గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవల్సి వస్తోంది

* రోడ్లు ఈత కొలనులను తలపిస్తున్నాయి
* రోడ్ల దుస్థితి తెలిపేలా #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్

రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒకటీఅరా గోతులు కనిపించడం సహజం. కానీ మన రాష్ట్రంలో మాత్రం గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవలసిన పరిస్థితి నెలకొంది. కొన్ని రహదారులను చూస్తుంటే ఏకంగా స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయి. రోడ్ల అభివృద్ధి, కనీసం మరమ్మతులు చేయాలనే బాధ్యతను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. వారికి బాధ్యత గుర్తు చేయాలనే #GoodMorningCMSir అనే హాష్ ట్యాగ్ తో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తోంది. జులై నెల 15 నాటికల్లా దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేసి ప్రతిపక్షాల నోరు మూయిస్తామని ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ను స్వీకరించి రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టాం. దెబ్బ తిన్న రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని #JSPForAP_Roads అనే హాష్ ట్యాగ్ తో గత ఏడాది సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేశాం.

* పందుల కోసం రోడ్లు వేయడం మానేశారు
ఆర్ అండ్ బి పరిధిలో స్టేట్ హైవేలు 14,722 కి.మీ, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 32,240 కి.మీ, ఇతర రోడ్లు 6100 కి.మీ ఉన్నాయి. ముఖ్యంగా 9,222 కి.మీ పంచాయతీ రోడ్లు మరమ్మతుల కోసం రూ.1,072 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ప్రకటించింది. దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరో రకంగా ఉంది. రోడ్లపై పందులు స్వైర విహారం చేస్తున్నాయి. మూగ జీవాలు కదా.. వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో ఏమోగానీ వైసీపీ నాయకులు రోడ్లు వేయడం మానేశారు.

* ఆ నిధులు ఎటు పోతున్నాయ్…?
ఏటా కనీసం 8 వేల కిమీ రోడ్లు మెయింటినెన్స్, మరమత్తు పనులు చేయాలి. ఇందుకోసం దాదాపు రూ.1500 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇది కాకుండా పీరియాడికల్ మెయింటినెన్స్, రిపేర్లు చేయాలి. ఇందుకోసం మరో రూ.500 కోట్లు అదనంగా అవసరం ఉంటుంది. నాన్ ప్లాన్ బడ్జెట్లో చూపిస్తారు. అయితే దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టడం మానేసింది. ఈ మూడేళ్లలో మెయింటినెన్స్, మరమత్తు పనులు చేయకపోవడంతో రహదారులు చాలా వరకు దెబ్బ తిన్నాయి. 30 వేల కిమీ మేర రోడ్లు కనీస మరమ్మతులకు నోచుకోలేక గుంతలమయంగా మారింది. మూడేళ్లుగా పట్టించుకోకపోవడంతో చాలా వరకు కొత్తగా రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉంది. మరమ్మతులకే నిధులు లేక రోడ్లను గాలికొదిలేసిన ప్రభుత్వం.. కొత్త రోడ్లు వేయడం అంటే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులరీత్యా అసాధ్యమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు కనీస మరమ్మతులు, ఒక లేయర్ వేసి కాస్త ప్రయాణానికి తగ్గ విధంగా చేయాలంటే దాదాపు రూ.7 వేల కోట్లు అవసరమని అంచనా. 8 వేల కిమీ రోడ్లు మెయింటినెన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2100 కోట్లు అప్పు తెచ్చారు. వాటితో రిపేర్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. రోడ్లు నిర్వహణ కోసం అని పెట్రో సెస్ వసూలు చేస్తున్నారు. ఇది రూ.750 కోట్ల మేర ఏటా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియడం లేదు.

* నేను పాల్గొంటున్నా… మీరూ పాల్గొనండి
అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు రోడ్లు అవసరం లేదు అనే ఆలోచన విధానంతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో తెలియజేయడం కోసం #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. మీ ఊళ్ళో, మీ చుట్టు పక్కల రోడ్లు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో.. ఆ రోడ్డు మీద వెళ్లేందుకు ఎంత ప్రయాస పడాల్సి వస్తోంది అనేది చెప్పే ఫోటోలు, వీడియోలు తీయండి. వాటిని #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయండి. ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో నేను కూడా పాల్గొంటాను. మీరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Leave a Reply