కుట్రలు, కుతంత్రాలకు బిజెపి పెట్టింది పేరు

-మోదీ, అమిత్ షాలు అడ్డుపడ్డా గెలుపు నాపలేరు
-నడ్డా వచ్చి అడ్డా వేసినా గులాబీదే విజయం
-జాతీయ పార్టీ ప్రకటనతోబెంబేలెత్తుతున్న కమలనాథులు
-రాత్రికి రాత్రే ఎన్నికల ప్రకటన అందులో భాగమే
-మాతో పోటీ పడేది కాంగ్రెస్ పార్టీనే
-మునుగోడు లో మూడో స్థానానికే బిజెపి పరిమితం
-మంత్రి జగదీష్ రెడ్డి

కుట్రలు కుతంత్రాలకు భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. అటువంటి కుతంత్రాలలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని ఆయన తేల్చిచెప్పారు. ఎవరెన్ని కుట్రలకు తెర లేపినా అంతిమ విజయం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టి ఆర్ యస్ పార్టీ దే నని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రకటన వెలువడిన నేపద్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియా తో మాట్లాడారు.

ఢిల్లీ బాదుషా లకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు వింటేనే హడలిపోతున్నారన్నారు.జాతీయ రాజకీయాల్లోకి వస్తామంటూ అధికారికంగా ప్రకటించారో లేదో 24 గంటల్లోనే మునుగోడు ప్రకటన వెలువడిందని ఆయన తెలిపారు. వాస్తవానికి అమిత్ షా మునుగోడు పర్యటన ముగిసిన మరుసటి రోజే ఎన్నికల ప్రకటన వస్తుందని భావించామన్నారు.అయితే పరిస్థితులు బిజెపి కి ఆశాజనకంగా కనిపించక పోయే సరికి వాయిదాల పద్ధతిని ఎంచుకున్నట్లు కనిపించిందన్నారు.

నిజానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే అక్కడి ప్రజలు టి ఆర్ యస్ గెలిపించాలని నిర్ణయించారన్నారు. ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షా లు అడ్డుపడ్డా నడ్డా వచ్చి ఇక్కడే అడ్డా వేసినా గులాబీ గెలుపును ఆపడం వారి తరం కాదన్నారు. జాతీయ పార్టీ ప్రకటనతో కమలనాథులు బెంబేలెత్తి పోతున్నారని ఆయన చెప్పారు. రాత్రికి రాత్రే వచ్చిన మునుగోడు ఎన్నికల ప్రకటన అందులో భాగమే నన్నారు.మునుగోడు లో బిజెపి కి దక్కేది మూడో స్థానమే నని,ఇప్పటికీ మాతో పోటీ పడేది కాంగ్రెస్ పార్టీయే నని ఆయన తేల్చిచెప్పారు.

అయితే టి ఆర్ యస్ పార్టీకీ రెండో స్థానంలో ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ కు అంతరం చాలా దూరంలో ఉందని…బిజెపి మాత్రం కనుచూపు మేరలో లేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply