– తన ఓటమికి ఓట్లు చీలకపోవడమే కారణమట
– పీడీఎఫ్ అభ్యర్ధి ఓట్లు చీలిస్తే ఆయన గెలిచేవారట
– ఆ అభ్యర్ధి ఆశించిన స్థాయిలో ఓట్లు చీల్చలేదని ఆవేదన
– విశాఖ వైసీపీ అభ్యర్ధి సుధాకర్ విచిత్ర విశ్లేషణ
– జగన్, తన బలం కంటే పీడీఎఫ్ అభ్యర్ధి సత్తా మీదే నమ్మకం పెట్టుకున్న సుధాకర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్ధులెవరయినా తన ఓటమికి ‘జనం నమ్మే సాకులు’ చెబుతుంటారు. ప్రత్యర్ధి పార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందనో, దొంగ ఓట్లతో గెలిచిందనో ఆరోపిస్తుంటారు. లేకపోతే డబ్బులు వెదజల్లారనో, అదీకాకపోతే తన సొంత పార్టీ నేతలే సహకరించలేదనో చెబుతుంటారు. కానీ ఈ అభ్యర్ధి మాత్రం.. మరో అభ్యర్ధి తాను ఆశించిన స్థాయిలో ఓట్లు చీల్చకపోవడం వల్లే, తాను ఓడిపోయానన్న విచిత్ర విశ్లేషణకు దిగారు. ఆ అభ్యర్ధి పేరు సీతంరాజు సుధాకర్. విశాఖ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆయన రెండవ స్ధానానికి పరిమితమయ్యారు.
ఫలితాలు వెలువడిన తర్వాత సహజంగా మీడియా ముందుకొచ్చే అభ్యర్ధులు.. తమ గెలుపు-ఓటమికి కారణాలు విశ్లేషిస్తారు. ఆరోపణలు చేస్తుంటారు. కానీ సుధాకర్ చేసిన వింత విశ్లేషణ మాత్రం సొంత పార్టీ వారినే విస్మయపరిచింది. పోలింగ్ శాతం పెరిగి ఉంటే గెలిచేవాడినన్న సుధాకర్.. మరో అడుగు ముందుకేసి. పీడీఎఫ్ అభ్యర్ధి.. తాను ఆశించిన స్థాయిలో ప్రభావం చూపనందుకే ఓడానన్నారు.
అంతేనా?… పీడీఎఫ్ అభ్యర్ధి ఓట్లు చీలిస్తే, అది తమకు లాభిస్తుందని ఆశించానన్నారు. కానీ తన అంచనాలకు తగ్గట్లు, పీడీఎఫ్ అభ్యర్ధికి సరైన ఓట్లు రాలేదని నిరాశ వ్యక్తం చేశారు. నిజానికి సుధాకర్ పాటి ఆవేదన, ఆందోళన పిడిఎఫ్ అభ్యర్ధిలోనూ కనిపించలేదు.
దీన్నిబట్టి.. వైసీపీ అభ్యర్ధి త నపైన- తన పార్టీ అధినేత జగన్ పాలనపై నమ్మకం కంటే.. పీడీఎఫ్ అభ్యర్ధి సత్తా మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లు, ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు సుధాకర్ అభ్యర్ధిత్వం ప్రకటించేముందు, పార్టీ అధినేత గానీ, ఇన్చార్జి సుబ్బారెడ్డి గానీ ఎవరినీ సంప్రదించలేదని వైసీపీ సీనియర్లు చెబుతున్నారు.
ఏకపక్షంగా అభ్యర్ధిని ఎంపిక చేసినందున, ఆయన జయాపజయాలతో తమకేం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో సీనియర్లు చాలామంది ఉన్నప్పటికీ వారిని విస్మరించి, సుధాకర్‌కు సీటు ఇచ్చిన నాయకత్వానికి, ఎవరినీ తప్పుపట్టే నైతిక అర్హత లేదన్నది వారి వాదన. మొత్తానికి సుధాకర్ తన ఓటమిపై చేసిన వింత విశ్లేషణ మాత్రం రాజకీయ వర్గాల్లో కామెడీ దిశలో చర్చ జరుగుతోంది.