకి పెటి,్ట తమను పేలుస్తుందన్న భయం బీజేపీని వెన్నాడుతోందా? అందుకే ఇప్పటివరకూ పవన్‌తో కలసి ప్రచార వేదికలు పంచుకోలేదా? జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమలదళాలు కనిపించకపోవడానికి ప్రధాన కారణం అదేనా? అంటే ఇద్దరివీ ఉత్తుత్తి పొత్తులేనా? ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో కూడా, పవన్‌ కల్యాణ్‌ బీజేపీ వేదికలపై కనిపించని నేపథ్యంలో తెరపైకొస్తున్న అనుమానాలివి!

ఎన్నికల పొత్తులో భాగంగా జనసేనకు 8 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. కూకట్‌పల్లి, తాండూరు, నాగర్‌ కర్నూలు, కోదాడ, పాలేరు, మధిర, కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాల్లో జనసేన పొత్తులో భాగంగా బరిలోకి దిగింది. శేరిలింగంపల్లి సీటు అడిగినప్పటికీ, దానిని బీజేపీ తీసుకుని కూకట్‌పల్లి జనసేనకు ఇచ్చింది. ఆ మేరకు జనసేనాధిపతి పవన్‌ బీజేపీ అగ్రనేతలతో చర్చించారు.

ఇది జరిగి చాలారోజులయినప్పటికీ.. ఇప్పటిదాకా పవన్‌ అటు జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో కానీ, ఇటు బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో గానీ, ఎక్కడా ఎన్నికల ప్రచారంలో కనిపించకపోవడం చర్చనీయాంశమయింది. నిజానికి రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో.. పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటారని, దానితో ఆంధ్రా సెటిలర్లు, ప్రధానంగా కాపుల ఓట్లు, పవన్‌ అభిమానుల ఓట్లు గంపగుత్తగా బీజేపీ అభ్యర్ధులకు పోలవుతాయన్న అంచనా వ్యక్తమయింది. ముఖ్యంగా పవన్‌ ప్రచారంతో, సెటిలర్లు ఎక్కువగా ఉండే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎక్కువ లాభపడవచ్చని భావించారు.

అయితే ఇప్పటిదాకా భూతద్దం పెట్టి వెతికినా పవన్‌, ఏ ఒక్క ప్రచార సభలోనూ కనిపించలేదు. మోదీ వచ్చినప్పుడు మాత్రమే వేదికపై కనిపించారు. తర్వాత పత్తా లేకపోవడం, క్షేత్రస్థాయిలోని బీజేపీ-జనసేన దళాలకు నిరాశ కలిగింది. కనీసం జనసేన అభ్యర్ధులున్న నియోజకవర్గాల్లో సైతం తమ నేత ప్రచారం చేయకపోవడం, జనసైనికులు-పవన్‌ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించింది. కాగా ఈనెల 26న కూకట్‌పల్లిలో జరిగే భారీ బహిరంగసభకు పవన్‌ హాజరవుతారని చెబుతున్నారు.

అయితే.. గత ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్‌ పొత్తు సమయంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా, ఈసారి పవన్‌తో ప్రచారానికి బీజేపీ నేతలు కలసి వెళ్లడం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబునుద్దేశించి.. కేసీఆర్‌ కొట్టిన సెంటిమెంటు డైలాగులు, తెలంగాణ ప్రజల హృదయాలకు నేరుగా తాకాయి. ‘ఆంధ్రా పార్టీలకు ఇక్కడేం పని? కాంగ్రెస్‌ గెలిస్తే ఆదేశాల కోసం అమరావతి వైపు చూడాలా? రోజూ అమరావతి వెళ్లాలా? పది సీట్ల కోసం నానా గడ్డి కరుస్తారా? థూ.. మీబతుకులు చెడ’ అని టీడీపీ భుజంపై తు పాకి పెటి, కాంగ్రెస్‌ను పేల్చారు. దానితో టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోకపోతే, ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితి వేరే ఉండేదన్న విశ్లేషణ అప్పుడే వినిపించింది.

ఇప్పుడు బీజేపీ కూడా అదే భయంతో ‘ఆంధ్రాముద్ర’కు భయపడి, పవన్‌తో కలసి ప్రచారం చేసేందుకు భయపడుతోందని చెబుతున్నారు. నిజానికి ఇప్పటివరకూ అమిత్‌షా, నద్దా, ఫడ్నవీస్‌ వంటి ఆగ్రనేతలు నగరానికి వచ్చినప్పటికీ, వారితో పవన్‌ కల్యాణ్‌ ఒక్కసారి కూడా వేదిక పంచుకోలేదని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు పవన్‌ తమతో కలసి ప్రచారం చేస్తే..‘‘ బీజేపీకి తెలంగాణ లీడర్లు పనికరారా? వారిని అవమానిస్తున్నారా? ఆంధ్రా వాళ్లే దిక్కయ్యారా?’’ అనే ప్రశ్నలతో బీఆర్‌ఎస్‌, తమను చావుదెబ్బ తీయడం ఖాయమన్న భయమే, పవన్‌కు దూరంగా ఉండటానికి ప్రధాన కారణమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా వారి వెంట బీజేపీ క్యాడర్‌ కనిపించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి నియోజకవర్గం స్థానాన్ని బీజేపీ ఆశించింది. కార్మికవర్గం ఎక్కువగా నివసించే ఆ నియోజకవర్గంలోని కొన్ని డివిజన్లలో బీజేపీకి బలమైన పట్టుంది. బీఎంఎస్‌ బలం కూడా బాగానే ఉంది. అయితే ఆ సీటును జనసేనకు ఇవ్వడంతో, బీజేపీ క్యాడర్‌ సహాయ నిరాకరణ ప్రారంభించారు. బీజేపీ నేతలెవరూ జనసేన అభ్యర్ధి వెంట కనిపించడం లేదు. పైగా ఎవరినీ రానీయడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ‘‘మేం జనసేన అభ్యర్ధి కోసం ప్రచారానికి వెళ్లాం. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎవరినీ రానీయడం లేదని జనసేన వాళ్లు మాకు చెబుతున్నారు. మాకు అక్కడ జనసేనకు పనిచేయమన్న ఆదేశాలున్నాయి. ఏపీలో జనసేనతో పొత్తు ఉన్నందున మేం ప్రచారానికి వెళ్లాం. అక్కడ జనసేన అభ్యర్ధి కోసం ఎవరూ పనిచేయడం లేదు. నిన్న అక్కడికి వెళితే ఇదీ పరిస్థితి’’ అని టీడీపీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మండూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు.

కాగా మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా, బీజేపీ క్యాడర్‌ ప్రచారానికి రావడం లేదంటున్నారు. వారంతా బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు వెళ్లి, పనిచేస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంటే శ్రీకాంత్‌ నటించిన ‘వినోదం’ సినిమాలో.. ఉత్తుత్తి బ్యాంక్‌, ఉత్తుత్తి పోలీసుస్టేషన్‌ మాదిరిగా.. బీజేపీ-జనసేనది ఉత్తుత్తి పొత్తులా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE