Suryaa.co.in

Andhra Pradesh

భవిష్యత్తులో నెల జీతాలు చెల్లించడం కూడా కష్టమే

– బిజెపి నేత ఐ వై ఆర్ కృష్ణా రావు
ఏపీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆందోళనరకంగా ఉందని బీజేపీ నేత, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో నెలవారీ జీతాలు కూడా ఇవ్వడం కష్టమేనన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యక్తిగత ఇమేజ్ కోసం లక్షల కోట్ల రూపాయలు పంచుతూ పోతే పంచడానికి మిగలదు. చంద్రబాబు,జగన్ చేసిన అప్పులు 5 లక్షల కోట్లకు చేరాయి.కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని అందకునే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు. బడ్జెట్ మొత్తం తాయిలాలకు సరి పోతుంటే మౌలిక సదుపాయాల మాటేమిటి? రోడ్ల దుస్థితి,ఆస్పత్రుల్లో కుట్లు వేయడానికి దారం కూడా లేని పరిస్థితి ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతుంది. రాష్ట్ర బడ్జెట్లో పెన్షన్లు జీతాల అప్పుల పై వడ్డీలు చెల్లించేందుకు 35% సరిపోతుంది. భవిష్యత్తులో నెల నెల జీతాలు చెల్లించడం కూడా కష్టమే.
ఇప్పటికే ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, స్టీల్ అప్పు గా ఇవ్వాలని అడుగుతున్న అధికారులు, ఇకపై తమ నెలవారీ సరుకులు కూడా అప్పుగా తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చెప్పినవన్నీ చేయడానికి ప్రభుత్వం దగ్గర మంత్రదండం గాని అల్లావుద్దీన్ అద్భుతదీపం గాని లేవని గ్రహించాలి. సంక్షేమ పథకాలకు ఖర్చు చేయటం తప్పు కాదు. .కేంద్రం ప్రభుత్వ తరహాలో బడ్జెట్లో 10 శాతానికి మించకుండా పథకాలకు ఖర్చు చేయవచ్చు. రాష్ట్రంలో ఉన్న దారుణ ఆర్థిక పరిస్థితి ప్రజలు గమనించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోతుంది.

LEAVE A RESPONSE