– సిగ్నల్ యాప్, ఫేస్ టైం యాప్ ల ద్వారా చాటింగ్, కాలింగ్?
– లిక్కర్ స్కాం విచారణ వ్యవహారాలపై అప్ డేట్స్ కోసమే?
– నిందితుల విచారణ సందర్భంలో వెలుగు చూసిన ఆసక్తికర అంశాలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సంబంధించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గాని, ఎన్నికల్లో ఓటమి తర్వాత గాని జగన్ మొబైల్ ఫోన్ వాడలేదు. తాను ఫోన్ వాడనని.. తనకు ఫోనే లేదని…నెంబర్ అసలే లేదని గతంలో చెప్పిన మాజీ సీఎం…నేడు సడన్ గా స్మార్ట్ ఫోన్ వాడకం మొదలుపెట్టారు. సాధారణంగా ఫోన్లకు, యాప్ లకు, గాడ్జెట్లకు దూరంగా ఉండే జగన్…తాజా పరిణామాల నేపథ్యంలో ఫోన్ కొన్నట్లు తెలుస్తోంది.
లిక్కర్ కేసుతో….
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. రూ.3200 కోట్ల విలువైన ఈ స్కాంలో విచారణ కీలక దశకు చేరుకుంది. కింగ్ పిన్ లు అరెస్టు అవుతున్నారు. నాడు సిఎంవో లో పనిచేసిన ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా అరెస్టు అవుతున్నారు. ఈ పరిణామాలు వైసీపీలో కొంత అలజడి సృష్టిస్తున్నాయి. ఈ అరెస్టులు ఎక్కడి వరకు వెళతాయి అనే విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
విచారణలో నిందితులు ఏం చెపుతున్నారు అనే అంశాలకు మీడియా, రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ ఐఫోన్ కొనుగోలు చేసి సొంతంగా వాడకం మొదలు పెట్టారు. కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు…..అప్ డేట్స్ తెలుసుకునేందుకు…తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు చేసేందుకు జగన్ ఫోన్ వాడకం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
సిగ్నల్ యాప్…..ఫేస్ టైం కాల్..
ఐఫోన్ అంటేనే భద్రత అని అంతా చెపుతారు. అయితే మాజీ సిఎం ఈ ఫోన్ లో సిగ్నల్ యాప్ ను వాడుతున్నట్లు తెలిసింది. ఈ సిగ్నల్ యాప్ కు సమాజం లో అంత ప్రాచుర్యం లేదు. ఈ యాప్ ద్వారా జరిపే చాట్ నిర్థిష్ట సమయంలో డిలీట్ అవుతుంది. పూర్తిగా చెరిగిపోతుంది. ఈ యాప్ లో జరిపే చర్చ ఎంత సమయంలో చెరిగిపోవాలి అనేది కూడా యూజర్ నిర్థారణ చేసుకోవచ్చు. ఈ మెసేజ్ లు ట్రాక్ చేయడం అసాధ్యం. ఇది ఎక్కడా క్లౌడ్ లో కూడా సేవ్ అవ్వదు. దీంతో రక్షణ పరంగా ఇది మంచి యాప్ గా చెపుతారు. అందుకే జగన్ దీన్ని సహచరులు, కేసులో నిందితులు, వ్యక్తిగత సిబ్బంది, లాయర్లతో సంప్రదింపులకు వాడుతున్నట్లు బయటపడింది.
మరోవైపు అవసరం అనుకుంటే ఫేస్ టైం యాప్ ద్వారా పరిమితంగా కాల్స్ లో మాట్లాడుతున్నట్లు కూడా విచారణ అధికారులు గుర్తించారు. ఈ కేసులో విచారణ సందర్భంగా జగన్ ఫోన్ వాడుతున్న విషయం, సిగ్నల్ యాప్, ఫేస్ టైం ద్వారా కమ్యూనికేషన్ నడుపుతున్న విషయం బయటకు వచ్చింది.
విచారణ అప్ డేట్స్ తెలుసుకుని అందుకు అనుగుణంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారనేది సమాచారం. అయితే కొసమెరుపు ఏంటంటే….జగన్ వాడుతున్న ఫోన్ లో సిమ్ కార్డు జగన్ పేరుతో లేదని…..తమకు అత్యంత నమ్మకమైన వ్యక్తి ద్వారా తీసుకున్న సిమ్ కార్డును వాడుతున్నారని తెలిసింది. ఏది ఏమైనా లిక్కర్ కేస్ జగన్ ను కొత్త ఫోన్ కొని వాడేలా చేసింది.