ఆపదలో ఉన్నవారికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్

• గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిని అమ్మేస్తున్నాడు
• జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కోన తాతారావు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనలకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేని స్థితిలోకి సిబిఐ దత్తపుత్రుడైన రాష్ట్ర ముఖ్యమంత్రికి నిద్ర కూడా పట్టడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కోన తాతారావు వ్యాఖ్యానించారు. కౌలు రైతు కుటుంబాలలో భరోసా నింపేందుకే పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు… దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందనతో వైసీపీ పునాదులు కదులుతున్నాయి అన్నారు. దిక్కు తోచని స్థితిలో మంత్రులతో వ్యక్తిగతంగా దూషణలు చేయిస్తున్నారు అన్నారు.

కోన తాతారావు సోమవారం ఉదయం విశాఖపట్నంలో విలేకర్లతో మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు.. ఆపదలో ఉన్నవారికీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు తప్ప … ముఖ్యమంత్రిలా సీబీఐకో, చంచల్ గూడ జైలుకో దత్తపుత్రుడు కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ చరిత్ర ఏమిటో మాకు బాగా తెలుసు అని చెప్పారు. ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు… ఆయన తల్లి తెలుగుదేశం నుంచి పోటీ చేశారు… అమర్నాథ్ కూడా తెలుగుదేశం నుంచే వచ్చారు… ఈ వాస్తవాలు అందరికీ తెలుసు అన్నారు.

అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసు అనే సామెతను గుర్తుపెట్టుకోవాలని అమర్నాథ్ కి హితవు పలియకరు. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని పరిస్థితి ఇప్పుడు ఏంటో తెలుసుకొని హుందాగా మాట్లాడాలని సూచించారు. పరిశ్రమల శాఖను పవన్ కళ్యాణ్ పై విమర్శల శాఖ అని మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అనకాపల్లిని అందాలపల్లిగా మారుస్తానని చెప్పి.. సుగర్ ఫ్యాక్టరీని అమ్ముకొని అమ్మకాలపల్లిగా మార్చింది మరిచిపోయారా అని విమర్శించారు. గుడివాడ అమర్నాథ్, బొత్స బంధువు కలిసి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు అన్నారు. ఈ సమావేశంలో సుందరపు విజయ్ కుమార్, ఉషా కిరణ్, డా.బొడ్డేపల్లి రఘు, భీశెట్టి వసంత లక్ష్మి పాల్గొన్నారు.