Suryaa.co.in

Telangana

విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే

-అంతిమ యాత్ర పేరుతో కేంద్ర సంస్థలపై టీఆర్ఎస్ దాడులు
-కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా విధ్వంసం
-కాల్పులు జరిపింది రాష్ట్ర పోలీసులే… అయినా కేంద్రంపై బురద చల్లడం సిగ్గచేటు
-ఆర్మీ అభ్యర్థులారా… తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.. మీకు న్యాయం జరుగుతుంది
-మీ జీవితాలతో చెలగాటమాటే రాజకీయ శక్తుల కుట్రలను చేధించండి
-అగ్నిపథ్ గొప్ప స్కీం… ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోండి
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
-ఉమ్మడి కరీంనగర్ జిల్లా శక్తి కేంద్ర ఇంఛార్జీల సమావేశంలో బండి సంజయ్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జరిగినదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుండే విధ్వంస కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ విధ్వంసం వెనుక సీఎం స్ట్రాటజిస్టు పథక రచన ఉందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని… అయినా కేంద్రాన్ని బదనాం చేయడం సిగ్గు చేటన్నారు. పోలీసుల కాల్పుల్లో మంత్రి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో ఈరోజు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలు విధ్వంసం సృష్టించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు.

ఆర్మీ అభ్యర్థులతోపాటు ప్రజలంతా వాస్తవాలు గమనించి కుట్రలను చేధించాలని కోరారు. ఈరోజు కరీంనగర్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శక్తి కేంద్ర ఇంఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) మంత్రి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, బొడిగె శోభతోపాటు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, వచ్చేనెల 3న హైదరాబాద్ లో జరగబోయే బహిరంగ సభకు జన సమీకరణ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని భరోసా ఇచ్చేందుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడి నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే నెల 3న హైదరాబాద్ లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటుదాం. రాష్ట్రంలో మరే పార్టీ చేయలేనంతగా జనసమీకరణ చేసి చరిత్ర సృష్టిద్దాం.

తెలంగాణలో విచిత్రమైన పరిస్థతి. బీజేపీని పదేపదే అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ ను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తారు.. హైదరాబాద్ లో మా తడాఖా చూపిస్తామని ముందే కాంగ్రెసోళ్లు హెచ్చరించి ‘చలో రాజ్ భవన్ ’ పేరుతో విధ్వంసం స్రుష్టించారు. పోలీసులకు సమాచారం ఉన్నా ముందస్తుగా అరెస్ట్ చేయరు… బీజేపీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి… బీజేపీని డామేజ్ చేసి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని సీఎం కేసీఆర్ నీచమైన కుట్రకు తెరదీసిండు.

కేసీఆర్ దేశమ్మీద పడి తిరిగితే.. కాబోయే సీఎం ఎవరు అనే దానిపై టీఆర్ఎస్ లో గొడవలు మొదలైనయ్. తదుపరి సీఎం కేటీఆరా? హరీషా? కవిత ? సంతోషా అనే కొట్లాట మొదలైంది. ఎవరిని సీఎంను చేసినా టీఆర్ఎస్ చీలిపోవడం ఖాయమనే భావన టీఆర్ఎస్ నేతలకు వచ్చింది. ఇప్పటికే టీఆర్ఎస్ గ్రాఫ్ 30 శాతానికి పడిపోయింది. దీనికితోడు ట్రిపుల్ ఐటీ, గౌరవెల్లి నిర్వాసితులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల విషయంలో చర్చ జరగకుండా ప్రజలను దారి మళ్లించేందుకు ‘అగ్నిపథ్’ పేరుతో విధ్వంసానికి కేసీఆర్ నీచమైన కుట్ర చేస్తుండు..
అగ్నిపథ్ ఒక గొప్ప పథకం… 17.5 సంవత్సరాల నుండి 23 ఏళ్ల వయసున్న యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు అగ్నిపథ్ స్కీంను ప్రవేశపెట్టారు. గతంలో వెయ్యి మంది దరఖాస్తు చేసుకుంటే కొద్ది మందిని మాత్రమే సెలెక్ట్ చేసేవాళ్లు. కానీ ఇకపైమ దరఖాస్తు చేసుకున్న వారందరినీ దాదాపు అగ్నివీరులుగా గుర్తించి 6 నెలల పాటు శిక్షణ ఇస్తారు. తొలి ఏడాది 30 వేల నుండి జీతం మొదలవుతుంది. నాలుగేళ్లపాటు అగ్నివీరులుగా కొనసాగే అవకాశం వచ్చింది.

