దేశం కోసం పోరాడిన దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ
– కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి
హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్‌ను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1951లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 విషయంలో అప్పటి ప్రధాని నెహ్రూ తాత్కాలిక ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టారు. పాకిస్థాన్‌కు కశ్మీర్‌లోని కొంతభాగాన్ని అప్పగించారు. తొలి కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. ఆర్టికల్ 370ను వ్యతిరేకిస్తూ కశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు.
దేశమంతా త్రివర్ణ పతాకం ఉండగా, కశ్మీర్‌కు మాత్రం మరో జెండా ఉండేది. దేశమంతా ఒక ప్రధాని ఉండగా, కశ్మీర్‌కు మరో ప్రధానమంత్రి ఉండేవారు. అంబేద్కర్ రాజ్యాంగం దేశవ్యాప్తంగా అమలవుతుంటే, జమ్ము కశ్మీర్‌లో మాత్రం ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హక్కులు ఉండేవి.
అప్పటి ప్రధాని నెహ్రూ స్వార్థపూరిత నిర్ణయాలతో దేశానికి నష్టం కలిగిందని శ్యామాప్రసాద్ ముఖర్జీ చెబితే, ఆయన మాటలను నెహ్రూ గారు పెడచెవిన పెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని, జమ్ము కశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగం చేయాలని శ్యామాప్రసాద్ ముఖర్జీ మొట్టమొదట ఉద్యమాన్ని చేపట్టారు.
జమ్ము కశ్మీర్ భారతదేశంలో ఒక అంతర్భాగమైతే, అక్కడ ప్రత్యేక ప్రధానమంత్రి, ప్రత్యేక హక్కులు, ప్రత్యేక అధికారాలు ఎలా ఉంటాయంటూ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రశ్నించారు. వీసా, పర్మిట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, జమ్ము కశ్మీర్‌లో అడుగుపెట్టారు. ఆయనతో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఉన్నారు.
దేశ ప్రజలను చైతన్యం చేయాలని, కశ్మీర్‌లో జరుగుతున్న అసమానతల గురించి తెలియజేయాలని శ్యామాప్రసాద్ ముఖర్జీ, వాజ్‌పేయి ని ప్రేరేపించారు. కాని, జమ్ము కశ్మీర్‌లో అడుగుపెట్టిన వెంటనే ఆయనను పర్మిట్ లేదన్న కారణంతో అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన జమ్ము కశ్మీర్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన హత్యేనన్న ఆరోపణలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ లక్ష్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019లో నెరవేర్చారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్ము కశ్మీర్‌లో దళితులకు, మహిళలకు దేశంలోని ఇతర ప్రాంతాలవారిలా సమాన హక్కులు కల్పించబడ్డాయి. ఆర్టికల్ 370 అమలులో ఉండగా 42 వేల మంది సైనికులు, పౌరులు జమ్ము కశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోయారు.
ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ వారిని పట్టించుకోలేదు. బడుగు బలహీన వర్గాలను వంచించింది.అక్కడ ప్రభుత్వాలు, కొంతమంది నాయకులు పాకిస్థాన్ ISI కు అనుకూలంగా వ్యవహరించారు. ఆనాడు జమ్ము కశ్మీర్ గోడలపై “ఓ దేశం కుక్కలారా, ఈ దేశం నుంచి వెళ్లిపోండి” అన్న రాతలు కనిపించేవి. దారుణ పరిస్థితులు ఉండేవి.
అలాంటి సమయంలో జాతీయ పతాకాన్ని లాల్ చౌక్‌లో ఎగురవేయడానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏక్తా యాత్ర నిర్వహించారు. నరేంద్ర మోదీ కన్వీనర్‌గా వ్యవహరించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. ఆర్టికల్ 370 రద్దు తరువాత లాల్ చౌక్‌లో జాతీయ పతాకం అధికారికంగా ఎగురవేయబడింది.
ఈ రోజు 14 కోట్ల మంది బిజెపి లో సభ్యులుగా ఉన్నారు. ఆయన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన చూపిన మార్గంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.