మహిళా సమస్యల పరిష్కారంలో కమిషన్: వాసిరెడ్డి పద్మ

Spread the love

రాష్ట్ర ప్రగతితో పాటు మహిళా సాధికారతకు మహిళా కమిషన్ విశేషంగా కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మంగళగిరి వద్ద రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు.

గడచిన ఈ రెండున్నర సంవత్సరాలలో మహిళా కమిషన్ పరిధి పెరిగిందని, అన్ని విభాగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చైర్ పర్సన్ పద్మ తెలిపారు. గడిచిన రెండున్నర ఏళ్ళలో మహిళా కమిషన్ సాధించిన విజయాలు, పురోగతిని వివరించారు.

సమాజంలో మహిళలపైన ఉన్న అసమానతలను తగ్గించేందుకు తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నామన్నారు. ఇప్పటికే ఇద్దరు మహిళా కమిషన్ సభ్యులను రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి నియమించారని చెప్పారు. మహిళలకు సంబంధించి అన్ని విషయాలను చూడాల్సిన భాధ్యత మహిళా కమిషన్ పై ఉందన్నారు. ఎక్కువగా చిన్నారులు, వివాహిత మహిళలు, యువతులు, వృద్ధులు సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అనేక ఘటనలకు సంబంధించి బాధితుల ఫిర్యాదులుతో పాటు మీడియాలో వచ్చిన అనేక కథనాలను మహిళా కమిషన్ పరిశీలించి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

ప్రధానంగా మహిళలకు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పడు మహిళా కమిషన్ దృష్టికి తీసుకు వెళితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం మహిళా ఉద్యోగుల్లో తీసుకు రాగలిగామని పేర్కొన్నారు. చిన్నారులు, మహిళా ఉద్యోగులకు ఎక్కడ ఇబ్బందులు వచ్చినా తక్షణం స్పందిస్తూ, బాధితులకు న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి సహకారంతో మహిళా కమిషన్ పని చేస్తుందన్నారు. అది మహిళా కమిషన్ సాధించిన విజయంగా మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఇందుకోసం తాము చేస్తున్న కృషికి రాష్ట్ర సచివాలయం నుంచే తగిన సహకారం అందించేలా ముఖ్యమంత్రి ఆదేశాలివ్వడం జరిగిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు ఇబ్బందులు ఎదుర్కొన్నా అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు అన్ని రకాల సామాజిక నాయకులు, పెద్దలు, మతాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించామన్నారు. చిన్నారులపై అత్యాచారం ఘటనలు జరిగినప్పడు క్షేత్ర స్థాయిలో ఉన్న వాలెంటీర్ వ్యవస్థను వినియోగించుకుంటున్నామన్నారు. స్కూల్ స్థాయిలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే స్పందిస్తున్నామన్నారు.

ఏ జిల్లా ఏ ప్రాంతంలో ఉన్న తమకు సమాచారం వస్తే వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుని వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. తమకు అన్యాయం జరిగిందని కొందరు మహిళలు న్యాయం చేయాలని కోరుతూ ఫోన్ లు చేస్తున్నారన్నారు. రహస్యంగా గా విచారణ చేయాలని కోరితే వాటిని కూడా బాధితులు కోరిన విధంగా వారి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. గడచిన రెండు ఏళ్ళలో సుమోటోగా 72 కేసులు, ఎన్నారై కేసులు 63 వరకు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఏదైనా ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినుల పట్ల అ సభ్యకర ప్రవర్తన కలిగిస్తే, అదే శాఖకు చెందిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్నామన్నారు.

చిన్నారులు,మహిళలు, యువతులు సంరక్షణకు మహిళా కమిషన్ తీసుకున్న చర్యలను వివరించారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి మహిళల పేరున ఇంటినివేశన స్థలాలు, ఇల్లు, సంక్షేమ పధకాల్లో అగ్రభాగం మహిళలకే అందించడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కె. జయశ్రీ, గజ్జల జయలక్ష్మి లు తమపై నమ్మకం ఉంచి మహిళా కమిషన్ సభ్యులుగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ పరిధిలో చేపట్టిన పనులను మహిళా కమిషన్ సభ్యులు వివరించారు. అనంతరం నూతన సంవత్సర వేడుకలను ముందస్తుగా నిర్వహించి కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మీడియా సమావేశంలో మహిళా కమిషన్ సెక్రటరీ శైలజ, డైరెక్టర్ ఆర్. సూయజ్, మహిళా కమిషన్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply