మోడీ హ్యాట్రిక్‌కు ఈ ఫలితాలు ఒక సంకేతం

– లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అధిక స్థానాలు సాధిస్తాం
– ఈ ఎన్నికల్లో సీట్లు-ఓట్లు పెంచుకున్నాం
– ఏపీలోనూ శరవేగంగా విస్తరిస్తాం
– ఆంధ్రాలో సీట్లు-ఓట్లు పెంచుకునే ప్రణాళిక అమలుచేస్తున్నాం
– కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి

కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్‌ సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి జోక్యం చెప్పారు. ఇటీవల జరిగిన వివిధ రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాలే దీనికి సంకేతాలని స్పష్టం చేశారు. ఈ ఫలితాలు పరిశీలిస్తే కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ సునామీలో కొట్టుకుపోవడం ఖాయమన్నది స్పష్టమవుతోందని చౌదరి విశ్లేషించారు. తెలంగాణలో తమ పార్టీ సీట్లు 3 నుంచి 8, ఓట్ల శాతం 7 నుంచి 13 శాతానికి ఎగబాకడం శుభశూచమన్నారు. 19 నియోజకవర్గాల్లో బీజేపీ రెండోస్థానంలో ఉన్న విషయాన్ని చౌదరి గుర్తు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అద్భుత విజయాలు సాధిస్తుందనడానికి ఈ గణాంకాలు ఒక నిదర్శమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి బీజేపీ కార్యకర్తకు, ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

వివిధ రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని వెల్లడించిన కొన్ని సర్వే ఫలితాలు తప్పని తేలిందని వ్యాఖ్యానించారు. సుపరిపాలన- సంక్షేమపథకాలు- అభివృద్ధి అనే మూడు సూత్రాలే బీజేపీ విజయానికి ప్రధాన కారణాలన్నారు. మోదీ పాలనకు విద్యాధికులు-యువత-మహిళ-తటస్థులు పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్‌ హయాం స్కాముల మయమైతే బీజేపీ పాలన స్కీములతో జనరంజకంగా సాగుతోందన్న భావనే బీజేపీ విజయసోపానాలకు కారణమని విశ్లేషించారు.

మోదీ ప్రధాని అయిన తర్వాతనే ప్రపంచంలో భారత్‌కు, విలువ-గౌరవం పెరిగిందన్న వాస్తవాన్ని అన్ని వర్గాలు గుర్తించాయన్నారు. తాజా ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే.. బీజేపీకి ఇప్పటి సీట్ల కంటే మరో 50 స్థానాలు అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

ఏపీలో కూడా శరవేగంగా పార్టీని విస్తరిస్తామని, ఆ మేరకు తగిన ప్రణాళికలను నాయకత్వం సిద్ధం చేస్తోందని చెప్పారు. జగన్‌ సర్కారును దించేందుకు తమ వద్ద తగిన వ్యూహాలున్నాయన్నారు. ఏపీలో కూడా కచ్చితంగా సీట్లు-ఓట్లు పెంచుకుంటామని చౌదరి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply