Suryaa.co.in

Andhra Pradesh

ఇసుకాసురుడు జగన్….4 ఏళ్లలో రూ.40 వేల కోట్ల దోపిడీ

కోర్టు తీర్పుల ఉల్లంఘన….40 కోట్ల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు
జగన్ కు ఇసుకే ఆహారం….భూములు ఫలహారం…మద్యమే మంచినీరు
జగన్ కు విధ్వంసమే ఆశయం, హింసించడమే ఆనందం, లక్షల కోట్ల దోపిడీనే లక్ష్యం
ఇసుక దోపిడీపై పక్కా ఆధారాలతో ప్రశ్నిస్తున్నాం…48 గంటల్లో సమాధానం చెప్పాలి
అధికారంలోకి వచ్చాక విచారణ చేస్తాం…తప్పు చేసిన అధికారులను శిక్షిస్తాం:- నారా చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో ఇసుక దోపిడీపై చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం
జగన్ ఇసుకాసురుడు అంటూ నాలుగున్నరేళ్ల ఇసుక దోపిడీపై ప్రజెంటేషన్

అమరావతి:- జగన్ ఒక ఇసుకాసురుడు…4 ఏళ్లలో రూ.40 వేల కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడ్డారు అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీపై చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ఇసుకాసురుడు అంటూ నాలుగున్నరేళ్ల ఇసుక దోపిడీపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్జిటి, సుప్రీం కోర్టుల తీర్పుల ఉల్లంఘన….40 కోట్ల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాల ఆధారాలతో సహా వివరించి…ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

జగన్ కు ఇసుకే ఆహారం….భూములు పలహారం…మద్యమే మంచినీరు…విధ్వంసమే ఆశయం….హింసించడమే ఆనందం…లక్షల కోట్ల దోపిడీనే లక్ష్యం అని మండి పడ్డారు. ఇసుక దోపిడీపై పక్కా ఆధారాలతో ప్రశ్నిస్తున్నాం…48 గంటల్లో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వ ఇసుక దోపిడీపై పూర్తిగా విచారణ చేస్తాం…తప్పు చేసిన అధికారులను శిక్షిస్తాం అని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఒక మనిషి సహజ వనరుల్ని ఎలా మింగేస్తున్నాడో, తన దోపిడీకోసం ప్రజాస్వామ్యంలో ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడో చెప్పేందుకు ఇసుక అక్రమాలు ఒక ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇసుక ద్వారా అనేక రంగాలు లబ్ధి పొందుతాయి. ఇసుక అనేది సహజ సంపద. సహజ సంపద ప్రజలకు చెందాలిగానీ, ఇతరులకు దోపిడీ వనరుగా మారడానికి వీల్లేదు.

ఇసుక నిర్మాణ రంగానికి చాలా కీలకం, 40లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులకు జీవనోపాధి కల్పిస్తుంది. అలానే 125 ఇతర వృత్తుల జీవనో పాధికి కూడా ఇసుక చాలా కీలకం. భూ గర్భ జలాల వృద్ధి, పర్యావరణ సమతుల్యత, నదీజలాల పరిరక్షణ, మంచినీటి వనరుల సంరక్షణ కు ఇసుక అవసరం అన్నారు.

టీడీపీ హాయాంలో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చాము. నిర్మాణ రంగం ఊపందుకోవాలన్న ఉద్దేశంతోనే ఉచిత ఇసుక పాలసీ అమలుచేశాం. దానివల్ల లక్షలాది మందికి ఉపాధి కలిగింది. ఇసుక రీచ్ ల నిర్వహణను డ్వాక్రాసంఘాలకు అప్పగించాము. సాధారణప్రజలకు ఇసుక అందుబాటు లో ఉండేలా చేశాను. అంతచేస్తే ఇసుక దోపిడీ జరుగుతోందని అప్పుడు దుష్ప్రచారం చేశారు. ప్రతిపక్షంలో తానే ఇసుకను నేరుగా డోర్ డెలివరీ చేస్తానని హామీ ఇచ్చిన పెద్దమనిషి, విజయవంతంగా ఈ నాలుగేళ్లలో ఎక్కడా, ఎవరికీ దొరక్కుండా ఇసుకను దోచేస్తున్నాడు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే టీడీపీ అమలుచేసిన ఉచిత ఇసుక విధా నాన్ని రద్దుచేశాడు.

ఆ నిర్ణయంతో 40 లక్షల కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పనిలేక కుటుంబపోషణ భారమై 130 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇసుక మాఫియా నిర్వాకంతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయింది. ఆ దుర్ఘటనలో 48 మంది చనిపోయారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో మేటవేసిన ఇసుకను తొలగించలేదు. మృతుల కుటుంబాలకు ఎలాంటి న్యాయం చేయలేదు. గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోయింది. ఇసుక మాఫియాపై ప్రేమతో ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టుల్ని కూడా విధ్వంసం చేశాడు.

ఇటీవలే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్ని పరిశీలించాను. ఎక్కడచూసినా ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ ను పట్టించుకోకుండా, కనీసం గ్రీజు కూడా పెట్టకుండా ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. జొన్నవాడ ఇసుక రీచ్ ను కూడా పరిశీ లించాను. అక్కడ కొండల్ని తలపించేలా ఇసుక కుప్పలు కనిపించాయి. కరుడుగట్టిన నేరస్తుడు ప్రణాళికబద్ధంగా ఏ విధంగా నేరాలు చేస్తాడో చెప్పడానికి ఇలాంటివెన్నో ఉదాహరణలున్నాయి.

ఇసుకపై తొలుత ఒక పాలసీ ప్రకటించాడు. ఏపీ.ఎం.డీ.సీ ద్వారా ఇసుక అమ్మకాలు సాగిస్తామని చెప్పాడు. ఏమైందో తెలియదు తరువాత మాట మార్చి రెండో పాలసీ ప్రకటించి జేపీ పవర్ వెంచర్స్ అనే బినామీ సంస్థతో 03-05-2021న ఒప్పందం చేసుకొని ఇసుక రీచ్ ల నిర్వహణను దానికి అప్పగించాడు. ఆ సంస్థ ఎన్.సీ.ఎల్.టీ లో ఉంది.. దివాళా తీసింది. ఆ సంస్థకు ఇంతకుముందు ఇసుక తవ్వకాలు, రీచ్ ల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేదు.

మొత్తం రాష్ట్రాన్ని మూడుముక్కలు చేసి, ఆ సంస్థకు అప్పగించి, టన్నుఇసుక ధర రూ.475గా నిర్ణయించారు. దానిలో రూ.375లు ప్రభుత్వానికి, రూ.100లు జేపీ వెంచర్స్ సంస్థకు అని చెప్పా రు. పత్రికల్లో పెద్దపెద్ద అక్షరాలతో ప్రకటనలు ఇచ్చారు. తానొక్కడే ఇసుక ను పరిరక్షిస్తున్నానని, గతంలో ఉన్నవాళ్లు తినేశారని ఇష్టమొచ్చినట్టు దుష్ప్రచారం చేశాడు.

ఇసుక రీచ్ లను జేపీ పవర్ వెంచర్స్ కు అప్పగిస్తే, ఆ సంస్థ ఇసుక తవ్వకం.. అమ్మకం.. రవాణా వ్యవహారాలను టర్న్ కీ అనే మరోసంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. రెండు సంస్థలకు మధ్య వాటాల్లో తేడాలు రావడం తో జూలై 2022 నుంచి టర్న్ కీ సంస్థ పక్కకు తప్పుకుంది. 2022 ఆగస్ట్ నుంచి ఎక్కడికక్కడే వైసీపీనేతలే ఇసుకదందా, దోపిడీలో మునిగితేలుతున్నారు.

ముందేమో ఏపీ.ఎం.డీ.సీ అన్నారు..తరువాత జేపీ వెంచర్స్ సంస్థ.. అది అయిపోయింది టర్న్ కీ అన్నారు. దాని తర్వాత మొత్తంగా ఇసుక దందా అంతా వైసీపీనేతలే జిల్లాలవారీగా సాగిస్తున్నారు. జిల్లాలవారీగా టార్గెట్లు ఇచ్చి మరీ దోచేసుకుంటున్నారు. ఇసుక విధానంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలను ప్యాకేజీ -1 కిందకు చేర్చారు. ప్యాకేజీ – 2 కింద పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలుంటే, ప్యాకేజీ-3 పరిధి లో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలున్నాయి.

నిబంధనలు మొత్తం గాలికి వదిలేసి, పర్యావరణానికి తూట్లుపొడిచేలా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఇసుక రీచ్ లలో 1 మీటర్ లోతు కంటే ఎక్కువ తవ్వకూడదు.. నీటిలోపల ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు, అనుమతులకు మించి సరిహద్దులు మీరి తవ్వకాలు జరపరాదు, నదీగర్భంలో భారీ యంత్రాలను తవ్వకాలకోసం ఉపయోగించరాదు, నదీ ప్రవాహాలకు అడ్డుగా రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టరాదు, వర్షాకాల సమయంలో నదిలో తవ్వకాలు జరప కూడదు.. ఈ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, అడ్డగోలుగా అడ్డూ ఆపు లేకుండా రీచ్ లలో తవ్వకాలు జరిపి కోట్ల టన్నులు తవ్వేశారు.

ఈ నిబంధనలన్నీ కొత్తగా వచ్చినవి కావు. ఎప్పటినుంచో అన్ని ప్రభుత్వాలు అమలు చేశాయి. ఈ ప్రభుత్వం మాత్రం దోపిడీయే పరమావధి గా నిబంధనలు ఉల్లంఘించింది. అలానే ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) ఆదేశాలను కూడా బేఖాతరు చేసింది.

జేపీ వెంచర్స్ సంస్థతో 03-05-2021న చేసుకున్నఒప్పందం, 02-05-20 23న ముగిసింది. ఆ సమయంలో అక్రమ ఇసుక తవ్వకాలు వెంటనే నిలిపేయాలని 23-03-2023న ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణానికి ముప్పువాటిల్లేలా కొనసాగిస్తున్న ఇసుకతవ్వకాలు మొత్తం ఆపాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పింది.

తీర్పు ఇవ్వడంతో పాటు 400 రీచ్ లలో ఇసుకతవ్వకాలు జరుగుతున్నాయని రీచ్ కు రూ.కోటిచొప్పున రూ.400కోట్లను నదీగర్భం అభివృద్ధికి వినియోగించాలని చెప్పింది. జరిమానాలో తక్షణమే రూ.18కోట్లు చెల్లించాలని చెప్పింది. ఎన్జీటీ తీర్పు ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన అన్నిఅనుమతులు రద్దు అయ్యాయి. 24-04-2023న స్టేట్ లెవల్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ( ఎస్.ఈ.ఐ.ఏ.ఏ) కూడా తక్షణమే ఇసుక తవ్వకాలు ఆపాలని, యంత్రా లతో తవ్వకాలు జరపవద్దని ఆదేశించింది.

ఎన్జీటీ ఆదేశాలపై ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు స్టే విధించడానికి నిరాకరించి, తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన నిషేధాన్ని సమర్థిస్తూ 14-07-2023న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని కూడా వక్రీకరించి, సుప్రీం తీర్పు కేవలం చిత్తూరు జిల్లాకే పరిమితమని రాష్ట్రంలో తవ్వకాలు జరపొచ్చని ప్రచారం చేశారు. మళ్లీ ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు ప్రారంభించారు.

దానిపై కొందరు మరలా ఎన్జీటీలో ఫిర్యాదుచేస్తే, ప్రభుత్వ వక్రీకరణపై సదరు విభాగం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వ కాలు నిషేధిస్తున్నామని మరోసారి 02-08-2023న విస్పష్టమైన ఆదేశా లు ఇచ్చింది. ఎన్జీటీ ఆదేశాలపై మరలా సుప్రీంకోర్టుకు వెళ్లారు. నేడు తీర్పు రాబోతోంది. ఈ విధంగా కరుడుగట్టిన నేరస్తుడు, ఉగ్రవాది మాదిరి దోపిడీకోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీచేశాడు.

నాలుగున్నరేళ్లలో రూ.40వేలకోట్ల ఇసుక దోపిడీ…

నాలుగున్నరేళ్లలో 40వేలకోట్ల రూపాయల ఇసుక దోపిడీ చేశారు. ఏడాదికి 2 కోట్లటన్నుల ఇసుకతవ్వకాలకు అనుమతించిన ఈ ప్రభుత్వం, యథేచ్ఛగా రీచ్ లలో దోపిడీ చేసింది. అధికారికంగా 110, అనధికారికంగా 500కు పైగా రీచ్ లలో ఇసుక దోపిడీ జరిగింది. మొత్తంగా 40 కోట్ల టన్ను లు తవ్వేశారు..టన్నుకి రూ.1000చొప్పున 40వేల కోట్ల దోపిడీ. అడ్డగోలు గా పేదల కడుపుకొట్టి, రూ.40వేలకోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్ ను ఏంచేయాలి?

వీళ్ల ఇసుక దోపిడీతో ఉపాధిలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇసుక మాఫియా మోసాలకు, ఇసుకదోపిడీని ప్రశ్నించినందుకు ఎందరో బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకు రూ.35కోట్ల జే ట్యాక్స్ కట్టలేక ప్రేమ్ రాజ్ అనే వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇసుక అక్రమరవాణాపై ప్రశ్నించాడని వరప్రసాద్ అనే యువకుడికి పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు.

కడప జిల్లాలో జగన్ బంధువు వీరారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇసుక దోపిడీని బయటపెట్టిన దండా నాగేం దర్ పై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. ఇల్లు కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. ఈ దుర్మార్గుల వేధింపులు తట్టుకోలేక నాగేందర్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కంచేటి సాయి అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ పెట్టి అక్రమ అరెస్ట్ చేశారు. అతని సొంతభూమిలో ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టి కుటుంబసభ్యుల్ని వేధించారు.

ఫేక్ ఫెలోస్.. ఫేక్ బిల్లులు…

జేపీ వెంచర్స్ సంస్థ ఇచ్చే ఇసుకబిల్లుల్లో ఎక్కడా జీఎస్టీ చెల్లింపు ప్రస్తావన ఉండదు. మరో బిల్లులో చేతిరాతలో జీఎస్టీ వేస్తారు. మరో బిల్లుకూడా అంతే. ఒక్క బిల్లు కూడా సరైన సమాచార లేదు. (ప్రభుత్వమిస్తున్న బిల్లులను విలేకరులకు చూపించిన చంద్రబాబు) పోలీసులు చెక్ చేసే బిల్లుల్లో కూడా జీఎస్టీ లేదు. దీన్ని బట్టి పోలీసులు తనిఖీలు చేయడం లేదు.. అక్రమ ఇసుక రవాణాకు కొమ్ముకాస్తున్నారు.

జొన్నవాడ ఇసుక రీచ్ నుంచి రోజుకి 10వేల టన్నులకు పైగా ఇసుక తరలిపోతోంది. నేను స్వయంగా పరిశీలించాను. స్థానిక ఎమ్మెల్యే నేత్రత్వంలోనే అక్కడ ఇసుక దోపిడీ జరుగుతోంది. మా ఇంటి పక్కనుంచే రోజుకి కొన్ని వందల లారీల ఇసుక తరలిపోతోంది. అడిగితే సమాధానం చెప్పరు.

తవ్వుకో.. దోచుకో.. దాచుకో

ఇసుక తవ్వకాల్లో జగన్ రెడ్డి విధానం ఇష్టమొచ్చినట్టు తవ్వుకో.. దొరికిం దంతా దోచుకో…. లక్షలకోట్లు దాచుకో. రాష్ట్రంలో జరుగుతున్నఇసుక దోపి డీపై సీఎం సిగ్గుపడాలి. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో, రాజధాని ప్రాంతంలో చుట్టూ జనావాసాల మధ్యలో గుండిమెడలో 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఈసీ లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతు న్నారు. పక్కనే డీజీపీ కార్యాలయం ఉంది.

అచ్చంపేట మండలం కొత్తపల్లి లో ఈసీ అనుమతి లేకుండానే 3 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా తవ్వేస్తు న్నారు. ఈ విధంగా రాష్ట్రంలో కొన్ని వందల డంప్ లలో లక్షలాది టన్ను లు ఇసుకను అక్రమంగా నిల్వచేశారు. ఏ నదిలో చూసినా వందలాది వాహనాలు.. రీచ్ ల పక్కన, సమీపప్రాంతాల్లో అనకొండలను తలపించేలా జగన్ రెడ్డి సృష్టించిన ఇసుక కొండలు.

