త్రిమూర్తులు కలిసి శత్రుసంహారం చేసి అమరావతి రాజధానిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఖాయం
-తెలంగాణలో కెసిఆర్, కేటీఆర్ ఓటమికి దుష్ట నాయకులతో చెలిమే కారణం
-ముఖ్యమంత్రి అజ్ఞానాన్ని ప్రజలు మన్నిస్తారు కానీ అహంకారాన్ని కాదు
-తెలంగాణలో బీ ఆర్ ఎస్ తరుపున సర్వేల నిర్వహణకు, మనీ కోఆర్డినేషన్ కు చెవిరెడ్డిని నియమించింది నిజం కాదా?
పోలింగ్ రోజు చేసిన చిలిపి నీటి యుద్ధాన్ని నల్లగొండ ప్రజలు పసిగట్టి 30 నుంచి 35 వేల మెజార్టీ రావాల్సిన చోట కాంగ్రెస్ అభ్యర్థులకు 50 వేల మెజారిటీ ఇచ్చారు
-ఐబీ సిలబస్ పేరిట విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేసి శత్రుసంహారాన్ని చేస్తాయి.., అమరావతి రాజధానిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్తాయానడంలో నాకు ఎటువంటి సందేహం లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు అన్నారు. తెదేపా, జనసేన ఇప్పటికే కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు, బిజెపి కూడా కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగి, ప్రస్తుత అధికార పార్టీ అక్రమాలాగాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మద్దతు ఎంతో అవసరమని ఆయన తెలిపారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అధికార పార్టీని చిత్తుచిత్తుగా ఓడించడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తో పాటు, ఆ పార్టీలకు సమృద్ధిగా ఉన్న ఓట్లు చాలు. కానీ ఎన్నికలు శాంతియుత వాతావరణం లో జరగాలంటే ఓట్ల బలమే కాదు, ఇతర బలం కూడా అవసరమన్నారు. ప్రస్తుతం జనసేన ఎన్డీఏ కూటమిలో కొనసాగుతోంది. బిజెపితో పవన్ కళ్యాణ్ స్నేహం బలంగా ఉంది. రాష్ట్రంలో తెదేపా, జనసేనల మధ్య మైత్రి బంధం దృఢంగా ఉంది. రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. ఈ మాటలు కొద్దిమందికి రుచించకపోవచ్చు.
రాబోయే మూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. నాలుగో నెలలో ఎన్నికలు పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుత పాలకులు అన్ని రంగాలలో సర్వనాశనం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఇక్కడ నెగ్గే పార్టీ మద్దతు కూడా ముఖ్యమే. రాష్ట్రంలో నెగ్గే పార్టీకి ప్రజలు బాగుండాలంటే, కేంద్రం సహకారం తప్పనిసరి కావాల్సిందే. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పటికే టీజర్ ద్వారా అర్థమయి పోయింది.
ఉత్తరాదిన బిజెపి ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం బిజెపి ఒప్పించే బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకుంటారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి అత్యవసరమైతే తప్పితే వెళ్లని దుస్థితి నెలకొంది. చెత్త మద్యాన్ని విక్రయిస్తూ లక్షలాది మంది ప్రజల మరణానికి ఈ ప్రభుత్వ పెద్దలు కారణ మయ్యారని ఆయన విమర్శించారు.
ఏపీతో పోలిస్తే కెసిఆర్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసింది
ఆంధ్ర ప్రదేశ్ పాలకులతో పోలిస్తే తెలంగాణలోని కెసిఆర్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. అభివృద్ధి లోనే కాకుండా, శాంతి భద్రతల పరిరక్షణలో, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కెసిఆర్ ప్రభుత్వం చక్కటి కృషి చేసింది. అయినా ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకత వల్ల తెలంగాణలో అధికార పార్టీ ఓటమిపాలయింది. ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చిన చోట ఆ పార్టీ విజయం సాధించింది.
వ్యక్తిగతంగా కెసిఆర్ పైన వ్యతిరేకత లేనప్పటికీ, కారణాలేవైనా కానీ ప్రజలు మార్పును కోరుకున్నారు. ప్రజలు కోరుకున్నట్టే ప్రభుత్వ మార్పు జరిగింది. అయినా 119 స్థానాలలో, అధికార బీఆర్ఎస్ 39 స్థానాలలో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గట్టిగా మార్పును కోరుకుంటున్నారు. ఎంత గట్టిగా అంటే 175 స్థానాలలో అధికార పార్టీకి 15 నుంచి 20 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
దుష్ట నాయకులతో చెలిమి వల్లే తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఓటమి
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటమికి దుష్ట నాయకులతో చెలిమే కారణమని నా భావన అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ దుష్ట చెలిమిని వ్యతిరేకిస్తూ ప్రారంభంలో బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా పోరాటం చేశారు. ఆ తరువాత అవిశ్రాంతంగా ఆ పోరాటాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించారు. స్టార్టింగ్ లో సంజయ్ గట్టిగా ఫైట్ చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి కూడా అంతకంటే గట్టిగానే తన పోరాటాన్ని కొనసాగించారు. ఇప్పుడు అవన్నీ కలిసి వచ్చాయి.
దుష్ట స్నేహితుల పనికిమాలిన సలహాలతో అహంకారం అధికమైందన్న భావన ప్రజల్లో వ్యక్తం అయింది. ఆంధ్ర రాష్ట్ర పాలకుల అహంకార పూరిత ఆలోచనల ప్రభావం తెలంగాణ పాలకులపై కూడా పడిందేమో తెలియదు. తెలంగాణలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. ధరణి లోపాలు కొంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు కారణమైతే అయి ఉండవచ్చు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యమంత్రి కేసీఆర్ చక్కటి కృషి చేశారు. కారణాలు ఏవైనా కానీ పాలకుల్లోకించిత్తు అహంకారం ఎక్కువైందని ప్రజలు భావించారు.
ముఖ్యమంత్రి అజ్ఞాని అయిన కూడా ప్రజలు మన్నిస్తారు కానీ అహంకారి అయితే అసలు మన్నించలేరు. అజ్ఞానంతో కూడిన అహంకారం అధికమైతే ప్రజలు అసలు సహించరు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్నది అదే. రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం పాలకులు చాలా దారుణంగా ఓడిపోతారని చెప్పడానికి నేను వెనుకాడను. తెలంగాణలో ప్రజలు ఎన్నికల ఫలితాలు చూశాక అంతానికి ఆరంభం అయ్యిందని ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు చెవిరెడ్డి అబద్దాలను చెబుతాడనుకోవడం లేదు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరిగా దైవ భక్తుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అబద్దాలను చెబుతాడని నేను అనుకోవడం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . తెలంగాణలో బిఆర్ఎస్ తరఫున సర్వే టీంల నిర్వాహనకు, మనీ కోఆర్డినేషన్ కు పనిచేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది నిజం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించాలని కోరారు. ఆయన ఏమి చెబుతారో చూద్దాం అన్నారు.
ఎన్నికల పోలింగ్ రోజున తుంటరి నీటి యుద్ధాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు గ్రహించారు. 30 నుంచి 35 వేల ఓట్ల మెజారిటీ వస్తుందనుకున్నచోట, వాళ్లతో కలిసి వీళ్ళు చేసిన తుంటరి నీటి యుద్ధాన్ని చూసి అసహ్యం వేసి, కడుపు మండిన ప్రజలు… ఇంత డ్రామా ఆడుతారా?, మేమైన వెర్రి పప్పల్లా కనబడుతున్నామా?, సెంటిమెంట్ గా ఫీల్ అయి ఓటు వేస్తామని అనుకుంటున్నారా? అని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
నువ్వే కదా వాళ్లను బలవంతంగా తీసుకువచ్చి నీళ్లను వదిలింది అంటూ ప్రశ్నించారు. ఈ డ్రామాలకు ముగింపు చెప్పాలని కాస్త అటు ఇటుగా ఉన్న వాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు 30 నుంచి 35 వేల మెజార్టీ రావలసినచోట యావరేజ్ గా 50 వేల మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ప్రజల్ని అమాయకులుగా భావించి చేసిన కుట్రలను జనం తిప్పి కొట్టారు. ఇన్నాళ్లు లేని నీటి సమస్య ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది. కనీసం నీళ్ల గురించి అడగలేదని వాటర్ బోర్డ్ అధికారులు కూడా చెప్పారు. అడిగిన మేరకు ఇప్పటికే విడుదల చేశామని స్పష్టం చేశారు. 5 టీఎంసీల నీళ్లను అడిగారు. అప్పుడెప్పుడో పంచేశాం .