అట్లాగే జీతంలో 70 శాతం నగదు అగ్ని వీరులకు అందజేస్తారు.. మిగిలిన మొత్తం కార్పస్ ఫండ్ కు జమ అవుతుంది. నాలుగేళ్ల తరువాత వంద మందిలో 25 శాతం మందిని సెలెక్ట్ చేసి ఆర్మీలో చేర్చుకుంటారు. మిగిలిన వాళ్లకు కార్పస్ ఫండ్ పేరిట 5 లక్షలతోపాటు కేంద్రం మరో 5 లక్షలు, మరో లక్ష వడ్డీ కలిపి మొత్తం 11 లక్షల రూపాయలు అందజేస్తారు. అట్లాగే ఇకపై జరిగే ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్ కోటాను ప్రకటించారు. 4 ఏళ్లపాటు ఉద్యోగం చేసే సమయంలో 48 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. దీనికితోడు అదనంగా మరో 44 లక్షల రూపాయలు కేంద్రం ఇస్తోంది. ఈ సర్వీసులో అంగవైకల్యం కలిగితే కూడా పరిహారం అందజేస్తుంది.

ఇంత గొప్ప స్కీం అగ్నిపథ్.. నిరుద్యోగిగా ఉంటే ఏం వస్తది? ఆర్మీలో పనిచేస్తే గౌరవం, దేశభక్తి పెరుగుతుంది. అగ్నిపథ్ లాంటి పథకాలు చాలా దేశాల్లో అమలు చేస్తున్నారు. ఈ పథకంపై ఏమైనా అనుమానాలు, అపోహలుంటే నివ్రుత్తి చేసుకోవాలే తప్ప విధ్వంసాలు పాల్పడమేంది?.
ఆర్మీ అభ్యర్థులారా… మీకు న్యాయం జరగుతుంది. వాస్తవాలు తెలుసుకోండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్నరు. వారి వెనుక నుండి ఎవరో రాళ్లు రువ్వి విధ్వంసం స్రుష్టించారు. అత్యంత పటిష్టంగా ఉన్న సికింద్రాబాద్ కాంపౌండ్ వాల్ ను కూల్చేశారు. పెట్రోల్ బాటిళ్లు, రాళ్లు, రాడ్లతో వచ్చారంటే అదెలా సాధ్యమైంది?

బీజేపీ నాయకులు చిన్న మీటింగులు పెట్టినా, ధర్నాలు చేసినా ఇంటెలిజెన్సుకు తెలుస్తుంది? కానీ వందల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గుమిగూడి విధ్వంసం స్రుష్టిస్తే ఆ సమాచారం ఎందుకు రాలేదు? నిజానికి ఇంటెలిజెన్స్ కు ముందే ఈ సమాచారం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహం, సహకారంతోనే విధ్వంసానికి కుట్ర జరిగింది.శాంతి భద్రతలు కాపాడాల్సిన రాష్ట్ర పోలీసులు కాల్పులు జరపడంవల్లే వరంగల్ జిల్లా యువకుడు చనిపోయాడు. మేం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కేంద్రాన్ని బదనాం చేయడం సిగ్గు చేటు. విధ్వంసం చేసినోళ్లు పారిపోయేలా చేసిన పోలీసులు… అమాయకులైన ఆర్మీ అభ్యర్థులను మాత్రం సాయంత్రం పొద్దుపోయే వరకు అక్కడే ఉంచారు. ట్విట్టర్ మంత్రో.. మరోకరో ఆదేశించే వరకు ఖాళీ చేయించలేదు.. అంతా అయిపోయాక రాత్రి సీఎం నిద్రలేని స్పందించడం విడ్డూరం.

ప్రభుత్వం ఉద్యోగాలివ్వకపోవడంల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో తీసి సునీల్ నాయక్ చనిపోయారు. ఆర్టీసీ కార్మికులు, రైతులు, 317 జీవో వల్ల ఉద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వాళ్ల అంతిమ యాత్ర కూడా చేయనియ్యని దుర్మార్గుడు సీఎం కేసీఆర్… ఈరోజు కాల్పుల్లో మ్రుతి చెందిన యువకుడు రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో టీఆర్ఎస్ నేతలు కేంద్ర సంస్థలపై దాడులు చేసి విధ్వంసం చేస్తుండటం సిగ్గు చేటు.

ఇదంతా ప్రీ ప్లాన్ గా సీఎంఓ నుండి జరుగుతున్న కుట్ర. బీహార్, ఉత్తరప్రదేశ్ లో కూడా కేసీఆర్ లాంటోళ్లే దాడులు చేస్తున్నరు. వీరందరికీ ఓ స్ట్రాటజిస్ట్ ఉన్నడు. దేశంలో మంచి చేయడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి స్ట్రాటజిస్టు ఉండాలి. కానీ అందుకు భిన్నంగా బీజేపీని ఎట్లా బదనాం చేయాలి.. కేంద్రంపై ఎట్ల బురద చల్లాలనే కుట్రతో స్ట్రాటజిస్టులు ఇట్లాంటి విధ్వంసానికి పథక రచన చేస్తుండటం సిగ్గు చేటు. ఆర్మీ అభ్యర్థులు, యువకులు, ప్రజలంతా టీఆర్ఎస్ కుట్రలను గమనించడంతోపాటు అలాంటి వాళ్ల సంగతి చూడాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE