వాషింగ్టన్ : కరోనా పుణ్యమాని చేదు సంఘటనలే కాదు.. హృదయవిదాకర ఘటనలు కొకొల్లలు చోటుచేసుకున్నాయి. అటువంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. విమాన ప్రయాణంలో మధ్యలో కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో మూడు గంటలకు పైగా అందులోని బాత్రూమ్‌లో ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే మిచిగాన్‌కు చెందిన టీచర్ మరిసా ఫోటియో. చికాగో నుండి ఐస్‌లాండ్ వెళుతున్నారు. మార్గమధ్యంలో గొంతు నొప్పిగా అనిపించడంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కంగారు పడిపోయారు. తోటి ప్రయాణీకులకు ఏమోతుందో..తన కుటుంబ పరిస్థితి ఏమిటో అని ఆలోచించుకుంటూ ఆవేదన చెందారు. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనను ఆమె ఓ చానల్‌తో పంచుకున్నారు.
విమాన ప్రయాణానికి ముందు తాను రెండు సార్లు పిసిఆర్ టెస్టులు, ఐదుసార్లు ర్యాపిడ్ టెస్టులు చేసుకున్నానని, అప్పుడు నెగిటివ్ అని తేలిందని చెప్పారు. కాగా, విమానం మధ్యలో గొంతు నొప్పి రావడంతో పరీక్షలు చేసుకోగా… పాజిటివ్ అని తేలడంతో తానెంత మనో వేదనకు గురయ్యారో వివరించారు. కాగా, తాను అప్పటికే రెండు టీకాలు తీసుకున్నానని తెలిపారు. తోటి ప్రయాణీకులు, తన కుటుంబ సభ్యులను గురించి ఆందోళన చెంది.. ఈ విషయాన్ని విమాన సిబ్బందికి తెలియజేశానని చెప్పారు. అయితే ఆమెకు విమానంలో మరో సీటు ఏర్పాటు చేద్దామని భావించినప్పటికీ.. సీట్లు నిండుకోవడంతో కుదరలేదని, దీంతో విమానం బాత్రూమ్‌లో ఉండేందుకు ఫోటియో సిద్ధమవ్వగా.. అందులో ఉంచామని, వెంటనే దానికి బయట నుండి ఔట్ ఆఫ్ సర్వీస్ అని స్టికర్‌ను ఉంచామని విమాన సిబ్బంది రాకీ తెలిపారు. సుమారు ఆమె మూడు గంటలకు పైగా అందులో ఉండిపోయినట్లు వెల్లడించారు. ఐస్‌ల్యాండ్‌లో విమానం దిగగానే ప్రయాణీకులందరినీ పంపిచేసి.. ఆ తర్వాత ఫోటియోతో పాటు ఆమె కుటుంబాన్ని పంపినట్లు తెలిపారు.