– మరి ఆ తీర్పును వీళ్లు ఎందుకు స్వాగతించలేదు..?
– ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలా మాట్లాడటం సెక్యులరిజమా ?
– బిజెపి మాజీ శాసనసభ్యుడు రఘునందన్ రావు
బిజెపి మాజీ శాసనసభ్యుడు రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యాంశాలు:
హైదరాబాద్ : బిల్కిస్ బానో రేప్ కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ, కవిత, కేటీఆర్ ప్రధాని మోదీ ని కించపరుస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. బిల్కిస్ బానో కేసులు కుహనా లౌకిక వాదులు నిన్న కేటీఆర్, రాహుల్, కవితలు మాట్లాడారు. ప్రధాని మోదీ ని విమర్శించారు.
సుప్రీం కోర్ట్ తీర్పును స్వాగతించారని, భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు అంటూ వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణం మీద జడ్జిమెంట్ ఇచ్చింది కూడా సుప్రీంకోర్టే కదామరి, రామమందిర నిర్మాణం తీర్పును వీళ్లు ఎందుకు స్వాగతించలేదు..? అసలు ఈ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు..? 1985లో శాభానో అనే ముస్లీం మహిళకు భరణం కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును రాహుల్ గాంధీ నాన్న రాజీవ్ గాంధీ పక్కన పెట్టారు.
ఏడేళ్లు ఆ మహిళ పోరాటం చేస్తే సుప్రీంకోర్టు ఆమెకు అనూకూలంగా తీర్పునిచ్చింది.ఐదుగురు జడ్జిలు కలిసి ఇచ్చిన జడ్జిమెంట్‌ను రాజీవ్ గాంధీ పక్కన పెట్టించారు. ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలా మాట్లాడటం సెక్యులరిజమా ?
పార్లమెంట్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప వారి మీద ప్రేమ కాదు.జ్ఞానవ్యాపి మసీద్ కేసును సైతం స్వాగతించాలి. బీజేపీ అన్ని కోర్ట్‌ల తీర్పులను స్వాగతిస్తుంది. ఆదిలాబాద్‌లో దళిత బిడ్డ టేకులపల్లి లక్ష్మి హత్య జరిగినప్పుడు కవిత, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు ? అప్పుడు తెరవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయి ?
రాహుల్ గాంధీ మాట్లాడిన కాసేపటికే కేటీఆర్, కవిత మాట్లాడతారు. మరి ఎవరు ఒక్కటి అనేది తెలియడం లేదా..? బీజేపీ, బీఆర్‌ఎస్ ఎప్పుడు ఒకటి కాదు.. దయచేసి ఈ ప్రచారాన్ని నమ్మకండి. బీఆర్‌ఎస్‌తో కలిసి బీజేపీ వెళ్ళే ప్రసక్తే లేదు. నాణేనికి రెండు మొహాల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఉన్నాయి తప్ప బీజేపీ బీఆర్‌ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాదు.