ఇలాంటి ఓ రాకుమారుడు నిజంగా ఉన్నాడా..
నలుగురు దేవకన్యలను
పరిణయమాడాలన్న కోరిక..
అందుకోసం రాజ్యం విడిచి..
మాత పాటతో లోకమాతనే
ప్రసన్నం చేసుకుని..
కొలను చేరి..
చీర అపహరించి
ఒకరి వెంట ఒకరిని మనువాడిన
సౌందర్య పిపాసి..
తానుగా అద్భుత రూపసి..
నిజంగా ఉన్నాడా..
ఉంటే అతగాడి పేరు
జగదేక వీర ప్రతాపుడా
నందమూరి
తారక రామారావా!
జగదేకవీరుని కథ..
ఓ ఫాంటసీ..
అపురూపమైన
విజయా వారి లెగసీ..
ఒకనాటి రాకుమారులనే
మించిన ఎన్టీఆర్ రూపం
దేవకన్యల
హొయలు రొయలు
ఇంద్రకుమారి సరోజ..
నాగకుమారి విజయలక్ష్మి
వరుణకుమారి జయంతి
అగ్నికుమారి బాల..
నలుగురూ వరించి వచ్చిన మానవవీరుడి కోసం
విచారపడుతూనే..
ప్రధాన నాయకి జయంతి
నవసుందరున్ని మొదటగా
మనువాడిన వైనం..
మెచ్చినాములే..!
అయినదేమో
అయినది అంటూ
ఇంద్రకుమారిని మెప్పించి..
ఏకో అనేకో హమస్మితో
మనోహరముగా
మధురమధురముగా మనసులు కలిసినవి
మనువులు కుదిరినవి..
ఇలా నాగకుమారినీ మురిపించి..
త్రిశోక మహారాజు..
బాదరాయన ప్రగ్గడ
కనులు కుట్టగా
ఆయన అతిధ్యంలోనే ఉంటూ
వైవిధ్యంగా వారుణిని.. మరీచిని చేబట్టి
తన కథను పురాణంగా మార్చుకున్న ప్రతాపుడు
నిజంగా ఎన్టీవోడు
బహురూపుడు..
అతి సుందరుడు..!
రాణి కావాలన్న ఏకాశ సోస
వలచిన చిన్నదానితో మనువు
పనిలో పనిగా
ఓ చిన్న రాజ్యం
రెండుచింతల ఘోష..
రాజా..మీ ఉప్పు తిన్నవాన్ని
పాతమంత్రి ఆక్రోశం..
కొత్త కంత్రి
బాదరాయనుడి తెలివి..
రేలంగోడి గెలివి..
అరలో మర..మరలో అర
గుట్టు కోసం అన్నగారి వెంట దారి తప్పకుండా
అగ్నిగుండంలో దూకి
యమగండం..
నిజంగా కెవిరెడ్డి దర్శకత్వ ప్రతిభ అండపిండ బ్రహ్మాండం!
రాజన్ శృంగార వీరన్
మత్తెక్కించే కొత్తపిలుపు..
పాత మంత్రి హితవు పట్టించుకోక ఉప్పేం ఖర్మ
పంచదారే తినండంటూ
తానే హితవు
పలికిన మైమరపు..
ఒక్కోసారి ఒకో జబ్బు
రోగమెంత ప్రచండమో
అంతకు మించి చండ ప్రచండమైన మందు..
ప్రతాపుడికి మరో
సుందరి పసందు..
ఆడ వేసం బెడిసికొడితే
మొలిచినట్టు పెట్టుకునే మీసం
పింగళి వారి జమానా
నవ్వుల నజరానా!
దేవ కన్యల్ని పెళ్లాడిన ఎన్టీఆర్
దేవ గాంధర్వ గాత్రంతో
శిలనే కరిగించిన ఘంటసాల..
అద్భుతమైన గానంతో
దివ్యరమణులను..
పద్యాలతో ఇంద్రసభను
జయించిన నందమూరి..
అందం ఆయన వంతు..
మధురాతి మధురం
మాస్టారి గొంతు..
కోరికలు చెప్పమన్న
ముక్కామల తంతు..
మురిసిన జగజిత్తు..
మొత్తానికి జగదేకవీరుని కథ
మిక్కిలినేని సభలోని సుధ..
హలా..అంటూ
మురిసిన వసుధ!!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286