ఎన్జీటీ స్పష్టంగా చెప్పినా, సుప్రీంకోర్టు ఆదేశించినా, ఎక్కడా ఇసుక తవ్వ కాలు ఆపింది లేదు. గూగుల్ మ్యాప్ లో చూస్తే ఇప్పటికీ రీచ్ లలో జరిగే తవ్వకాలు, రీచలలో వేసిన రోడ్లు, రవాణాకు సిద్ధంగా ఉన్న వాహానాల వరసలు చాలా స్పష్టంగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. (గుంటూరులో జరిగే ఇసుకతవ్వకాలకు సంబంధించి 21-08-23 నాటి గూగుల్ మ్యా ప్ ను విలేకరులకు చూపించిన చంద్రబాబు)

రాజధానిలో జరిగే ఇసుక అక్రమ తవ్వకాలపై వైకుంఠపురానికి చెందిన సర్పంచ్ మేకల విఠల్ రావు హైకోర్టుకు వెళ్లాడు. రిట్ పిటిషన్ నెం : 13.275 / 2023. సదరు పిటిషన్ పై హైకోర్టు ఎన్ని రీచ్ లలో ఎంత మేరకు తవ్వకాలు జరుపుతున్నారు, ఏస్థాయిలో ఇసుక నిల్వలున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించి,ఇతరత్రా సమాచారం మొత్తం సేకరించి, న్యాయ స్థానం ముందు ఉంచాలని చెప్పింది.

జియో ట్యాగ్ ద్వారా పరిశీలించి, మైనింగ్, రెవెన్యూ, ఇతర శాఖలు, న్యాయవాదులు పరిశీలించి, లక్షా 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉందని తేల్చారు. వాస్తవంగా మరో ప్రైవేట్ పార్టీ ఇచ్చిన సమాచారంలో మాత్రం 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వినట్టు తేలింది. అనుమతి ఇచ్చింది 70వేల క్యూబిక్ మీటర్లకు అయితే, ఏ స్థాయిలో తవ్వారో చూడండి. ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నారో చూడండి.

అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినా అక్కడ ఇసుక తవ్వకాలు ఆపలేదు. చిత్తూరు జిల్లాలో అరణియార్ ప్రాజెక్ట్ లోకూడా అలానే తవ్వేస్తున్నారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే ఎన్జీటీ చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా తమ ఇసుకదోపిడీ ఆగదంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి నదీ పరీవాహకప్రాంతంలో ఎక్కడచూసినా ఇసుక ర్యాంప్ లే. గుంటూరుజిల్లాలోని రీచ్ లలో జరిగే తవ్వకాలకు అంతేలేదు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ రీచ్ నుంచి పక్కరాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్న అధికార పార్టీ నేతలు. నెల్లూలు జిల్లా గూడూరులో బెస్తపాలెం, కల్వకుంట పంచా యతీ దగ్గర పట్టపగలే వైసీపీవాళ్లు ఇసుక దొంగిలించుకుపోతున్నారు. పెన్నాలో ఇసుక దొంగలని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. విజయ నగరం జిల్లాలో తాగునీటి చెరువులు, ఊటబావుల్ని కూడా వదలడం లేదు. రాష్ట్రంలో కొన్ని వందల ఇసుక ర్యాంప్ లద్వారా ఇష్టమొచ్చినట్టు తవ్వకాలు జరుపుతున్నారు.

దొంగలు, దోపిడీదారుల్ని ప్రజాకోర్టులో శిక్షించేవరకు వదిలిపెట్టను

నాలుగున్నరేళ్లలో ఎంత ఇసుక తవ్వారు.. ఎంత అమ్మారు.. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఎక్కడైనా ఆన్ లైన్లో ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయా? ఏ రోజు ఎంత రీచ్ నుంచి ఎంత ఇసుక ఎవరు కొన్నారు… ఎంతజీఎస్టీ కట్టారు.. ఏ సంస్థ పేరుతో కట్టారో వివరాలు బయటపెట్టాలి. ప్రతినెలా మంజూరు చేసే బిల్లులు ఎవరు తీసుకుంటున్నారు?

రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇసుక స్టాక్ పాయిం ట్లు ఎన్ని? ఏ స్టాక్ పాయింట్ నుంచి ఎంత ఇసుకను ఎవరెవరికి అమ్మారు ? ఇప్పటికీ పాయింట్లలో ఎంతఇసుక నిల్వ ఉంది? ఎన్విరాన్ మెంట్ క్లియ రెన్స్ ఎన్ని రీచ్ లకు ఉంది? జగన్ రెడ్డి అతని గ్యాంగ్ ఇసుకదోపిడీకి కార్మికులు, ప్రజలు బలైంది నిజంకాదా? ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారు? ఎన్జీటీ ఆదేశాలే ఈప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టడంతో సమానం. వైసీపీ ఎమ్మెల్యేలు అందరినీ ఇసుక డీలర్లుగా మార్చి, హోల్ సేల్ దోపిడీకి తెరతీసింది నిజంకాదా?

నేను అడిగిన ప్రశ్నలకు 48 గంటల్లో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. స్పందించకపోతే ఈ ప్రభు త్వాన్ని వదిలిపెట్టను. దొంగలు, దోపిడీదారుల్ని ప్రజాకోర్టులో శిక్షించేవరకు వదిలిపెట్టను. ఇసుక ప్రజల సందప, దాన్ని కాపాడుకోవడానికి ప్రజలే పోరాడాలి. తేలుకుట్టిన దొంగమాదిరిగా ఎవరేం అడిగినా సిగ్గు లేకుండా, ఇష్టమొచ్చినట్టు చేసుకుంటూ పోతారా? ఒక్క ఇసుకలోనే నాలుగున్నరే ళ్లలో రూ.40వేలకోట్లు దోచేశారు. ఇతర దోపిడీల సంగతికూడా తేలుస్తా.

తప్పుచేసిన వాళ్లు ఎప్పటికైనా చట్టం ముందు దోషులే మైనింగ్, పోలీస్, విజిలెన్స్, ఏసీబీ విభాగాలు విఫలమైనందునే ఎన్జీటీ స్పందించింది. అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే దోపిడీకి పాల్పడితే, దానిపై చర్యలు తీసుకోవడానికి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. మైనింగ్ శాఖ ఎండీ ఎందుకున్నారో తెలియడం లేదు. డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చి, ఇష్టానుసారం తప్పుడుపనులు చేసి వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు. ప్రభుత్వం అనేది జవాబుదారీతనంతో ఉండాలి. రాష్ట్రాన్ని, తమను కాపాడమని ప్రజలు మిమ్మల్ని గెలిపించారు.

మేం ప్రశ్నించామని ఏవేవో చెప్పి ఇప్పుడు తాత్కాలికంగా తప్పించు కోవచ్చు. కానీ ఆధారాలు బయటపెట్టాక, దోపిడీని నిరూపించాక ఎక్కడికి పోతారు? ప్రజలసొమ్ము, ప్రకృతి సంపద దోచుకుంటేనే జగన్ కు నిద్రపడు తుంది. అలాంటి వ్యక్తికి సహకరిస్తూ తప్పుడు పనులు చేసే వారిని ఎలా వదిలిపెట్టం. తప్పుచేసిన వాళ్లు ఎప్పటికైనా చట్టం ముందు దోషులే… శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇసుకను రక్షించి, దానికి కాపలా కాయాల్సిన వాళ్లే దొంగలకు అండగా ఉంటూ వాళ్లను రక్షించే బాధ్యత తీసుకున్నారు.
మైనింగ్, పోలీస్, విజిలెన్స్, ఏసీబీ విభాగాలు ఫెయిల్ అయినందునే ఎన్జీటీ స్పందించింది. ఎన్జీటీ తీర్పుపై సిగ్గులేకుండా సుప్రీంకోర్టు వెళ్లారు. ప్రజాధనాన్ని ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో చూడండి. దోచుకుం టున్నది ప్రజలసొమ్ము. లాయర్లకు ఇస్తున్నది ప్రజలసొమ్ము.. ప్రజల చేతులతో వారి కళ్లే పొడుస్తున్నాడు. ఇదీ ఈ ముఖ్యమంత్రి నైజం.

