* ఎన్నికల్లో ప్రజలు వాతలు పెట్టినా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు
* వంశీ అరాచకాలను ప్రశ్నించిన మా పార్టీ బీసీ నాయకుడు దొంతు చిన్నాపై వైసీపీ మూకలు దాడి చేస్తే దానిపై ఫిర్యాదు చేసేందుకు నేను పోలీసు స్టేషన్‌కు వెళ్ళాను
* కర్రలు, రాడ్లు, పెట్రోల్ సీసాలతో నన్ను చంపేందుకు జగన్ రెడ్డి గూండాలు ప్రయత్నించారు
* తొట్లవల్లూరు పీఎస్‌ను ఖాళీ చేయించి జగన్ రెడ్డి ప్రైవేట్ గూండాలను పంపి నాపై దాడి చేయించిన జగన్ రెడ్డి నేడు మూడు సింహాల గురించి మాట్లాడడం హాస్యాస్పదం
* దళిత యువకుడు సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేసినట్లు సీసీ ఫూటేజ్‌తో రుజువు చేశాం. దీనిపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి
– స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం
అమరావతి: దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి, తప్పుడు వాగ్మూలం ఇచ్చేలా ప్రేరేపించిన వంశీని జగన్ రెడ్డి పరామర్శించడం సిగ్గు చేటు అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం మండిపడ్డారు.
మంగళవారం టీడీపీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశాంలో ఆయన మాట్లాడుతూ….”అరాచకవాదితో ములాఖత్ అయ్యి బయటకు వచ్చి మీడియాతో పచ్చి అబద్ధాలాడాడు. ఐదేళ్లు నిస్సుగ్గుగా అబద్ధాలాడారు కాబట్టే ఎన్నికల్లో వైసీపీనీ 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రజలు వాతలు పెట్టినా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా అవే అబద్ధాలు అల్లుతున్నాడు. గన్నవరంలో ఫిబ్రవరీ 20, 2023 జరిగిన సంఘటనను పూర్తిగా వక్రీకరించి, అవాస్తవాలను జోడించి ప్రజలను తప్పుదారి పట్టించాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు.
అకారణంగా నేను గన్నవరం వెళ్ళి, వందలమంది కార్యకర్తలను వెంటేసుకొని గన్నవరం వైసీపీ కార్యాలయంపై దాడికి వెళ్ళినట్లు జగన్ రెడ్డి కళ్లబొల్లి కబుర్లు చెప్తున్నాడు. వంశీ అరాచకాలను ప్రశ్నించిన మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడు దొంతు చిన్నా గారి ఇంటిపై ఫిబ్రవరీ 20, 2023 ఉదయం దాడి చేసి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. మా పార్టీ బీసీ సోదరుడికి అండగా నిలబడేందుకు వైసీపీ మూకల దాడిపై ఫిర్యాదు చేసేందుకు నేను, ప్రస్తుత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, దొంతు చిన్న గారిని వెంటబెట్టుకొని పోలీసు స్టేషన్‌కు వెళ్ళాం. బీసీలకు రక్షణగా నిలిబడేందుకు వెళ్ళాం” అని తెలిపారు.
పోలీసుల కర్తవ్యం, శాంతి భద్రతలు గురించి జగన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం…
“వైసీపీ హయాంలో ఫిర్యాదు చేసినా నేరమే. గన్నవరంలో వల్లభనేని వంశీ చేసిన అరాచకాలు, మా యువనాయకుడు లోకేష్ గారిపై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నాడు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి వంశీ చెడ్డ పేరు తీసుకువచ్చాడు. గొప్ప గొప్ప వ్యక్తులు పెట్టిన ఉమ్మడి కృష్ణా జిల్లాను అరాచకాలు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మరుస్తుంటే వాటిని అడ్డుకునేందుకు నేను గన్నవరం వెళ్ళాను. వందలమందితో నేను వైసీపీ కార్యాలయంపై దాడికి వెళ్ళానని జగన్ రెడ్డి అంటున్నాడు… మా కార్యాలయంపై దాడి జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. వారి కార్యాలయంపై నేను దాడికి చేసినట్లు చిన్న మట్టిగడ్డనైనా ఎందుకు చూపించలేదు?
కర్రలు, రాడ్లు, పెట్రోల్ సీసాలతో నాపై జగన్ రెడ్డి మూకలు నన్ను చంపే ప్రయత్నిం చేశారు. నా బాడీగార్డ్స్ నన్ను రక్షించారు. మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టి వేధించారు. అక్కడనుంచి నేను బయటపడితే పోలీసులు నన్ను అదుపులోకి తీసుకొని తొట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. జగన్ రెడ్డి పథకం ప్రకారం స్టేషన్‌లో కరెంట్ కట్ చేయించి స్టేషన్‌ను ఖాళీ చేయించి జగన్ రెడ్డి ప్రైవేట్ గూండాలను పంపి నాపై దాడి చేశారు. థర్డ్ డిగ్రీ టార్చర్‌కు వేదికగా పోలీస్ స్టేషన్‌లను జగన్ రెడ్డి మార్చాడు.
టీడీపీ మహిళా నాయకురాలు కళ్యాణిపై అక్రమ కేసులు బనాయించి ఇంటికెళ్ళి మహిళ అని కూడా చూడకుండా దుస్తులు మార్చుకోనివ్వకుండా ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి వేధించారు. జగన్ రెడ్డి అతిక్రమించిన చట్టం లేదు. నేడు మూడు సింహాలు, పోలీసుల కర్తవ్యం, చట్టాలు, శాంతి భద్రతలు గురించి జగన్ రెడ్డి పాఠాలు చెప్తున్నాడు” అని అన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలపై జగన్ రెడ్డి దమనకాండ…
“గన్నవరం సంఘటన జరగకముందే దాదాపు 30 బీసీ నాయకులను జగన్ రెడ్డి పొట్టనబెట్టుకున్నాడు. నడి రోడ్డున అతికిరాతకంగా తోట చంద్రయ్య పీక కోసి చంపిన మాట వాస్తవం కాదా? నందం సుబ్బయ్య, డా.సుధాకర్, డా.అనితా రాణి వంటి వారిని పొట్టనబెట్టుకున్నాడు. జగన్ రెడ్డి హయాంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలను ఊచకోత కోశాడు. వారికి అండగా నిలబడాలని చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి హయాంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా ఎవరు నిలబడినా వారిని నేరస్తులుగా జగన్ రెడ్డి ముద్రించాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వారికి అండగా నిలబడ్డాడు.
దళిత బిడ్డ వరప్రసాద్‌కు శిరోముండనం చేశారు. ఇన్ని రకాలుగా జగన్ రెడ్డి వేధించారు. నేడు దళిత వర్గానికి చెందిన యువకుడిని కిడ్నాప్ చేసి వేధించిన వ్యక్తిని పరామర్శించేందుకు జగన్ రెడ్డి వెళ్ళాడు. బలహీన వర్గాల వారిపై ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా.. దళిత బిడ్డలను ఎవరు కిడ్నాప్ చేసినా నేను తోడు ఉంటాననే మెసేజ్ ఇవ్వడానికా జగన్ రెడ్డి నువ్వు ములాఖత్ అయ్యింది?” అని ప్రశ్నించారు.
దళిత బిడ్డను కిడ్నాప్ చేసి, తాను ఉంటున్న ఇంటికే తీసుకువెళ్ళిన సీసీ ఫుటేజ్‌ను విడుదల చేశాం. ఇప్పుడు వంశీ ఉత్తముడని, ఏ పాపం తెలియదని జగన్ రెడ్డి చెప్పగలడా? దళితులపై దాడులు జరుగుతుంటే చూస్తే ఉండే ప్రభుత్వం కాదు. బీసీలు, దళితులపై చిన్న గీత పడినా ఉపేక్షించేది లేదు. ఈ క్రమంలోనే వంశీని అరెస్ట్ చేశాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.