• జనసేన నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కిశోర్ గునుకుల
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం భరించలేకే పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా నాయకుడు కిషోర్ గునుకుల మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే.. ఒక్కొక్క రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున పవన్ కళ్యాణ్ గారు సాయంగా అందించి ఆదుకుంటున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని ప్రగల్భాలు పలకడం కాదు.. .చేతనైతే ఈ మూడు వేల మందికి ప్రభుత్వం ఇస్తామన్న ఏడు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.
సోమవారం నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ… “వ్యవసాయం అంటే మీకు తెలుసా? అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడారు. ఆయనను జనసేన తరఫున ప్రశ్నిస్తున్నాము. 8 ఏళ్లుగా సర్వేపల్లి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీకు రైతులుపడుతున్న ఇబ్బందులు గురించి తెలుసా? గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారనే విషయం మీకు తెలుసా? సర్వేపల్లిలో భూగర్భ జలాలు దోపిడికి గురవుతున్నాయని తెలుసా? థర్మల్ పాంట్ల పేరుతో నెల్లూరు జిల్లాను రేడియేషన్ కు గురి చేస్తున్నారని మీకు తెలుసా?
మీకు దమ్ముంటే రైతు భరోసా కేంద్రాలు ద్వారా ఎంత మంది రైతుల దగ్గర ధాన్యాన్ని సేకరించారో వివరాలు మీడియా ముఖంగా విడుదల చేయగలరా? రైతుల కష్టాలు తెలియని కాకాణి రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి కావడం రాష్ట్ర దౌర్భాగ్యం. సాగు నష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే వాళ్లకు ఆర్ధిక భరోసా కల్పించడానికి పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి వాళ్ల కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధిక సాయం చేస్తుంటే .. ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయట పడతాయనే భయంతో విమర్శలు చేయడం సిగ్గుచేటు” అన్నారు.