విలేకరుల ప్రశ్నలకు చంద్రబాబు స్పందన

ఇసుకే కాదు..భూములు, గ్రానైట్, సిలికా, ఇతర ఖనిజసంపద అన్నీ ఊడ్చేస్తున్నారు. మద్యం పాలసీ ఏమిటి? దానిలో ఏంజరుగుతోంది? వీటి తో పాటు ఆస్తుల విధ్వంసాలు… లూఠీలు. పాదయాత్రలో మేం బహిరంగసభ పెడితే మాపైనే తప్పుడు కేసులు పెడతా రా? పాదయాత్రను అడ్డుకునేప్రయత్నం మీరుచేసి, మాపైనే 307 కేసులు పెడతారా? మేం మీటింగ్ లు పెట్టకూడదా? మమ్మల్ని, మాపార్టీనే కావు..
సమాజంలో ఎవరైనా అన్యాయం జరిగంది అంటే వారిపై కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు. నెల్లూరులో యానాదుల ఇళ్లు కూల్చారు. దానిపై జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తే బాధితులతో పాటు, అండగా నిలిచిన వారిని కూడా బెదిరిస్తారా? ఏమిటీ పైశాచకత్వం? లక్షలకోట్లు దోచేయ డం..అడ్డమొచ్చిన వారిని ఫినిష్ చేయడమే జగన్ రెడ్డి లక్ష్యం.

రాజకీయాలకు అనర్హుడు ఈ వ్యక్తి, ఇలాంటి వాళ్లను అసలు క్షమించకూడదు. దొంగ ఓట్లు చేర్పించడం, టీడీపీ సానుభూతిపరులు ఓట్లు తీసేయడం చేస్తున్నారు. దీనిపై కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాం. తిరుపతి ఉపఎన్నిక మొదలు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలవర కు వీళ్లు ఏంచేశారో చూశాం. తప్పులు వీళ్లు చేస్తూ, సిగ్గుఎగ్గూ లేకుండా మాపై నిందలేస్తున్నారు. ప్రభుత్వంలో ఉంది మీరా..మేమా? ఎవరు పనిచేస్తున్నారు..వ్యవస్థలు ఎవరికోసం పనిచేస్తున్నాయి. డ్రామాలన్నీ కట్టిపెట్టండి. ప్రజలు మీ బట్టలప్పి మిమ్మల్ని వీధుల్లో నిలబెట్టే రోజు వచ్చింది.

మా కార్యాలయంపై దాడి జరిగితే డీజీపీ ఇంతవరకు కేసు పెట్టలేదు. గంజాయిపై ప్రశ్నించామని దాడిచేస్తారా? ప్రతిపక్షపార్టీని లేకుండా చేస్తారా? ప్రశ్నించే మీడియాను చంపేస్తారా? ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలకోసం పనిచేయండి. ప్రభుత్వ యంత్రాంగం పద్ధతి ప్రకా రం పనిచేయాలి.. చేయకపోతే చేసేలా చేస్తాం ” అని చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రభుత్వం తీవ్ర అహంకారంతో వ్యవహరిస్తోందని….తెలుగు చిత్ర సీమ నటులను, దర్శకులను ఎలా అవమానించిందో చూశాం కదా అన్నారు.

నేడు జాతీయ అవార్డుల ద్వారా తెలుగు చిత్ర సీమ తన సత్తా చాటింది. అల్లు అర్జున్ ఉత్తమ నటునిగా అవార్డు పొందడం, ఆర్ ఆర్ ఆర్ సినిమాకు అవార్డులు రావడం గర్వించే విషయం. అలాంటి వారిని కూడా ఈ ప్రభుత్వం అవమానించింది అని చంద్రబాబు నాయుడు మండి పడ్డారు.

ఇకపోతే ఈనెల 28వ తేదీన తాను డిల్లీ వెళుతున్నానని…ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో ఓట్ల తొలగింపులో అక్రమాలపై విచారణ కోరుతాను అని చంద్రబాబు నాయుడు చెప్పారు.

LEAVE A RESPONSE