అయినా అడగకుండానే అరువు దెబ్బలాట ఆడారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం నోరు విప్పలేదు. అక్కడి అధికారులు కూడా స్పందించలేదు. ఇదంతా డ్రామా అన్న సంగతి ప్రజలకు అర్థమయింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా తెలంగాణలో గెలుపుతో మీకు సంబంధం ఏమిటి అని షార్ట్ కట్ లో ఊపె కుహ అంటూ విమర్శలు చేయడం అవసరమా అంటూ ప్రశ్నించారు. ఊపె కుహ చేసింది మనం కదా అంటూ నిలదీశారు. బిజెపి విజయానికి మీరు ఎంతో సంతోషించినట్లు, బిజెపి మీకు కొమ్ముకాస్తున్నట్లు బిల్డప్పులు ఇచ్చారు.
ఈ విషయం జనాలకు అర్థం అయింది. తెలంగాణలో బిజెపి ఓటమికి కృషి చేశారని, బిజెపి నాయకులకు తెలియదని అనుకుంటున్నారా? తెలిసిపోయింది. ఒకవైపు బిజెపికి బంటులమని ఇన్ డైరెక్ట్ చెబుతూ, వారు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారని బిల్డప్ ఇస్తూ, తెలంగాణలో బారాసాకు భరోసా ఇచ్చారు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే బిజెపి నాయకత్వానికి ఈ డ్రామాలు తెలియవని అనుకుంటున్నారా?, ఒకవేళ తెలియకపోయినా … తెలియజేయడానికి నేనున్నానని రఘురామకృష్ణం రాజు చెప్పారు. ఇకనైనా పిచ్చిపిచ్చి ట్విట్లు ఆపేసి, పని చూసుకుంటే మంచిదన్నారు.
బిజెపి అగ్ర నేతలకు అభినందలు
మూడు రాష్ట్రాలలో విజయం సాధించడంతోపాటు, తెలంగాణలోను ఎనిమిది స్థానాలు గెలుచుకున్న బిజెపి అగ్ర నాయకులను కలిసి అభినందనలు తెలియజేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తెలంగాణలో 20 స్థానాలలో బిజెపి రెండవ స్థానంలో ఉందని, గెలుపు ఎవరిదైనా అభినందించడం మంచి సాంప్రదాయమని అన్నారు. తెలంగాణ ప్రాంతం లో గత 20 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సాధించలేనన్నీ సీట్లు ఇప్పుడు సాధించడం విశేష. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన పార్లమెంట్ సహచర సభ్యులు రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తో పాటు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు అభినందనలు. తెలంగాణలో 65 స్థానాలు గెలిచి విజయం సాధించడం మామూలు విషయం కాదన్నారు.
2025-26 నుంచి ఐబీ సిలబసట
ఇంగ్లీష్ లోనే కాదు స్పానిష్, చైనీస్ భాషలలో మాండలిన్ అనే డిఫరెంట్ మాడలికంలో విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 20 25- 26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ ప్రవేశపెడతారట అని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. కుదిరితే కిలికిలి భాషను కూడా ప్రవేశపెడతారేమోనంటూ అపహస్యం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐబీ సిలబస్ కలిగిన పాఠశాలలు మూడు నుంచి నాలుగు వేలకు మించి లేవు. కానీ రాష్ట్రంలో ని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఐబీ సిలబస్ ప్రవేశపెడతాననడం విడ్డూరంగా ఉంది. తొలుత సీబీఎస్ ఈ సిలబస్ ప్రవేశపెడతానని జగన్మోహన్ రెడ్డి పేర్కొనగా, 1000 పాఠశాలలో మాత్రమే సి బి ఎస్ సిఈ సిలబస్ అమలుకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తేల్చి చెప్పారు.
