Suryaa.co.in

Andhra Pradesh

ఇదేం సామాజిక న్యాయం జగన్‌ రెడ్డీ?

రెడ్లకు 49 సీట్లు ఇవ్వడమేనా సామాజిక న్యాయం
బీసీలకు జగన్మోహన్‌ రెడ్డి సామాజిక అన్యాయం
– మాజీ ఎంపి, టీడీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య

‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అంటే ఇదేనేమో! వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తమ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసిన అనంతరం ఆ పార్టీ ‘సామాజిక న్యాయం’ చేశామని, దేశ చరిత్రలోనే సిఎం జగన్‌ సరికొత్త రికార్డు సృష్టించారని, అన్ని వర్గాలకు సమన్యాయం చేశామని చాటుకోవడం.. పిల్లి కళ్లు మూసుకుని పాలు త్రాగుతూ తననెవరూ చూడలేదని అనుకోవడంలాగే ఉంది.

రాష్ట్రంలో కేవలం 5%గా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 49 సీట్లు కేటాయించి, 52 నుంచి 60%గా ఉన్న బీసీలకు 48 సీట్లు కేటాయించడాన్ని సామాజిక న్యాయం అంటారా? లేక సామాజిక అన్యాయం అంటారా? ఇక రాయలసీమతోపాటు గ్రేటర్‌ రాయలసీమలో దాదాపు 20%గా ఉన్న బలిజ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడాన్ని ఏమనాలి?

1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి సంప్రదాయంగా తిరుపతి, చిత్తూరు, రాజంపేట వంటి స్థానాల్లో బలిజలకు అన్ని పార్టీలు సీట్లు ఇస్తుంటే.. జగన్‌ రెడ్డి వారికి మొండిచేయి చూపడాన్ని సామాజిక న్యాయం అనాలా? అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని సంబర పడాలా? చివరకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా బలిజలకు సీట్లు ఇవ్వకుండా ద్రోహం చేసిన జగన్‌ రెడ్డి బలిజ ద్రోహిగా మిగిలిపోతారు. ఈ అవమానాన్ని బలిజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు.

అసెంబ్లీతోపాటు పార్లమెంట్‌ సభ్యుల ఎంపికలో కూడా జగన్మోహన్‌ రెడ్డి సమన్యాయం పాటించలేదు. రాజంపేట లోక్‌సభకు ఎన్టీఆర్‌, చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర రెడ్డిలు బలిజ అభ్యర్ధుల్ని నిలబెట్టేవారు. కానీ, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆ స్థానాన్ని కూడా సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టుకొన్నారు. ఇలా ఒక ప్రాంతానికి చెందిన బలమైన సామాజిక వర్గాన్ని రాజకీయంగా దూరం చేసుకోవడం అంటే తమకు తాము రాజకీయ సమాధి నిర్మించుకోవడమే. ఇప్పటికైనా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన పార్టీ అభ్యర్ధుల జాబితాలో బలిజలకు స్థానం కల్పించాలి. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు.

LEAVE A RESPONSE