అమరావతి శ్మశానం మాటకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

-అమరావతి రైతులకు పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామన్నాం
-వారి మనసులో ఉన్నట్టు చేయడం కుదరదు
-రాజధాని నుంచే పాలించాలన్న నిబంధన రాజ్యాంగంలో ఉందా?
అమరావతిని శ్మశానంలా ఉంచారన్న గతంలోని తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి శ్మశానం అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు స్పందనగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తానంటే అక్కడేముంది శ్మశానంలా ఉంచారని అన్నానని, ఐదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు ఇక్కడకొచ్చి ఏం చూస్తారని మాత్రమే అన్నానని, ఆ వ్యాఖ్యలకు తాను కట్టబడి ఉన్నానని స్పష్టం చేశారు.
అమరావతి రైతులకు పరిహారం ఇస్తున్నామని, ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పామని, అంతేకానీ వారి మనసులో ఉన్నట్టు ప్రభుత్వం చేయాలంటే కుదరదని తేల్చి చెప్పారు. ఢిల్లీ నుంచి తమ నేత వచ్చినప్పుడు ఒకమాట.. వెళ్లాక మరోమాట మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాజధాని ప్రాంతం నుంచే పాలించాలన్న నిబంధన రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందేమో వారే చెప్పాలన్నారు. మూడు రాజధానులను చేసి చూపెడతామని స్పష్టం చేశారు.