దీనితో సీబీఎస్ఈ సిలబస్ ను గాలికి వదిలేసి, ఇప్పుడు ఐబీ సిలబస్ ప్రవేశపెడతామని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఐబీ సిలబస్ బోధించడానికి అధ్యాపకులకు క్వాలిఫికేషన్ అధికంగా ఉండాలి, వారి జీతభత్యాలు కూడా లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. దేశం మొత్తం మీద ఒక విద్యా విధానం అమల్లో ఉంది. అది కాదని తనకు తోచినట్లుగా ఐడీ సిలబస్ ప్రవేశపెడతామంటే, ఐబీ సిలబస్ చదివిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఎలా అర్హత సాధిస్తారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మన రాష్ట్రంలో జీరో టీచర్ల రిక్రూట్మెంట్ ఉండగా, విద్యాశాఖ ను పర్యవేక్షిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ వేధింపులను తట్టుకోలేని అధ్యాపకులు నెత్తినోరు బాదుకుంటున్నారు.
విద్యావ్యవస్థకు ప్రవీణ్ ప్రకాష్ క్యాన్సర్ మాదిరిగా తయారయ్యారు. అయినా 2025- 26 లో ఐబీ సిలబస్ ప్రవేశపెడతానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, 2024 లోనే అధికారంలో నుంచి నిష్క్రమించనున్నారని గుర్తు చేశారు. నాడు నేడు పేరిట డబ్బులు కొట్టేశారు. బైజుస్ సంస్థ తో ఒప్పందం పేరిట కోట్ల రూపాయలను స్వాహా చేశారు. వారంటీ గ్యారెంటీ లేని ల్యాప్ టాప్ లను కొనుగోలు చేసి, అందులోనూ డబ్బు నొక్కేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసే విధంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఐబీ సిలబస్ ఏర్పాటు చేయాలనుకుంటే, దానికి తగ్గట్టుగా మౌలిక వసతులను అధ్యాపకులను ఏర్పాటు చేయాలి.
నాలుగు ఫ్యాన్సీ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టొచ్చని అనుకుంటున్నారు. వారిలో కొంతమంది తెలిసి తెలియని తనంతో జై కొడుతున్నారు. మంత్రులు, అధికారుల పరిస్థితి కూడా అదే. కనీసం ఒక్కరు కూడా ఇది తప్పని చెప్పేవారు లేకుండా పోయారు. నల్ల మందు పంచుతామంటే వెయ్యి మంది వస్తారు. 1000 మంది వస్తున్న రఘురామ కృష్ణంరాజు లాంటి వారు వ్యతిరేకిస్తున్నారని, ప్రజలను ఉసిగొలిపే ప్రయత్నం చేస్తున్నారు. అది వ్యవస్థకు ఎంతవరకు సమ్మతం. దీర్ఘకాలంలో ఎంత హానికరమనేది ఆలోచించి చెబుతుంటే, దానికి పెడార్ధాలు తీసి ప్రజలను గాలి మాటలతో మభ్యపెడుతున్నారన్నారు.
తటస్థంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల పట్ల తటస్థంగా వ్యవహరించారు.ఈ ఎన్నికలతో తనకు సంబంధం లేదని, మా రాష్ట్రాన్ని నేను చూసుకుంటానని ఆయన చెప్పకనే చెప్పారు. రాష్ట్రాన్ని ప్రస్తుత పాలకులు దారుణంగా దెబ్బతీశారని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఆయన స్వరాష్ట్రం పైనే దృష్టి పెట్టారన్నారు.